Anger, Love, and Wellbeing: కోపం, ప్రేమ, స్వస్థత
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:18 AM
వేగవంతమైన మార్పులు, అనిశ్చితి, నిరంతర ప్రేరేపణలతో నిండిన ఈ యుగంలో భావోద్వేగమైన అవాంతరాలు సర్వసాధారణమైపోయాయి. వాటిలో కోపం... చాలా పొరపాటుగా అర్థం చేసుకొనే, తప్పుగా నిర్వచించుకొనే భావోద్వేగ శక్తులలో ఒకటి. కోపాన్ని పరిశీలించకుండా వదిలేస్తే...
వేగవంతమైన మార్పులు, అనిశ్చితి, నిరంతర ప్రేరేపణలతో నిండిన ఈ యుగంలో భావోద్వేగమైన అవాంతరాలు సర్వసాధారణమైపోయాయి. వాటిలో కోపం... చాలా పొరపాటుగా అర్థం చేసుకొనే, తప్పుగా నిర్వచించుకొనే భావోద్వేగ శక్తులలో ఒకటి. కోపాన్ని పరిశీలించకుండా వదిలేస్తే... తరచుగా అది మనకీ, ఇతరులకూ హాని కలిగిస్తుంది, అంతర్గతమైన కల్లోలానికి, వ్యక్తుల మధ్య ఘర్షణలకు, తీవ్ర విచారానికి దారి తీస్తుంది. ఇలా జరగడానికి కారణం... కోపం స్వాభావికంగా విధ్వంసకరం కావడం కాదు, దానితో కలిసి ఎరుకతో పని చేయడం ఎలాగో మనం నేర్చుకోకపోవడం. కోపం వచ్చిన క్షణాల్లో మన అవగాహన తగ్గిపోతుంది, వాస్తవాన్ని స్పష్టంగా చూడగలిగే మన సామర్థ్యం గణనీయంగా రాజీపడిపోతుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతినడం, గాయాల నుంచి కోలుకోవడంలో జాప్యం, శరీర వ్యవస్థలో వాపులు పెరగడం లాంటివాటితో కూడా దీర్ఘకాలిక ఒత్తిడికి, కోపానికి సంబంధం ఉంటుంది. ఒక కార్డియాక్ ఫిజీషియన్‌గా... ఛాతీ నొప్పి, గుండె దడ, శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యలతో బాధపడే రోగులను చూస్తూ ఉంటాను. అయితే పరీక్షలు జరిపినప్పుడు... వారి సమస్యలకు శారీరకమైన రోగ లక్షణాల కన్నా భయం, పరిష్కారం కాని భావోద్వేగపరమైన ఒత్తిడి, అణిచిపెడుతున్నకోపం లాంటివి కారణం అవుతాయి. రోగులు చెప్పేది శ్రద్ధగా వినడం, సానుభూతిగా ఉండడం, నిష్పాక్షికమైన తీరుతో రోగులతో వ్యవహరించినప్పుడు హృదయ స్పందన రేటు, రక్త పోటుల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుందని వైద్యపరమైన అనుభవం నిరంతరం నిరూపిస్తోంది. స్వస్థత కలిగించడంలో సానుభూతి, మానవ సంబంధాల శక్తిని ఇది నొక్కి చెబుతోంది.
ఆధ్యాత్మిక కోణంలో...
ఆధ్యాత్మికమైన కోణం నుంచి చూసినప్పుడు, ప్రేమ కేవలం ఒక భావోద్వేగం కాదు, అవగాహనను విస్తరించే ఒక స్థితి. మన విలువలను పంచుకొనే వారిని లేదా మనకు సన్నిహితమైన బృందంలో ఉండే వారిని ప్రేమించడానికి ప్రయత్నం పెద్దగా అవసరం ఉండదు. ఎందుకంటే గుర్తింపు, సాన్నిహిత్యం అనేవి సహజంగానే వస్తాయి. అయితే మన విశ్వాసాలను వ్యతిరేకించే, మన ప్రవర్తనను ఎదిరించే వారిని ప్రేమించడం అనేది అహంకారం ఆధారమైన తీర్పులను అధిగమించే, బేషరతుగా గౌరవాన్ని పెంచుకొనే విషయంలో మనల్ని సవాల్ చేస్తుంది. బాధ, నిర్లక్ష్యం, అంతర్గత భయం ద్వారా స్వీయ ప్రేమకు అవరోధం కలిగిన అంశాల్లో కోపం తరచుగా వ్యక్తమవుతూ ఉంటుంది. దయతో అంతరంగంలోకి వెళ్ళే ధైర్యాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే... నిజమైన స్వస్థతకు అవసరమైన పరిస్థితులను సృష్టించుకుంటాం. అవగాహన, అంగీకారం, ప్రేమ కలిసినప్పుడు స్వస్థత కలుగుతుందని వివిధ సంస్కృతులకు చెందిన ఆధ్యాత్మిక సంప్రదాయాలు నొక్కి చెబుతున్నాయి. ఈ దృక్పథానికి సమకాలీన న్యూరోసైన్స్ కూడా మద్దతు ఇస్తోంది.
స్వీయపరిశీలనతో...
సరళమైన హార్ట్‌ఫుల్‌నెస్ అభ్యాసాలు సైన్సుకు, ఆధ్యాత్మికతకు మధ్య వారధిని ఏర్పరుస్తాయి. ధ్యానం, చింతన, ఆలోచనాత్మకమైన స్వీయపరిశీలన ద్వారా స్వీయ ప్రేమను, భావోద్వేగ సమతుల్యతను, అంతర్గత ఆమోదనీయతను మనం పెంపొందించుకోవచ్చు. పేరుకుపోయిన భావోద్వేగ ప్రభావాలను కరిగించడానికి ఈ అభ్యాసాలు సాయపడతాయి. కోపాన్ని, బాధను అధిగమించడానికి, వాటి నుంచి సురక్షితంగా బయట పడడానికి దోహదం చేస్తాయి. హృదయ ఆధారితమైన అవగాహనను రోజువారీ జీవితంతో సమన్వయం చేసుకుంటే... ప్రతిచర్య నుంచి ప్రతిస్పందన వైపు, సంకోచం నుంచి విస్తరణ వైపు, కోపం నుంచి ప్రేమవైపు పయనిస్తాం. అప్పుడు స్వస్థత అనేది కేవలం వ్యాధి లేకపోవడం మాత్రమే కాదు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సంపూర్ణత వైపు తిరిగి వెళ్ళడం కూడా అవుతుంది.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్, ట్రైనర్, హార్ట్‌ఫుల్‌నెస్. 9440087532