Anil Ravipudi: సినిమా బాగుంటే ఏదీ ఆపలేదు...
ABN , Publish Date - Jan 19 , 2025 | 02:56 AM
మూడేళ్లుగా సంక్రాంతికి వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. జాగా ఆయన తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కూడా విజయం సాధించింది.
మూడేళ్లుగా సంక్రాంతికి వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. జాగా ఆయన తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కూడా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడిని ‘నవ్య’ పలుకరించింది.
సినిమా విజయాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు?
ఇది నాకు మూడో సంక్రాంతి... మూడో విజయం... అంటే హ్యాట్రిక్. ఇది దిల్ రాజుగారితో ఆరో సినిమా. ప్రేక్షకులు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ విజయాన్ని ఇచ్చారు. అన్ని వర్గాలవారు ఈ సినిమాకు వస్తున్నారు. నవ్వుకుంటున్నారు. నిన్న రాత్రి మహే్‌షబాబు గారిని కలిశాం. ఆయనకు సినిమా బాగా నచ్చింది. మహే్‌షగారికి ఈ తరహా కామెడీ చాలా నచ్చుతుంది. ఆయనకు సెకండాఫ్ స్ర్కీన్‌ప్లే, బుడ్డాడు, ఉపేంద్ర లమ్హేల కామెడీ ఎంతో నచ్చాయి. సినిమా చూస్తున్నంతసేపూ ఆయన పిల్లలు సితార, గౌతమ్ నవ్వుతూనే ఉన్నారట!
ఈ మధ్యకాలంలో సినిమాల విజయాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోందనే వాదన వినిపిస్తోంది..!
సోషల్ మీడియా సినిమా ఫలితాలను ప్రభావితం చేస్తుందంటే నేను నమ్మను. సినిమాలో విషయం ఉంటే ఏ సోషల్ మీడియా ఆపలేదు. ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్ ఇవ్వగలిగితే వాళ్లే ఆ సినిమాను నెత్తిమీద పెట్టుకొని తీసుకువెళ్తారు. బావుంటే ఆడకుండా ఉండదు. సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ చేసినా విజయాన్ని ఆపలేరు. సినిమా బావుంటే- దాన్ని ఆపే శక్తి దేనికీ లేదు.
మీరు సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను, ప్రచారాలను పట్టించుకొంటారా?
సోషల్ మీడియాలో ట్రోల్స్ నా మీదే కాదు... అందరి మీద వస్తున్నాయి. వీటివల్ల ప్రభావితం అవుతున్నారు. అయితే ట్రోల్స్‌తో పాటుగా కొన్నిసార్లు ప్రశంసలు కూడా వస్తున్నాయి. జాగ్రత్తగా చూస్తే... సోషల్ మీడియా మన సమాజానికి ప్రతిబింబం. మంచి, చెడులు రెండూ ఉంటాయి. మంచితో పాటుగా వెళ్లిపోతే సమస్య ఉండదు. ఇక వ్యక్తిగతంగా నేను సోషల్ మీడియా ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోను. నా ఫ్రెండ్స్ కొందరు ట్రోల్స్‌వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. పట్టించుకోవద్దని వాళ్లకు కూడా చెబుతుంటాను. మనల్ని పొగిడేవాళ్లు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్లి, వాళ్ల ద్వారా ఆనందాన్ని పొందటం మంచిది. లక్ష మంది పొగుడుతున్నప్పుడు ఒకరిద్దరు విమర్శించినా పట్టించుకోకూడదు.

‘ఇప్పుడు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. వారు మారిపోయారు’ అనే వాదనలతో మీరు ఏకీభవిస్తారా?
‘ప్రేక్షకులు మారిపోయారు’ అనే వాదనను నేను వేరే కోణం నుంచి చూస్తాను. ప్రతి పదేళ్లకు ప్రేక్షకుల అభిరుచుల్లో తేడాలు వస్తాయి. దీనికి తగినట్లే కథలు, స్ర్కీన్‌ప్లే, నిర్మాణ పద్ధతుల్లో మార్పులు వస్తాయి. దీన్ని పట్టుకొని ముందుకు వెళ్లాలి. నా ఉద్దేశంలో హారర్, యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ- ఇలా అన్ని రకాల సినిమాలనూ చూసే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. వాళ్లను థియేటర్‌లకు రప్పించాలంతే!
