Share News

Bollywood Stars Redefine Luxury: విలాసాల వ్యాన్స్‌

ABN , Publish Date - Oct 04 , 2025 | 02:49 AM

రణ్‌వీర్‌ సింగ్‌ షూటింగ్‌కు వెళ్లాలంటే అతని వెంట ఏకంగా మూడు వ్యానిటీ వ్యాన్లు ఉండాల్సిందే! వాటిలో ఒకటి వ్యక్తిగత అవసరాల కోసమైతే, రెండోది వ్యాయామం కోసం....

Bollywood Stars Redefine Luxury: విలాసాల వ్యాన్స్‌

తారల వ్యానిటీ వ్యాన్లు నేడు హోదాలకు చిహ్నాలుగా మారిపోయాయి. హంగులు, అలంకరణల్లో ఏమాత్రం రాజీ పడని తారలు, వ్యానిటీ వ్యాన్లు వైభోగాలకు ప్రతిరూపాల్లా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి కొందరు బాలీవుడ్‌ తారల వ్యానిటీ వ్యాన్ల గురించిన ఆసక్తికరమైన విశేషాలివి.

రణ్‌వీర్‌ సింగ్‌ షూటింగ్‌కు వెళ్లాలంటే అతని వెంట ఏకంగా మూడు వ్యానిటీ వ్యాన్లు ఉండాల్సిందే! వాటిలో ఒకటి వ్యక్తిగత అవసరాల కోసమైతే, రెండోది వ్యాయామం కోసం, మూడోది వ్యక్తిగత వంటవాడి కోసం. ఇక షారూఖ్‌ ఖాన్‌ వ్యానిటీ వ్యాన్‌ ఎంతో పెద్దగా ఉంటుంది. ఈ వ్యాన్‌ను షారూఖ్‌... దుబాయి నుంచి దిగుమతి చేసుకుని, తనకు తగ్గట్టు మెరుగులు దిద్దించుకున్నాడు. కారు అంతర్గత అలంకరణ బాధ్యతను సుప్రసిద్ధ కార్ల డిజైనర్‌, దిలీప్‌ ఛాబ్రియా తీసుకున్నాడు. షారూఖ్‌, ఈ కారు నిర్మాణానికి 4 నుంచి 5 కోట్ల రూపాయలను వెచ్చించాడు. ఆ విలాసవంతమైన వ్యాన్‌ మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లోని ఇరుకైన వీధుల్లో తిరగలేదు. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో షూటింగ్‌ల కోసం వ్యానిటీ వ్యాన్‌ వెండర్‌ కేతన్‌ వ్యానును అరువు తీసుకుంటూ ఉంటాడు. ఇక సల్మాన్‌ ఖాన్‌ వ్యానిటీ వ్యాన్‌లో అతని నిలువెత్తు ఫొటో ఉంటుంది. దీన్లో అవసరమైన విలాసాలన్నీ ఉంటాయి. అనూష్క శర్మ వ్యానిటీ వ్యాను స్కాండినేవియన్‌ శైలిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. వరుణ్‌ ధావన్‌ వ్యానిటీ వ్యానులో గేమింగ్‌ కన్‌సోల్స్‌, అతి పెద్ద బెడ్‌ ఉంటాయి. కొందరు తారలు తమదైన ప్రత్యేకమైన శైలిని వ్యాన్‌ ఇంటీరియర్‌లో కనబరచాలనుకుంటారు. అలాంటి వాళ్లలో జాన్‌ అబ్రహామ్‌ ఒకడు. నలుపు రంగును అమితంగా ఇష్టపడే జాన్‌ తన వ్యాన్‌లో టాయ్‌లెట్‌ను కూడా నలుపు రంగులోనే డిజైన్‌ చేయించుకున్నాడు. అలాగే బయటి వెలుగు వ్యాన్‌లోకి ప్రసరించడం కోసం, బయటి ప్రపంచాన్ని చూడడం కోసం ఫ్లోరింగ్‌ నుంచి సీలింగ్‌ వరకూ అద్దాలను ఏర్పాటు చేయించుకున్నాడు. ఇక నటి కంగనా రనౌత్‌ తన వ్యానిటీ వ్యాన్‌ను అత్యంత ఖరీదైన షీషమ్‌ కలపతో తయారుచేయించుకుంది.


