Share News

Chia Seeds: ఈ గింజలు ఔషధంలా పని చేస్తాయి

ABN , Publish Date - Jan 19 , 2025 | 02:47 AM

చియా గింజలను సాధారణంగా సలాడ్స్‌, స్మూతీలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరి నీళ్లలో కలుపుకుని తీసుకుంటూ ఉంటారు.

Chia Seeds: ఈ గింజలు ఔషధంలా పని చేస్తాయి

చియా గింజలను సాధారణంగా సలాడ్స్‌, స్మూతీలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరి నీళ్లలో కలుపుకుని తీసుకుంటూ ఉంటారు. ఇవి శరీరాన్ని నాజూగ్గా ఉంచడంతోపాటు అంతర్గత అవయవాలను శుద్ది చేసి జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. రాత్రి పూట చియా గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియకు: చియా గింజల్లో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. తరచూ చియా గింజలను తీసుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడి జీర్ణాశయం పరిశుభ్రమవుతుంది. మలబద్దకం లాంటి సమస్యలు రావు.

బరువుకు: ఈ గింజలను నీటిలో నానబెట్టినపుడు అవి అధికంగా నీటిని పీల్చుకుని జెల్లీ రూపంలోకి మారతాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే కడుపులో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీంతో ఏదోఒకటి తినాలనే కోరిక తగ్గి ఆకలి అనిపించదు. క్రమంగా శరీర బరువు నియంత్రణలోకి వస్తుంది.

కండరాలకు: చియా గింజల్లో అత్యధికంగా ప్రోటీన్లు, అమైనోయాసిడ్లు ఉంటాయి. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. కండరాల నొప్పి, నరాల బలహీనత, మోకాళ్ల నొప్పులు తదితర సమస్యలను నివారిస్తాయి.

గుండెకు: చియా గింజలు తినడం వల్ల శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ లభిస్తాయి. దీనివల్ల రక్తంలో లిపిడ్‌ ప్రొఫైల్‌ పెరిగి గుండె జబ్బులు దరిచేరవు.

ఎముకలకు: చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌ ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ చియా గింజలను తీసుకోవడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. ఎముకలు పెళుసుగా మారడం, ఆర్థరైటిస్‌ లాంటి సమస్యలు తగ్గుతాయి.

Updated Date - Jan 19 , 2025 | 02:47 AM