సినిమాలో ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించకపోతే ప్రేక్షకులు థియేటర్‌కు రావటం లేదని కొందరు అంటున్నారు. మీరేమంటారు?
నాకు ఈ వాదన సరికాదని అనిపిస్తుంది. ‘డీజే టిల్లు’ను తీసుకోండి. దానిలో కొత్త ప్రపంచమేదీ లేదు కదా! ‘సంక్రాంతికి వస్తున్నాం’లో రాజమండ్రిలోని శివరాజు అనే కుటుంబంలోకి తీసుకువెళ్లగలిగాం. సినిమా నచ్చితే చాలు... చూస్తారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. కొవిడ్ తర్వాత ప్రేక్షకులు చాలా ఆలోచించి కానీ సినిమాలకు రావటం లేదు. అందువల్ల ట్రైలర్, టీజర్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ప్రేక్షకులకు అందించాలి. అప్పుడే వాళ్లు థియేటర్‌కు వస్తారు.
ప్రతి సీన్‌కు ఒక ఎలివేషన్, పావుగంటకు ఒక ట్విస్ట్ లేకపోతే ప్రేక్షకులు సినిమాలు చూడటం లేదనే వాదన కూడా ఉంది కదా!
స్టార్‌ల సినిమాల్లో ఇవి తప్పనిసరి. ఎందుకంటే స్టార్‌లతో తీసే సినిమాలలో హీరోని సెలబ్రేట్ చేయాలి. కథతో పాటుగా ఇలాంటి సెలబ్రేషన్‌వల్ల ప్రేక్షకుల్లో ఉత్సుకత పెరుగుతుంది. కథ, డ్రామా కన్నా హీరోని ఎంత ఎలివేట్ చేయగలిగితే అంత విజయం సాధిస్తుంది. స్టార్ హీరో చూడటానికి వెళ్లిన ఫ్యాన్స్... క్లాప్స్ కొట్టాలి. విజిల్స్ వేయాలి. అదే దర్శకుడి మొదటి లక్ష్యం. మిగిలినదంతా ఆ తర్వాతే! ఒకవేళ ఇలాంటి ఉత్సాహం కలిగించటంలో విఫలమయితే సినిమా ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఫ్యాన్స్‌కు ఉత్సుకత కల్పించి- మంచి కథను కూడా ఇవ్వగలిగితే అది నెక్ట్ లెవెల్ అవుతుంది. అద్భుతం అవుతుంది.
ఈ సెలబ్రేషన్ మూడ్‌లో పడిపోయి నిజమైన కథను మర్చిపోతున్నామా?
పాన్ ఇండియా మార్కెట్ విస్తరించిన తర్వాత ప్రతి రెండేళ్లకో, మూడేళ్లకో హీరో సినిమా వస్తోంది. అప్పుడు దాన్ని సెలబ్రేట్ చేయాల్సిందే! ఒకప్పుడు ఒక స్టార్‌వి ఆరేడు సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ఒకటే వస్తోంది. కొన్నిసార్లు రెండేళ్లకు ఒకటి వస్తోంది. మనకు ఆరుగురు పెద్ద స్టార్స్ ఉన్నారనుకుందాం. ఆరుగురి సినిమాలూ రావటం లేదు. అప్పటికి, ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి. నార్త్ మార్కెట్‌ను చూసుకోవాలి. అక్కడ ఎలాంటి సినిమాలు చూస్తున్నారో గమనించి- దానికి తగినట్లుగా తీయాలి. నార్త్ ఇండియాలో ఎలివేషన్స్, మాస్ కంటెంట్‌ను బాగా చూస్తున్నారు. దీనివల్ల మిగిలిన సినిమాలకు కొంత స్పేస్ చిక్కుతోంది.
ఈ ఉత్సాహంలో ఒకే రకం కథలు వస్తున్నాయనే విమర్శ కూడా ఉంది..!