ఆకాశాన్నంటే ధరలతో...

ఒక వ్యాన్‌ తయారీకి అయ్యే ఖర్చు సగటున పది నుంచి 15 లక్షల వరకూ ఉంటుంది. బహుళ గదులు, లివింగ్‌ స్పేస్‌ను విస్తరించుకునే వీలున్న సూపర్‌ వ్యాన్‌ ఖరీదు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు. ఇటాలియన్‌ మార్బుల్‌, విలాసవంతమైన రిక్లైనర్లు, జిమ్‌ సౌకర్యాలు కలిగి ఉండే వ్యాన్‌ 75 లక్షల నుంచి కోటి రూపాయలు. సాధారణ సోఫాలు, ఒక చిన్న ప్యాంట్రీ, చిన్నపాటి స్నానాల గది, టీవి కలిగి ఉండే మధ్యస్థ వ్యాను 30 నుంచి 50 లక్షల రూపాయలు. డ్రెస్సింగ్‌ ఏరియా, ఏసి మాత్రమే కలిగి ఉండే సాధారణ వ్యాను 15 నుంచి 20 లక్షల రూపాయలు. వ్యానిటీ వ్యాన్లను తారలకు నచ్చినట్టు రూపొందించే వెండర్‌ కేతన్‌ రావల్‌ వ్యానిటీ వ్యాన్ల కొత్త పోకడల గురించి మాట్లాడుతూ... ‘మొదట్లో అవసరాల ఆధారంగా వ్యాన్లు తయారయ్యేవి. మారుమూల ప్రాంతాల్లో షూటింగ్‌ జరిగేటప్పుడు అక్కడ దుస్తులు మార్చుకునే వెసులుబాట్లు, సేద తీరే సౌలభ్యాలు లేకపోవడంతో తారల సినీ జీవితాల్లోకి వ్యానిటీ వ్యాన్లు ప్రవేశించాయి. కాలక్రమేణా అవి వారి హోదాలకు చిహ్నాలుగా మారిపోయాయి. జాన్‌ అబ్రహామ్‌ నలుపు రంగును ఇష్టపడతాడు. కాబట్టి వ్యాన్‌లో ఫ్లోరింగ్‌ నుంచి సింక్‌, టాయ్‌లెట్‌ వరకూ అన్నీ నలుపు రంగులోనే రూపొందించాలని నన్ను అడిగాడు’’ అంటూ వివరించాడు. వ్యానిటీ వ్యాన్లు నిర్మించే మరొక వ్యక్తి ప్రతీక్‌ మలేవార్‌, కంగనా రనౌత్‌ వ్యానిటీ వ్యానును షీషమ్‌ కలపతో డిజైన్‌ చేశాడు.


8.jpg

షారూఖ్‌ బస్సులో...

వాల్వో బిఆర్‌9 బస్సు ఫ్లోర్‌ మొత్తం నలుపు రంగు గాజుతో తయారైంది. పైకప్పు మొత్తం ఉడెన్‌ ప్యానల్స్‌ పరిచి ఉంటాయి. దీన్లో ప్యాంట్రీ సెక్షన్‌, వార్డ్‌రోబ్‌ సెక్షన్‌, ప్రత్యేకమైన మేకప్‌ కుర్చీ, ప్రత్యేకమైన టాయ్‌లెట్‌లు ఉంటాయి. దీన్లో ఇన్‌బిల్ట్‌ షవర్‌ ఉంది. ఒక బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ పరిమాణంలో ఉంటుంది. ఈ బస్సులో అమర్చి ఉండే ఎలక్ట్రిక్‌ ఛైర్‌ ఒక మీట నొక్కితే బస్సులో ఈ మూల నుంచి ఆ మూలకు తీసుకువెళ్తుంది. పార్కు చేసి ఉన్నప్పుడు ఈ బస్సులో ఒక వైపు భాగాన్ని విస్తరించుకునే వీలుంటుంది.

Updated Date - Oct 04 , 2025 | 02:49 AM