అక్షరంతో సాధికారత
ABN , Publish Date - Jul 03 , 2025 | 03:18 AM
ఆకర్షణ సతీష్... వయసు చిన్నదే... కానీ పెద్ద బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. అక్షరాస్యతతోనే సాధికారత సాధ్యమని భావించి... ఇప్పటికి 23 గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రశంసలు...
సంకల్పం
ఆకర్షణ సతీష్... వయసు చిన్నదే... కానీ పెద్ద బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. అక్షరాస్యతతోనే సాధికారత సాధ్యమని భావించి... ఇప్పటికి 23 గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంది. అంతేకాదు... ఈ మహాసంకల్పానికి చేయూత అందిస్తానని నాడు ప్రధాని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ‘నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ నుంచి ఇటీవల ఏడున్నర వేల పుస్తకాలను ఆమె అందుకుంది. ఇది తనకు ఎనలేని ప్రేరణనిచ్చిందని... వంద గ్రంథాలయాల ఏర్పాటే తన లక్ష్యమని అంటున్న ఆకర్షణ... ‘నవ్య’తో ముచ్చటించింది.
‘‘నాలుగేళ్ల కిందట... నేను హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ చిన్నపిల్లల వార్డును సందర్శించాను. అక్కడి చిన్నారులను పలుకరించినప్పుడు... పెయింటింగ్ చేయడానికి, అలాగే చదువుకోవడానికకి పుస్తకాలు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. ఆ ఘటనే నాలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు ప్రేరణనిచ్చింది. అనుకున్న వెంటనే పని మొదలుపెట్టాను. 100 పుస్తకాలతో ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో తొలి లైబ్రరీ ప్రారంభించాను. నాటి నుంచి నా ఈ ప్రయాణం నిరంతరాయంగా సాగుతూనే ఉంది. తెలంగాణ తమిళనాడుల్లో కలిపి మొత్తం 23 గ్రంథాలయాలు ఏర్పాటు చేశాను.
మెట్రో స్టేషన్లలో...
ఈ నెలలోనే జువైనల్ హోమ్‌లో మరో లైబ్రరీ ప్రారంభిస్తున్నాను. అలాగే హైదరాబాద్‌లోని మొత్తం 57 మెట్రో స్టేషన్ల గ్రంథాలయాలు అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నాను. ఇందుకోసం మెట్రో అధికారుల నుంచి అనుమతి పొందాను. తొలి లైబ్రరీని మధురానగర్‌లో ప్రారంభించాలని అనుకొంటున్నాను. అన్నీ కుదిరితే ఆగస్టు మొదటివారంలో ఇది కార్యరూపం దాల్చవచ్చు. ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు హాజరవ్వాలని కోరుకొంటున్నాను. ఆయనతో పాటు ప్రధానికి కూడా ఆహ్వానం పంపుతాను. ఈ లైబ్రరీల కోసమే మెట్రోవారు ఒక యాప్‌ను తీసుకువస్తున్నారు. ఆ యాప్‌లో ఎవరైనా సరే... మొబైల్ నంబర్, పేరు నమోదు చేసుకొని పుస్తకాలు పొందవచ్చు. ప్రతి మెట్రో స్టేషన్‌లో వెయ్యి పుస్తకాలు ఉంటాయి.

ప్రధాని సూచనతో...
నేను చేపట్టిన ‘ఆకర్షణ లైబ్రరీ ఇనీషియేటివ్స్- ఎంపవరింగ్ మైండ్స్ త్రూ బుక్స్’ కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించడం ఒక గొప్ప అనుభూతి. ఆయన ‘మన్ కీ బాత్’లో నన్ను ప్రత్యేకించి అభినందించారు. అక్షరాస్యతను పెంపొందించడం సామాజిక బాధ్యతగా భావించి, దాని కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేయడాన్ని ప్రధాని ప్రశంసించారు. అంతేకాదు... నేను చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకారం, మద్దతు అందిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇది నేను అస్సలు ఊహించలేదు. ఆయన చెప్పినట్టుగానే ఇటీవల 7,520 పుస్తకాలు అందుకున్నాను. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) సూచనతో ‘నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ ఈ పుస్తకాలు నాకు పంపించింది. వీటిల్లో మహానాయకుల జీవిత గాథలతో పాటు పిక్షన్, నాన్‌ఫిక్షన్ కథలు, జీకే, సాహిత్యానికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషా పుస్తకాలు ఉన్నాయి. 67 పెట్టెల్లో వచ్చిన ఈ పుస్తకాల విలువ రూ.7.6 లక్షలు. మరిన్ని గ్రంథాలయాల ఏర్పాటుకు ఇది నాకు స్ఫూర్తినిచ్చింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే లైబ్రరీల్లో వీటిని పెడతాను. అన్నీ కలిపి ఇప్పుడు నా దగ్గర పదకొండు వేల పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఒకసారి రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రైపది ముర్మును కలిశాను. గిరిజనుల కోసం కూడా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఆ సందర్భంలో ఆమె సూచించారు.
పులగం గిరి

లక్ష్యం 100 గ్రంథాలయాలు...
ప్రస్తుతం నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. నేను ఏర్పాటు చేసిన లైబ్రరీలవల్ల ఎనిమిది వందలకు పైగా చిన్నారులు ప్రభావితమయ్యారు. అక్షరం భవిష్యత్తుకు పునాది. అది అన్ని వర్గాలవారికీ చేరాలన్నదే నా కోరిక. అందుకోసమే గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నా. ఈ ఏడాది డిసెంబరు నాటికి 100 లైబ్రరీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా ఈ సంకల్పానికి మా అపార్టుమెంటులో నివసించేవారు, బంధువులు, తోటి విద్యార్థులు, వివిధ రంగాలకు చెందినవారు ఎంతో సహకారం అందిస్తున్నారు. నాకు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే ఎలాంటి ఆటంకాలు లేకుండా దీన్ని ముందుకు తీసుకొని వెళ్లగలుగుతున్నాను.’’