ప్రేక్షకులు సినిమాలు చూడకపోతే అనుకోవాలి. ఇలాంటిసినిమాలకు బ్రహ్మరథం పడుతున్నప్పుడు అలాంటి కామెంట్ చేయటానికి నేను ఇష్టపడను. ఒక వర్గం ప్రేక్షకులు ఈ తరహా సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. అన్ని వర్గాలు వస్తున్నారా అంటే చెప్పలేను. కానీ మొదటి వారం రోజుల్లో కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా! ఈ సినిమాలను ఎంత మంది ప్రేక్షకులు చూస్తున్నారనే విషయం గమనిస్తే సినిమా విజయవంతమైందో లేదో తెలుస్తుంది కదా!
మలయాళంలో తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమాలు విజయవంతం అవుతాయి కదా...
మలయాళంలో తీసే సినిమాలు వేరుగా ఉంటాయి. వాళ్లు తక్కువ ఖర్చుతో త్వరగా తీస్తారు. కొన్ని సినిమాలైతే కోటి, రెండు కోట్ల రూపాయలతో అయిపోతాయి. మలయాళం ప్రేక్షకుల అభిరుచులు కూడా భిన్నంగా ఉంటాయి. అవి వాళ్లకు నచ్చుతాయి. మన ప్రేక్షకులు వేరు.
అయితే ఇదంతా తెలుగు ప్రేక్షకుల అభిరుచులవల్లే అంటారా?
మన డైరక్టర్లు కొన్ని తరహా సినిమాలు తీస్తే చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు. అదే తరహా సినిమాని ఇతర భాషా దర్శకులు తీస్తే చూస్తారు. నన్నే ఉదాహరణగా తీసుకోండి. నా దగ్గర నుంచి ప్రేక్షకులు కొన్ని రకాల సినిమాలు ఇష్టపడతారు. దానికి భిన్నంగా తీస్తే చూడరు. నాకు ‘కాంతార’ లాంటి సినిమా తీయాలని ఉంటుంది. కానీ తీస్తే... ప్రేక్షకులు చాచి కొడతారు. ప్రేక్షకులకు ఏం కావాలో అర్థం చేసుకొని, దానికి తగినట్లుగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, మార్కెట్‌ను అర్థం చేసుకుంటూ సినిమా తీయగలిగితే విజయం సాధించగలుగుతాం.
దర్శకుడు బాబీ వంటివారు బాలీవుడ్‌కు వెళ్తున్నారనే వార్తలొస్తున్నాయి. మీకూ అలాంటి ఆలోచన ఉందా?
నాకు అలాంటి ఆలోచన లేదు. చక్కగా తెలుగు సినిమాలు తీసుకోవాలని ఉంది. మన ప్రేక్షకులకు ఏడాది ఒక సినిమా ఇచ్చుకుంటూ వెళ్తా!
CVLN ప్రసాద్
మెగాస్టార్‌తో సినిమా...
చిరంజీవి గారితో సినిమా ఇంకా ప్రాఽథమిక దశలోనే ఉంది. ఒక కథ లైన్ అనుకున్నాం. అది ఆయనకు నచ్చింది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం...’
అయిపోయింది కాబట్టి దానిమీద వర్క్ చేయాలి. ఆయనకు చెప్పాలి. ఆ తర్వాత ఎప్పుడు టేక్‌ఆఫ్ అవుతుందనే విషయాన్ని ప్లాన్ చేయాలి.
డ్యాన్సర్‌ని...
చిన్నప్పటి నుంచి నేను డ్యాన్సర్‌ని. స్కూల్లో ప్రైజ్‌లు కొట్టేవాడిని. మ్యూజిక్ వింటే చాలు ఊగిపోతా!
సినిమా... ఓ లాటరీ
నా ఉద్దేశంలో ప్రతి సినిమా ఒక లాటరీ లాంటిది. నేను తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఒక లాటరీనే కదా! ఈ సినిమా రాజుగారికి ఊపిరి పోసింది. హిట్ అయి రెవెన్యూ వస్తోంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం.. నిజం చెప్పాలంటే ఏ సినిమా ఎందుకు విజయవంతమవుతుందో మనం చెప్పలేం! అది తెలిస్తే అందరూ హిట్ సినిమాలే తీస్తారు కదా.