Unbreakable Bonds: అపురూప బంధం
ABN , Publish Date - Aug 09 , 2025 | 02:33 AM
బాలీవుడ్‌లో స్టార్లుగా ఎదిగిన అన్నాచెల్లెళ్లు చాలామందే ఉన్నారు. కానీ రక్తం పంచుకొని పుట్టకపోయినా...
బాలీవుడ్‌లో స్టార్లుగా ఎదిగిన అన్నాచెల్లెళ్లు చాలామందే ఉన్నారు. కానీ రక్తం పంచుకొని పుట్టకపోయినా... తోబుట్టువుల్లా అపురూప బంధాన్ని కొనసాగిస్తున్న తారలు అరుదుగా కనిపిస్తారు. వారే వీరు...

గౌరీఖాన్- సాజిద్‌ఖాన్
హీరో షారూక్ ఖాన్ సతీమణిగానే కాకుండా... నిర్మాతగా, ఇంటీరియర్ డిజైనర్‌గా పేరు సంపాదించిన వ్యక్తి గౌరీఖాన్. ‘హౌస్‌ఫుల్’ వరుస చిత్రాల దర్శకుడు, హాస్య నటుడు... సాజిద్‌ఖాన్. బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌తో గౌరీకి మొదటి నుంచీ మంచి స్నేహం. ఆమె ద్వారా సాజిద్ పరిచయమయ్యారు. నాటి నుంచీ అతడు గౌరీ కుటుంబంలో ఒక సభ్యుడయ్యారు. ఏటా క్రమం తప్పకుండా సాజిద్‌కు ఆమె రాఖీ కడుతున్నారు. చాలా సందర్భాల్లో సాజిద్ ఈ విషయం పంచుకున్నారు.

కరీనా కపూర్- మనీష్ మల్హోత్రా
కపూర్‌ల వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగు పెట్టింది మొదలు... కరీనా కపూర్ పేరు నిత్యం వార్తల్లో ఉంటోంది. ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. చూపు తిప్పుకోనివ్వని అందంతో... మంత్రముగ్ధులను చేసే హావభావాలతో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకొని, బిడ్డకు జన్మనిచ్చిన కరీనా... సినిమాలు, వెబ్‌సిరీ్‌సలతో మళ్లీ బిజీగా మారారు. కెరీర్‌లో తనతో కలిసి ప్రయాణించి, తన ఎదుగుదలలో భాగమైనవారిని తన కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అలాంటివారిలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఒకరు. ప్రతి సంవత్సరం అతనికి కరీనా రాఖీ కడుతున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో దృఢమైన అన్నాచెల్లెళ్ల బంధాల్లో ఒకటిగా చెప్పుకొనే వీరి అనురాగబంధం ఇవాల్టిది కాదు... ఎన్నో ఏళ్లనాటిది.

కత్రినా కైఫ్- అర్జున్ కపూర్
మోడల్‌గా మెరిపించి... తారగా వెలిగిన కత్రినా కైఫ్... హీరో విక్కీ కౌశల్‌తో పెళ్లి తరువాత సినిమాలు తగ్గించారు. నచ్చిన ప్రాజెక్టులు మాత్రమే చేస్తూ కుటుంబం కోసం సమయం కేటాయిస్తున్నారు. నటుడు అర్జున్ కపూర్. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనయుడుగా రంగప్రవేశం చేసినా, హీరోగా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. అయితే అగ్రనటుడు సల్మాన్‌ఖాన్ ద్వారా కత్రినాకు పరిచయమైన అర్జున్... నేటికీ ఆమెతో ఆత్మీయ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అర్జున్‌ను తన తమ్ముడిలా చూసుకొంటూ ఆప్యాయతలు పంచుతోంది కత్రినా. ఏటా రక్షాబంధన్ రోజున అతడికి రాఖీ కడుతున్నారు.

అలియాభట్- యష్ జోహార్
బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరు అలియా భట్. అద్భుతమైన అభినయంతో వెండితెరపై పాత్రను ఎంతలా పండిస్తున్నారో... నిజ జీవితంలోనూ ఇల్లాలిగా, తల్లిగా, తనయగా అంతే సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు... ఆమెకు రాఖీ పండుగ చాలా ప్రత్యేకం. శ్రావణ పౌర్ణమినాడు స్టార్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తనయుడు యష్ జోహార్‌కు అలియా రాఖీ కట్టడం... కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఒక ఆనవాయితీ. పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు నుంచీ కరణ్‌తో ఆమెకు మంచి స్నేహం ఉంది. వాళ్ల ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా మెలుగుతున్నారు.

ఐశ్వర్యా రాయ్- సోనూసూద్
రీల్ లైఫ్‌లో కనిపించిన బంధాలు కొన్ని రియల్ లైఫ్‌లోనూ కొనసాగుతుంటాయి. అది మనసులు కలిపే ప్రేమ బంధమే కానక్కర్లేదు. అన్నాచెల్లెళ్ల అనురాగ బంధమూ కావచ్చు. అలాంటిదే ఐశ్వర్యారాయ్, సోనూసూద్‌ల అనుబంధం. హృతిక్ రోషన్ హీరోగా చేసిన ‘జోధా అక్బర్’ చిత్రంలో వీరిద్దరూ తోబుట్టువులుగా నటించారు. ఈ అన్నాచెల్లెళ్ల బంధం నిజ జీవితంలోనూ కొనసాగుతోంది. సినిమా సెట్‌లో రాఖీ కట్టినప్పటి నుంచీ సోనూ ఆమెకు తన సొంత సోదరి కంటే ఎక్కువగా ప్రేమానురాగాలు పంచుతున్నారు.