Share News

Health Tips: తాజా తాజా చట్నీలు

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:37 AM

ఆవకాయ, మాగాయి, నిమ్మకాయ... ఇలా రకరకాల నిల్వ పచ్చళ్లు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని... అందువల్ల ఎక్కువగా తినవద్దని...

Health Tips: తాజా తాజా చట్నీలు

ఆవకాయ, మాగాయి, నిమ్మకాయ... ఇలా రకరకాల నిల్వ పచ్చళ్లు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని... అందువల్ల ఎక్కువగా తినవద్దని... తాజా కూరగాయలతో తయారుచేసిన పచ్చళ్లనే తినమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. అలాంటి కొన్ని పచ్చళ్ల తయారీ... మీ కోసం.

kk.jpg

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ చట్నీ

కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయ ముక్కలు- పావు కప్పు, తరిగిన పచ్చిమిర్చి- రెండు చెంచాలు, తరిగిన అల్లం: అర చెంచా, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, పసుపు- అర చెంచా, టమోటా ముక్కలు- ఒక కప్పు, కేరట్‌- అర కప్పు, బీన్స్‌- పావు కప్పు, కాలీఫ్లవర్‌- అర కప్పు, తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు, చింతపండు రసం- రెండు చెంచాలు, పంచదార- ఒక చెంచా, ఉప్పు- తగినంత, నూనె- పావు కప్పు, ఆవాలు- ఒక చెంచా, మినపప్పు- ఒక చెంచా, జీలకర్ర- ఒక స్పూను, ఎండు మిరపకాయలు- రెండు, ఇంగువ- తగినంత

తయారీ విధానం:

కేరట్‌, బీన్స్‌, కాలీఫ్లవర్‌ ముక్కలను కుక్కర్‌లో ఒక విజిల్‌ వచ్చేదాకా ఉడికించాలి. ఆ తర్వాత బయటకు తీసి చల్లార్చాలి.

ఒక మూకుడులో నూనె తీసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. చివరగా పసుపు వేయాలి.

ఆ మిశ్రమంలోనే టమోటాలు వేసి ఉడకనివ్వాలి. తరువాత ఉడికించిన కూర ముక్కలు వేయాలి. పంచదార కలపాలి.

కూర ముక్కల్లోని నీళ్లు ఆవిరి అయ్యేదాకా మగ్గనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కిందకు దింపి చల్లారనివ్వాలి.

ఒక మిక్సీలో ఈ మిశ్రమాన్ని, కొత్తిమీర, చింతపండు రసం, ఉప్పు వేసి ముద్దగా చేయాలి. దీనిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

వేరే మూకుడులో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిని గిన్నెలోని పచ్చడిలో కలపాలి.

జాగ్రత్తలు:

పంచదార వేయటంవల్ల పచ్చడిలో ఉన్న ఆమ్ల లక్షణాలు తొలగిపోతాయి. తినటానికి కమ్మగా ఉంటుంది.

ఈ పచ్చడిలో టమోటా ముక్కలు ఎక్కువ వేయకూడదు.


j';.jpg

ముల్లంగి ఆకుల చట్నీ

కావాల్సిన పదార్థాలు:

తరిగిన కొత్తిమీర- అర కప్పు, ముల్లంగి ఆకులు- అర కప్పు, ముల్లంగి ముక్కలు- పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, పచ్చిమిర్చి ముక్కలు- రెండు చెంచాలు, తరిగిన అల్లం ముక్కలు- అర చెంచా, నూనె- రెండు చెంచాలు, నిమ్మకాయ రసం- నాలుగు చెంచాలు, ఉప్పు- తగినంత

తయారీ విధానం:

మూకుడులో నూనె వేసి కొత్తిమీర, ముల్లంగి ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి.

ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ముద్దగా చేయాలి.

ఆ మిశ్రమంలోనే ముల్లంగి ముక్కలు, ఉప్పు వేసి బాగా ముద్దగా చేయాలి. అందులో నిమ్మకాయ రసం కలపాలి.

జాగ్రత్తలు:

కొన్నిసార్లు ముల్లంగి చేదుగా ఉంటుంది. అలాంటి ముల్లంగిని వాడకూడదు. లేత ముల్లంగి ఆకులతో మంచి రుచి వస్తుంది.

నిమ్మ రసం కూడా తగినంత చేర్చుకోవాలి. నిమ్మ రసం ఎక్కవ అయినా రుచి బాగుండదు.


fdibh.jpg

చేమ ఆకుల చట్నీ

కావాల్సిన పదార్థాలు:

సన్నగా తరిగిన చేమ ఆకులు- రెండు కప్పులు, పచ్చిమిర్చి ముక్కలు- మూడు స్పూన్లు, చింతపండు రసం- రెండు చెంచాలు, బెల్లం పొడి- రుచికి తగినంత, కొబ్బరి తురుము- నాలుగు చెంచాలు, వేయించిన నువ్వులు- రెండు చెంచాలు, నూనె- పావు కప్పు, తరిగిన కొత్తిమీర- రెండు స్పూన్లు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

తయారీ విధానం:

ఒక మూకుడులో నూనెను వేడి చేయాలి. దీనిలో చేమ ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి.

ఈ మిశ్రమంలో చింతపండు రసం, బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడకబెట్టాలి. కిందకు దింపి చల్లార్చాలి.

మరో మూకుడులో కొబ్బరి తురుము, నువ్వులు దోరగా వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

ఈ పొడిలో చేమ ఆకుల మిశ్రమం, ఉప్పు వేసి ముద్దగా చేసుకోవాలి. తరిగిన కొత్తిమీర కలపాలి.

జాగ్రత్తలు:

లేత చేమ ఆకులు రుచిగా ఉంటాయి. అయితే ఇవి ఉడకటానికి మామూలు ఆకుకూరల కన్నా ఎక్కువ సమయం పడుతుంది.

బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చు.

Updated Date - Jan 18 , 2025 | 04:40 AM