Share News

Polycystic kidney disorder: మూత్రపిండాల మీద ఓ కన్నేసి...

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:24 AM

కొన్ని జన్యుపరమైన వ్యాధులు, వేర్వేరు అవయవాలను కబళిస్తాయి. అలాంటిదే... ఆటోసోమల్‌ డామినెంట్‌ పాలీసిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌. ప్రధానంగా మూత్రపిండాలు, కాలేయం, పేగులు, గుండె, మెదడు రక్తనాళాలను ప్రభావితం చేసే ఈ ప్రాణాంతక వ్యాధి గురించీ, నివారణ చర్యల గురించీ తెలుసుకుందాం....

Polycystic kidney disorder: మూత్రపిండాల మీద ఓ కన్నేసి...

కొన్ని జన్యుపరమైన వ్యాధులు, వేర్వేరు అవయవాలను కబళిస్తాయి. అలాంటిదే... ఆటోసోమల్‌ డామినెంట్‌ పాలీసిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌. ప్రధానంగా మూత్రపిండాలు, కాలేయం, పేగులు, గుండె, మెదడు రక్తనాళాలను ప్రభావితం చేసే ఈ ప్రాణాంతక వ్యాధి గురించీ, నివారణ చర్యల గురించీ తెలుసుకుందాం!

ప్రతి వెయ్యి మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి జన్యుపరంగా సంక్రమిస్తుంది. తల్లితండ్రుల్లో ఒకరికి ఈ వ్యాధి ఉన్నప్పుడు, పిల్లలకు సంక్రమించే అవకాశాలు 50 శాతం మేరకు ఉంటాయి. తరాలు మారేకొద్దీ వ్యాధి తీవ్రత, ఉధృతి మరింత పెరుగుతుంది. కాబట్టి సకాలంలో వ్యాధిని గుర్తించి, నివారణ చర్యలు పాటించాలి. ఈ రుగ్మతను సమూలంగా అరికట్టే వీలు లేకపోయినప్పటికీ, ఉధృతిని అడ్డుకుని మూత్రపిండాలను కాపాడుకోగలిగే వీలుంది. జన్యు చికిత్సలు, ఆర్‌ఎన్‌ఎ ఆధారిత చికిత్సలతో మెరుగైన ఫలితాలుంటాయని పరిశోధనల్లో స్పష్టమైంది.

ఆటోసోమల్‌ డామినెంట్‌ పాలీసిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌లో...

  • ద్రవంతో నిండిన చిన్నపాటి తిత్తులు క్రమేపీ కిడ్నీలోని కణజాలాన్ని ఆక్రమిస్తాయి. దాంతో ఫిల్టర్ల స్థానంలో బెలూన్లను పోలిన తిత్తులు ఏర్పడతాయి

  • ఏళ్లు గడిచేకొద్దీ కిడ్నీలు పూర్తిగా వాచిపోయి, వాటి పనితీరు కుంటుపడుతుంది

  • సగానికి పైగా రోగులు కిడ్నీ మార్పిడి, డయాలసిస్‌ దశకు చేరుకుంటారు

  • కొందరికి కాలేయ సమస్యలు, మరికొందరికి మెదడు సమస్యలూ తలెత్తుతాయి

  • ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ప్రాణాంతక పరిస్థితి తలెత్తవచ్చు

  • గుండె కవాట లోపాలు, మూత్రపిండాల్లో రాళ్లు, హెర్నియా కూడా వేధించవచ్చు


లక్షణాల మీద ఓ కన్నేసి...

ఆటోసోమల్‌ డామినెంట్‌ పాలీసిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌ వ్యాధిని సకాలంలో గుర్తించాలంటే బయల్పడే లక్షణాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఎక్కువ మందికి 30 లేదా 40 ఏళ్ల వయసులో లక్షణాలు బయల్పడడం మొదలుపెడతాయి. అవేంటంటే....

  • వెన్ను లేదా డొక్కలో నొప్పి

  • కడుపు నిండిన భావన

  • మూత్రంలో రక్తం

  • తలనొప్పి

ఎడిపికెడి నియంత్రణ ఇలా...

  • రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి

  • వ్యాధి తొలి దశలో రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి

  • కాఫీ తగ్గించాలి. కాఫీ వ్యాధి తీవ్రత పెరుగుతుంది

  • ఈస్ట్రోజన్‌ కలిగిన గర్భనిరోధక మాత్రలు మానేయాలి

  • కిడ్నీ పనితీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ, తరచూ వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి

  • కిడ్నీలు 50 శాతం దెబ్బతినేవరకూ ఆగకుండా ప్రారంభంలోనే చికిత్స మొదలుపెడితే, కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం

  • తప్పుతుంది

ఇలా అప్రమత్తం

  • కుటుంబ చరిత్రలో ఎడిపికెడి ఉంటే, అల్ర్టాసౌండ్‌, ఎమ్మారై పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాల్లో సిస్టులు ఉన్నట్టు తేలితే, వెంటనే చికిత్స మొదలుపెట్టాలి

  • టోల్డాప్టాన్‌ అనే ఔషథంతో వైద్యులు మూత్రపిండాల వైఫల్యాన్ని అరికట్టగలుగుతున్నారు. ధర ఎక్కువే అయినప్పటికీ ఈ ఔషథంతో డయాలసి్‌సను కొన్నేళ్లపాటు వాయిదా వేయవచ్చు

  • ఈ వ్యాధి ఉన్న జంటలు గర్భానికి ముందే ఐవిఎఫ్‌, ప్రీ ఇంప్లాంటేషన్‌ జెనెటిక్‌ డయాగ్ససిస్‌ ద్వారా అండాలను పరీక్షించుకుని వ్యాధికి ఆస్కారం లేని అండాలతోనే గర్భం దాల్చాలి.

Updated Date - Dec 02 , 2025 | 04:24 AM