Vintage Saree Culture with Narige Story: పాతకాలపు చీరలకు కొత్త వైభవం
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:56 AM
పాత రోత, కొత్త వింతగా చలామణి అవుతున్న నేటి ఆధునిక యుగంలో పాతకాలపు చీరలకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాలనుకుంది ఒక జంట. అందుకోసం ఇంజనీరు ఉద్యోగాలకు...
వినూత్నం
పాత రోత, కొత్త వింతగా చలామణి అవుతున్న నేటి ఆధునిక యుగంలో పాతకాలపు చీరలకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాలనుకుంది ఒక జంట. అందుకోసం ఇంజనీరు ఉద్యోగాలకు రాజీనామా చేసి, పూర్వానుభవం లేని చీరల వ్యాపారంలోకి అడుగుపెట్టి, నేడు నెలకు కోటి రూపాయలను ఆర్జించే స్థాయికి ఎదిగింది. వినూత్నమైన ఆలోచనతో విజయం సాధించిన బెంగుళూరుకు చెందిన దంపతులు, పూజ నడిగ్, శశాంక్ శివపురపుల ఆసక్తికరమైన కథ ఇది...
బెంగళూరుకు చెందిన పూజ, బి.ఎమ్.ఎస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదివింది. ఆ తర్వాత టిసిఎ్‌సలో ఐదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ విభాగంలో కొనసాగింది. మంచి సంపాదన, చేతి నిండా పని. అయినా ఎక్కడో ఏదో అసంతృప్తి. శశాంక్ కూడా హైదరాబాద్‌కు చెందిన సివిఆర్ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కెరీర్ మార్చి, హెచ్‌పి సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాడు. అక్కడ కూడా ఇమడలేక చిన్న స్టార్టప్ మొదలుపెట్టి, అనుభవరాహిత్యంతో దానికి మధ్యలోనే గుడ్‌బై చెప్పేశాడు. ఆ సమయంలోనే వాళ్లిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ప్రేమలో పడ్డారు. అయితే పెళ్లికి ముందే, జీవితంలో స్థిరత్వం సాధించాలనే ఆలోచనతో ఆ తర్వాత శశాంక్ ఫిలిప్పైన్స్ వెళ్లి ఎమ్‌బిఎ చేశాడు. ఆ అనుభవంతో ఒక చిన్న వ్యాపారంలోకి దిగాడు. 2019లో వాళ్లిద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. ఎమ్‌బిఎ పూర్తి చేసిన శశాంక్‌కు సాంకేతిక రంగంలో అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అలా అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో పూజ... ఇంజినీర్ ఉద్యోగానికి స్వస్థి చెప్పి, చీరల వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయాన్ని శశాంక్‌తో పంచుకున్నప్పుడు, అతను సందిగ్ధంలో పడిపోయాడు. కానీ చీరల డిజైనింగ్ పూజకు కొత్త కాదు. ఆమె ముందు నుంచే తన దుస్తులను తానే స్వయంగా డిజైన్ చేసుకుని కుట్టించుకుంటూ ఉంటుంది. పాత చీరల పట్ల మక్కువతో అమ్మమ్మ బీరువాలో నుంచి ఆవిడ చీరలను తీసుకొని, వేడుకలకు కట్టుకుంటూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న శశాంక్... పూజ ఆలోచనతో ఏకీభవించాడు. కానీ అదే సమయంలో కొవిడ్ లాక్‌డౌన్ మొదలైంది. దాంతో చీరల వ్యాపారానికి సంబంధించి చక్కని ప్రణాళిక రూపొందించుకోడానికి వాళ్లిద్దరికీ సరిపడా తీరిక చిక్కింది. అలా కొవిడ్ కాలంల... ఇద్దరూ ఉద్యోగాలకు స్వస్తి పలికి, ‘నరిగె స్టోరీ’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తమ చీరల వ్యాపారానికి శ్రీకారం చుట్టారు.
అంచెలంచెలుగా ఎదిగి...
ప్రారంభంలో శశాంక్ ఫొటోగ్రాఫర్‌గా, పూజ మోడల్‌గా ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్ రీల్స్, ఫొటోస్‌ను రూపొందించుకున్నారు. అప్పటికే విపణిలో ఉన్న చీరల స్థానాన్ని అధిగమించాలనే ఆలోచన వాళ్లకు లేదు. మనుగడలో ఉన్న చీరల సామ్రాజ్యంలో ఖాళీలను భర్తీ చేయాలనే సంకల్పం మాత్రం మెండుగా ఉంది. పలు రకాల పోకడలు, పలు రకాల శైలులు రాజ్యమేలుతున్న ఆధునిక యుగంలో పాతకాలపు చీరలు కనుమరుగైపోతూ ఉండడం పూజ భరించలేకపోయింది. ఆ చీరల ప్రాశస్థ్యాన్ని, ప్రత్యేకతలను చాటడంతో పాటు, పాతచీరలకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో, తన వ్యాపారానికి ‘నరిగె స్టోరీ’ అనే పేరును ఎంచుకుంది. కన్నడంలో ‘నరిగె’ అంటే ‘కుచ్చిళ్లు’ అని అర్థం. పాతకాలపు చీరల వైపు మహిళలను ఆకర్షించడానికి అదే తగిన పేరని భావించిందామె. చీర తయారీ, నేతల పుట్టుపూర్వోత్తరాలను తెలుపుతూ, వాటి ప్రత్యేకతను సగర్వంగా చాటుకోగలిగేలా మహిళలను ఆకట్టుకోగలిగిందామె.

పాతకాలపు పేర్లు, రంగుల్లో...
1950ల నాటి శైలులను ప్రతిబింబించే నరిగె నేత చీరలు ప్రధానంగా దక్షిణ భారతీయ సాంస్కృతిక మూలాలనూ, కళాత్మకతలనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి. రూపొందే ప్రాంతాల పేర్లనే చీరలకు పెట్టడంతో పాటు, పాతకాలపు కాఫీ బ్రౌన్, నీలం రంగు చీరలను కూడా పరిచయం చేస్తోంది పూజ. ఆమె విక్రయించే చీరల్లో, సిహి నెనపు, గగన మయూరి, ఇరవు వానం, లాల్ ఇష్క్ పేర్లతో చీరలున్నాయి. వారణాసి, మధురై, తమిళనాడు, కర్నాటక, జైపూర్, కోల్‌కతాలలోని చేనేత కళాకారుల చేత ప్రత్యేకంగా వస్త్రాలను నేయించి, వాటిని స్వయంగా చీరల రూపంలో డిజైన్ చేయడం ‘నరిగె స్టోరీ’ ప్రత్యేకత. ఈ చీరలన్నీ 2 వేల నుంచి 25 వేల రూపాయల ధర పలుకుతాయి. 2021లో 30 లక్షల వార్షిక ఆదాయాన్ని ఆర్జించిన ‘నరిగె స్టోరీ’ ఇప్పుడు నెలకు కోటి రూపాయలను ఆర్జించే స్థాయికి ఎదిగింది.
‘‘మేం కేవలం చీరలను విక్రయించడం లేదు... చీరల రూపంలో ఆనందాన్ని విక్రయిస్తున్నాం. మరుగున పడిపోయిన పాత జ్ఞాపకాలను, అనుబంధాలనూ తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం’’ అంటున్న పూజ... అంతరించిపోతున్న చీరల సంస్కృతికి నరిగె చీరలతో పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టడంలో విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు
PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు