Share News

Ananya Panday: నేను అన్నీ తెలిసిన అమ్మాయిని

ABN , Publish Date - Nov 03 , 2025 | 06:12 AM

ఒకప్పుడు హిందీలో వరుస చిత్రాలతో అలరించిన నటుడు చంకీ పాండే. ఆయన వారసురాలు... భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు... అనన్యా పాండే.

 Ananya Panday: నేను అన్నీ తెలిసిన అమ్మాయిని

ఒకప్పుడు హిందీలో వరుస చిత్రాలతో అలరించిన నటుడు చంకీ పాండే. ఆయన వారసురాలు... భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు... అనన్యా పాండే. ఆరేళ్ల కిందట టైగర్‌ షరాఫ్‌ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ... సరైన హిట్స్‌ లేక ఇంకా తడబడుతూనే ఉంది. కానీ సామాజిక మాధ్యమాల్లో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. బడా బ్రాండ్లకు ప్రచారకర్తగా కోట్లు సంపాదిస్తోంది. గత నెల ముప్ఫైన 27వ పుట్టిన రోజు జరుపుకున్న అనన్యా... ‘నేను అన్నీ తెలిసిన అమ్మాయిని’ అంటూ తన గురించి ఎన్నో విషయాలు పంచుకుంది.

తండ్రి చంకీ పాండే ఒకప్పుడు బిజీ నటుడు. అమ్మ భావన కాస్ట్యూమ్‌ డిజైనర్‌. సినీ వాతావరణంలో పెరిగిన అనన్యా... వెండితెరపై వెలిగిపోవాలని చిన్నప్పటి నుంచీ కలలు కన్నది. ముంబయి ‘ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె... ఆ తరువాత చదువుకు స్వస్తి చెప్పింది. ‘‘ఉన్నత విద్య అభ్యసించనందుకు మీకు బాధగా లేదా?’’ అని ఒక సందర్భంలో విలేకరులు అడిగితే... ‘‘షూటింగ్‌ సెట్స్‌ నాకు సినిమా స్కూల్‌’’ అంటూ బదులిచ్చింది. దీన్నిబట్టి ఆమె సినిమాను ఎంతగా ప్రేమిస్తుందో అర్థమవుతుంది. అనుకున్నట్టుగానే 2019లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ ఆ తరువాత చెప్పుకోతగ్గ హిట్స్‌ లేక అవస్థలు పడుతోంది. అయితే ఆమె బాధపడుతూ కూర్చోలేదు. వచ్చిన అవకాశాలు వచ్చినట్టు చేసుకొంటూ పోతోంది. ప్రయత్న లోపం లేకుండా వంద శాతం కష్టపడుతోంది. ‘‘జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. ఎంతటి స్టార్‌ అయినా ప్రేక్షకుల ఆదరణ ఉన్నంతవరకే నిలబడగలరు. ఆ విషయం నాకు ఆరంభంలోనే అర్థమైంది. అందుకే అభిమానులు మెచ్చేలా పాత్రలు ఎన్నుకోవడానికి, వారిని మెప్పించడానికి కృషి చేస్తున్నాను. అమ్మా, నాన్న, చెల్లి రైసా... వీరే నా విమర్శకులు. చుట్టూ చప్పట్లు కొట్టేవారు ఉంటే వాస్తవాలు ఏమిటో తెలుసుకోలేం. కానీ నా సినిమా బాగోకపోయినా, నా నటన నచ్చకపోయినా చెల్లి ముఖం మీదే చెప్పేస్తుంది. అమ్మా నాన్నా కూడా అంతే’ అంటూ చెప్పుకొచ్చిన అనన్య... అక్టోబరు 30న తన పుట్టినరోజును ఘనంగా జరుపుకొంది.


ప్రేమానురాగాలు కురిసే రోజు...

‘‘నా పుట్టినరోజును కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య చేసుకోవడం నాకు బాగా నచ్చుతుంది.. అందంగా ముస్తాబైన కేక్‌లు, రకరకాల బెలూన్లు, ఆహూతులు అందించే బహుమతులు... వారు కురిపించే ప్రేమానురాగాలు... పుట్టినరోజు వేడుకలో ప్రతిదీ నాకు ఎంతో ఇష్టం. ఊహ తెలిసినప్పటి నుంచీ ఇలాగే కొనసాగుతోంది. బెలూన్లు, కేక్‌లు ఇష్టపడుతున్నంత మాత్రాన నాలో పరిణతి లేదనుకోవద్దు. నేను అన్నీ తెలిసిన అమ్మాయిని’’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అనన్య. ఈసారి తన జన్మదినం మరింత ప్రత్యేకమని, తన ప్రాణ స్నేహితురాలి పెళ్లి కూడా అదే రోజు జరగడమే అందుకు కారణమని పేర్కొంది.

గత రెండేళ్లలో...

