Share News

Sweet Treats for the Festival Table: పండుగ రోజునపసందుగా..!

ABN , Publish Date - Oct 18 , 2025 | 03:44 AM

వెన్నను కరిగించి అందులో ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ కలపాలి. పేనీలను గిన్నెలోకి తీసుకుని చేత్తో చిదిమి పొడిలా చేయాలి. ఇందులో కరిగించి పెట్టుకున్న వెన్న వేసి కలపాలి....

Sweet Treats for the Festival Table:  పండుగ రోజునపసందుగా..!

బక్‌లావా

కావాల్సిన పదార్థాలు

  • మైదా పిండి- రెండు కప్పులు, నూనె- మూడు చెంచాలు, ఉప్పు- అర చెంచా, వెనిగర్‌- రెండు చెంచాలు, జీడిపప్పు- అర కప్పు, పిస్తా- అర కప్పు, బాదం- అర కప్పు, కరిగిన నెయ్యి- అర కప్పు, పంచదార- ఒక కప్పు, లవంగాలు- రెండు, రోజ్‌ ఎసెన్స్‌- ఆరు చుక్కలు

తయారీ విధానం

  • బ్లెండర్‌లో జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులను విడివిడిగా వేసి కచ్చాపచ్చాగా పొడి చేయాలి. వాటన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి.

  • ఒక గిన్నెలో మైదా పిండి, నూనె, ఉప్పు, వెనిగర్‌ వేసి బాగా కలపాలి. ఆపైన అర కప్పు నీళ్లను కొద్దికొద్దిగా చిలకరిస్తూ, మెత్తని ముద్దలా చేయాలి. దీనిమీద మూతపెట్టి అరగంటసేపు నాననివ్వాలి. తరువాత పిండిని చిన్న ఉండలుగా చేయాలి. చపాతీ పీట మీద ఒక్కో ఉండ పెట్టి, పొడి పిండి చల్లుతూ పలుచని చపాతీలు తయారు చేయాలి. వెడల్పాటి గిన్నెను తీసుకుని లోపల నెయ్యి రాయాలి. ఆపైన చపాతీని పరచాలి. దీనిమీద కూడా నెయ్యిరాసి మరో చపాతీ పరచాలి. ఇలా నెయ్యి రాసుకుంటూ మరో మూడు చపాతీలు పరచాలి. పైన ఉన్న చపాతీ మీద నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్‌ పొడి మొత్తం సమంగా పరచాలి. దీనిమీద మరో చపాతీ పెట్టి దానిమీద కూడా నెయ్యి రాయాలి. ఇలా మరో నాలుగు చపాతీలను నెయ్యి రాసుకుంటూ పరచాలి. చివరగా పెట్టిన చపాతీ మీద కూడా నెయ్యి రాయాలి. ఈ గిన్నెను ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. తరువాత గిన్నెను బయటికి తీసి చాకుతో ఆ చపాతీలను గిన్నెలోనే ముక్కలుగా కోయాలి. ప్రతి ముక్క మీద ఒక చెంచా నెయ్యి వేయాలి. అవెన్‌ లేదా ఎయిర్‌ ఫ్రయర్‌ను 180 డిగ్రీల వద్ద పది నిమిషాలపాటు ప్రీ హీట్‌ చేయాలి. తరువాత అందులో చపాతీల గిన్నెను ఉంచి అర గంట సేపు బేక్‌ చేయాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నెను పెట్టి అందులో పంచదార, లవంగాలు, రోజ్‌ ఎసెన్స్‌ వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి. పంచదార కరిగి గులాబ్‌జామ్‌ పాకంలా తయారైన తరువాత స్టవ్‌ మీద నుంచి దించాలి. అవెన్‌ లేదా ఎయిర్‌ ఫ్రయర్‌ నుంచి గిన్నెను బయటికి తీసి ఎర్రగా బేక్‌ అయిన బక్‌లావాల మీద వేడి వేడి పంచదార పాకం పోయాలి. ఈ గిన్నె మీద మూతపెట్టి చల్లారనివ్వాలి. తరువాత ఒక్కో బక్‌లావాను పళ్లెంలోకి తీసి సర్వ్‌ చేసుకోవాలి.


2.jpg

కునాఫా

కావాల్సిన పదార్థాలు

  • పేనీలు- పావు కేజీ, వెన్న- 80 గ్రాములు, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌- చిటికెడు, పాలు- ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్‌- ఒక చెంచా, ఛీజ్‌- ఒక క్యూబ్‌, కేసర్‌ ఎసెన్స్‌- అర చెంచా, రోజ్‌ ఎసెన్స్‌- అర చెంచా, నెయ్యి- రెండు చెంచాలు, పంచదార- అర కప్పు, నిమ్మరసం- ఒక చెంచా, పిస్తా పలుకులు- అర కప్పు

తయారీ విధానం

  • వెన్నను కరిగించి అందులో ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ కలపాలి. పేనీలను గిన్నెలోకి తీసుకుని చేత్తో చిదిమి పొడిలా చేయాలి. ఇందులో కరిగించి పెట్టుకున్న వెన్న వేసి కలపాలి. చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌ వేసి అందులో నాలుగు చెంచాల పాలు చిలకరించి బాగా కలపాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో పాలు పోసి, రెండున్నర చెంచాల పంచదార వేసి మరిగించాలి. పాలు మరుగుతుండగా కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం వేసి కలపాలి. చిన్న మంట మీద అయిదు నిమిషాలపాటు కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత ఛీజ్‌ తురుం వేసి కలపాలి. ఛీజ్‌ కరిగిన వెంటనే కేసర్‌ ఎసెన్స్‌, రోజ్‌ ఎసెన్స్‌ వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఒక గిన్నెను తీసుకుని లోపల కొద్దిగా నెయ్యి రాయాలి. తరువాత పేనీల పొడిలో సగ భాగాన్ని వేసి సమంగా పరచాలి. దీనిమీద పాలు-కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని, ఆపైన మిగిలిన పేనీల పొడిని పరచాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి, అందులో చిన్న స్టాండ్‌ ఉంచి పది నిమిషాలు వేడి చేయాలి. తరువాత అందులో పేనీల పొడి పరిచిన గిన్నెను ఉంచి మూత పెట్టి చిన్న మంట మీద అరగంటసేపు ఉంచాలి. తరువాత స్టవ్‌ మీద నుంచి దించి కునాఫాను కొద్దిగా చల్లారనివ్వాలి.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి పంచదార వేసి అర కప్పు నీళ్లు పోసి కరిగించాలి. తరువాత నిమ్మరసం కలపాలి. పాకం జిగురుగా మారిన తరవాత కొద్దిగా ఆరెంజ్‌ కలర్‌, కేసర్‌ ఎసెన్స్‌ కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ పాకాన్ని కునాఫా మీద పోసి మూతపెట్టి అరగంటసేపు ఉంచాలి. తరువాత దీనిమీద పిస్తా పలుకులు చల్లి సర్వ్‌ చేసుకోవాలి. తియ్యని కునాఫాని పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - Oct 18 , 2025 | 03:44 AM