ఆశించిన స్థాయిలో హిట్స్‌ లేకపోయినా... అవకాశాలు మాత్రం అనన్యను వెతుక్కొంటూ వస్తున్నాయి. ఆరేళ్ల కెరీర్‌లో దాదాపు పదిహేను చిత్రాలు చేసిన ఆమెకు... టెలివిజన్‌ సిరీస్‌ ‘కాల్‌ మి బే’తో మంచి గుర్తింపు లభించింది. గత ఏడాది వచ్చిన ఈ షోలో ఆమె బెల్లా చౌదరి (బే)గా నటించింది. ఆ పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకులు, పరిశ్రమ పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంది. ‘‘కార్తిక్‌ ఆర్యన్‌తో నటించిన ‘తు మేరీ మై తేరా...’ చిత్రం డిసెంబరు 31న విడుదలవుతుంది. ఇది పూర్తిస్థాయిలో అలరిస్తుందని, ఆ విజయంతో కొత్త సంవత్సరం ఉత్సాహంగా మొదలవుతుందని ఆశిస్తున్నా. దాంతోపాటు ‘కాల్‌ మి బే’ రెండో సీజన్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. తొలి సీజన్‌లానే ఇది కూడా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులు నా కెరీర్‌కు ఊపునిచ్చాయి. అందుకే గడిచిన రెండేళ్లూ నాకు ఎంతో ముఖ్యమైనవి. నటిగా నన్ను నిలబెట్టినవి’’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది అనన్య.

నేర్చుకొంటూ ఎదుగుతున్నా...

‘‘నాకు ప్రతి ప్రాజెక్ట్‌ ఒక అనుభవ పాఠం. పరిశ్రమలో నా ప్రయాణం చిన్నదే. అయినా ఎన్నో ఒడుదొడుకులు, సవాళ్లు ఎదుర్కొన్నా. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నా. నేర్చుకొంటూనే ఉంటా. అనుభవాలను మెట్లుగా చేసుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని తపిస్తున్నా’’ అంటున్న అనన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ప్రతి పోస్ట్‌కు లక్షల్లో లైక్‌లు, అంతకు మించి వ్యూస్‌. ‘‘కొత్తగా ఉండటం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టం. ఫ్యాషన్‌ అంటే అమితమైన మక్కువ. ఇటలీలో ఒకసారి ఫ్యాషన్‌ షూట్‌కు వెళ్లాను. అదే సమయంలో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ నుంచి పిలుపు వచ్చింది. అలా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’తో నటిని అయ్యాను’’ అని తన అనుభవాలను పంచుకున్న అనన్య... వారసత్వంతో తెరంగేట్రానికి అవకాశాలు వచ్చినా... ప్రతిభ లేకపోతే ఎవరూ ఇక్కడ నిలబడలేరని చెబుతోంది.


‘లైగర్‌’ తదితర భారీ బడ్జెట్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో ‘ఐరన్‌ లెగ్‌’గా ఆమెపై కొందరు ముద్ర వేశారు. ‘‘అసలు నటించడమే రాదు’’ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ సమయంలో కొన్నాళ్లు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆస్వాదించిన రోజులు గుర్తు చేసుకొంటూ తనకు తాను మనోధైర్యం నింపుకొంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా... ప్రేక్షకుల అభిమానమే ఇంధనంగా ముందుకు సాగుతోంది.

అదే విలువైన బహుమతి...

పుట్టినరోజుకు సంబంధించి అనన్యకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ‘‘పార్టీల్లో మునిగి తేలడం, స్విమ్మింగ్‌ చేయడం, రకరకాల ఆటలు ఆడడం, స్నేహితులతో కలిసి హిందీ పాటలకు ఒళ్లు అలిసిపోయేలా డ్యాన్స్‌ చేయడం... రోజంతా ఉరిమే ఉత్సాహమే. చిన్నప్పుడు స్కూల్లో అయితే జన్మదినం నాడు యూనిఫామ్‌కు బదులు మనకు నచ్చిన రంగురంగుల దుస్తులు వేసుకువెళ్లే వెసులుబాటు ఉండేది. అలా స్కూల్‌ యూనిఫామ్‌ వేసుకున్న తోటి విద్యార్థుల మధ్యలోకి ఫార్మల్స్‌లో వెళ్లడం... తరగతి గదిలో స్నేహితులకు, టీచర్లకు చాక్లెట్లు పంచిపెట్టడం... వేరే తరగతివారు వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్లడం... ఇవన్నీ ‘నేనో ప్రత్యేకమైన వ్యక్తిని’ అనే అనుభూతి కలిగించేవి’’ అంటూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న అనన్యకు ఇప్పటివరకు అందిన పుట్టినరోజు బహుమతుల్లో అత్యుత్తమమైనది ఏదో తెలుసా..? ‘కుక్కపిల్లలు’ అంటుంది తను.

Updated Date - Nov 03 , 2025 | 06:12 AM