Share News

‘విల్‌ పవర్‌’తో గెలుపే లక్ష్యంగా

ABN , Publish Date - Mar 10 , 2025 | 06:08 AM

పోలియోతో రెండేళ్ళ వయసు నుంచి ఇంటికే పరిమితమైనా... ఏనాడూ నైరాశ్యాన్ని ఆమె దగ్గరకు రానీయలేదు. 41 ఏళ్ళ వయసులో ఎదురైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు...

‘విల్‌ పవర్‌’తో గెలుపే లక్ష్యంగా

పోలియోతో రెండేళ్ళ వయసు నుంచి ఇంటికే పరిమితమైనా... ఏనాడూ నైరాశ్యాన్ని ఆమె దగ్గరకు రానీయలేదు. 41 ఏళ్ళ వయసులో ఎదురైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. పట్టుదలతో సాధన చేసి విజయాలు అందుకుంటున్నారు. పారా పవర్‌లిఫ్టింగ్‌లో కేరళ తరఫున ఎన్నో ఘనతలు సాధించిన పి.వి. లతిక వచ్చేవారం జరగబోయే జాతీయ పోటీల్లో మరోసారి పతకాల వేటకు సిద్ధమవుతున్నారు.

‘‘కొన్నాళ్ళ క్రితం కన్నూర్‌లోని ఒక పాఠశాలలో నిర్వహించిన క్రీడా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను. కార్యక్రమం ముగిసిన తరువాత ఒక విలేకరి ‘‘ప్రతిష్టాత్మకమైన పోటీల్లో పతకాలు సాధించారు కదా! మీ జీవితంలో అత్యుత్తమంగా అనిపించిన సందర్భం ఏది?’’ అని అడిగారు. ‘‘ఇదే... ఈ కార్యక్రమానికి హాజరు కావడమే’’ అని చెప్పాను. అది అక్షరాలా నిజం. ఎన్నడూ బడి ముఖం కూడా చూడని నేను రెండువేల మంది విద్యార్థులున్న పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం కన్నా గుర్తుండిపోయే సందర్భం ఇంకేం ఉంటుంది? ‘‘నా మాటలు అందరూ శ్రద్ధగా విన్నారు. వారిలో కొందరికైనా నా ద్వారా ప్రేరణ కలిగి ఉండే ఉంటుంది. అది ఎంతో సంతృప్తి కలిగిస్తోంది’’ అని అన్నాను.


పాకుతూ తిరిగేదాన్ని...

అందరిలా బడికి వెళ్ళాలి. బాగా చదువుకోవాలి... ఇది నా తీరని కోరిక. కానీ రెండేళ్ళ వయసులో పోలియో వచ్చి, నా కాళ్ళు చచ్చుబడిపోవడంతో అది నెరవేరలేదు. మాది కేరళలోని పయ్యన్నూర్‌ సమీపంలో ఉన్న మాతమంగళం అనే ఊరు. మా నాన్న పోర్టర్‌. అమ్మ వ్యవసాయ కూలీ. నాకు ఒక అక్క, ఒక చెల్లి. మాది నిరుపేద కుటుంబం. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మా అక్కని మా అమ్మమ్మ ఇంట్లో ఉంచి చదివించారు. ‘‘నాకు కనీసం సైకిలైనా ఉంటే నిన్ను బడికి తీసుకువెళ్ళేవాణ్ణి’’ అనేవాడు నాన్న. ఒకే గది ఉన్న ఇంట్లోనే రోజంతా ఉండలేక... నేల మీద నుంచి పాకుతూ... వీధిలో ఉన్న చెట్ల కింద కూర్చొని, వచ్చీపోయేవారిని చూస్తూ గడిపేదాన్ని. మా చెల్లెలు స్కూల్‌ నుంచి వచ్చేవరకూ ఎదురుచూసేదాన్ని. తను వచ్చి బడి కబుర్లు చెప్పేది. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. నా తోబుట్టువులకు పెళ్ళయ్యాక అత్తవారిళ్ళకు వెళ్ళడంతో... పూర్తి ఒంటరితనంలో మునిగిపోయాను. అయితే నేను ఎన్నడూ కుంగిపోలేదు. నాకు ఏదో మంచి జరుగుతుందనే ఎప్పుడూ అనుకొనేదాన్ని. తొమ్మిదేళ్ళ క్రితం అలాంటి రోజు వచ్చింది.


మా రాష్ట్ట్రం నుంచి మొదటి మహిళను నేనే...

అంగవైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం మూడు చక్రాల స్కూటర్లు పంపిణీ చేస్తోందని తెలుసుకొని... దరఖాస్తు చేశాను. కొన్నాళ్ళలోనే నాకు స్కూటర్‌ మంజూరైంది. నా సోదరి కుమారుడి సహకారంతో... మూడు రోజుల్లోనే దాన్ని నడపడం నేర్చుకున్నాను. దాంతో నాకు కొత్తగా రెక్కలొచ్చినట్టు అనిపించింది. అప్పటివరకూ ఇంటికే పరిమితమైన నేను... ఆ స్కూటర్‌ మీద ఊరంతా తిరిగేదాన్ని. ఆలయాలకు, ఉత్సవాలకు వెళ్ళేదాన్ని. కొన్నిసార్లు మావాళ్ళతో దూర ప్రాంతాలకు కూడా వెళ్ళొచ్చాను. కాలం ఇలా గడుస్తూ ఉండగా... మా పొరుగున ఉన్న అబ్దుల్‌ బషీర్‌ అనే పెద్దాయన ఒక రోజు మా ఇంటికి వచ్చారు. ఆయన నాకు చిన్నప్పటినుంచీ తెలుసు. రోడ్డు ప్రమాదంలో నడుము వరకూ ఆయనకు చచ్చుబడింది. ‘‘ఈ రోజు సాయంత్రం ఒక చోటుకు వెళ్దాం వస్తావా?’’ అని అడిగారు. సరేనన్నాను. మా ఊరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోర్‌ స్టేడియంకు నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ పారా పవర్‌ లిఫ్టింగ్‌లో ఎంపికలు జరుగుతున్నాయి. ‘వాటిని చూపించడానికి ఆయన తీసుకువచ్చారేమో?’ అనుకున్నాను. నిర్వాహకులతో బషీర్‌ మాట్లాడారు. నా దగ్గరకు వచ్చి... ‘‘నువ్వు పవర్‌ లిఫ్టింగ్‌కు ప్రయత్నిస్తే బాగుంటుంది కదా!’’ అన్నారు. అంతకుముందు ఆ క్రీడను నేను కనీసం చూడనైనా లేదు. కానీ ‘ప్రయత్నిస్తే తప్పేముంది?’ అనిపించింది. మొదటి ప్రయత్నంలోనే ముప్ఫై కిలోలు అవలీలగా ఎత్తగలిగాను. జాతీయ పారా పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపికయ్యాను. కేరళ తరఫున ఈ క్రీడలో క్వాలిఫై అయిన మొదటి మహిళను నేనని తెలిసినప్పుడు... ఆశ్చర్యం, ఆనందం నన్ను ముంచెత్తాయి. కేరళ పారా పవర్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు జోబీ మాథ్యూ నాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘నీకు సామర్థ్యం ఉంది, కానీ శిక్షణ లేదు. జాతీయ పోటీలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. కాబట్టి శిక్షణ తీసుకో’’ అని చెప్పారు. మా ఊరుకు దగ్గర్లోని టౌన్‌లో చక్కటి సౌకర్యాలున్న జిమ్‌ల పేర్లను ఆయన సూచించారు. అయితే అవన్నీ పై అంతస్తుల్లోనే ఉన్నాయి. నేను పైకి ఎక్కడం కష్టం. చివరకు, ఇంట్లో జిమ్‌ నడుపుతున్న పుష్ప అనే మహిళా శిక్షకురాలు దొరికారు. ఆ సమయంలోనే నా గురించి తెలుసుకున్న ‘ఇన్‌స్పైర్‌’ అనే స్వచ్ఛంద సంస్థ నా ప్రయాణ ఖర్చులను స్పాన్సర్‌ చేసింది. నా చెల్లెలిని సాయం తీసుకొని జాతీయ పోటీల కోసం నాగపూర్‌ వెళ్ళాను. నేను విమానం ఎక్కడం అదే తొలిసారి.


ఆ కల నెరవేర్చుకున్నా...

పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాను. కానీ ఇతర పోటీదారుల ముందు నా నైపుణ్యం సరిపోలేదు. నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో నాలో పట్టుదల పెరిగింది. మరిన్ని ఎక్కువ సౌకర్యాలున్న జిమ్‌లో చేరాను. రోజూ మెట్ల మీద పాక్కుంటూ పైకి వెళ్ళేదాన్ని. మా ట్రైనర్‌ మోహనన్‌ నా దగ్గర డబ్బులేవీ తీసుకోలేదు. అయితే ‘‘పవర్‌ లిఫ్టింగ్‌లో రాణించాలంటే దారుఢ్యం ఎంతో అవసరం. తగిన ప్రోటీన్‌ కోసం రోజూ పదిహేను గుడ్లు, చికెన్‌ తినాలి. తీపి పదార్థాలు, వేపుళ్ళు మానేయాలి’’ అంటూ సూచనలు చేశారు. ఆయన వద్దన్నవి తీసుకోలేదు, కానీ అవసరమన్నవి తీసుకొనే స్థోమత మాకు లేదు. కాబట్టి వీలైన మేరకే పాటించేదాన్ని. పూర్తిగా సిద్ధమైన దశలో... కొవిడ్‌ విజృంభించింది. పోటీలు వాయిదా పడ్డాయి. ఆ సమయాన్ని నేను శిక్షణ కోసం వినియోగించుకున్నాను. తరువాత... 2021లో... బెంగళూరులో జరిగిన నేషనల్స్‌లో పాల్గొని, రెండో స్థానంలో నిలిచాను. కానీ నా లక్ష్యం స్వర్ణ పతకం సాధించడం. అందుకోసం తీవ్రంగా సాధన చేశాను. 2022లో... అరవై ఒక్క కిలోల కేటగిరీలో బంగారు పతకం సాధించి నా కల నెరవేర్చుకున్నాను. పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి కేరళ మహిళగా నిలిచాను. ఒకప్పుడు ఇల్లు దాటని నాకు ఇప్పుడు సమాజంలో గుర్తింపు లభించింది. నా కథ ఏ ఒక్కరిలో స్ఫూర్తి కలిగించినా... నా జీవితం సఫలమైనట్టే. రాబోయే పోటీల్లో రాణించాలి. అంతర్జాతీయ పోటీల్లో కూడా నా ప్రతిభ కనబరచాలి. ప్రస్తుతం ఇదే నా ఆకాంక్ష.’’

For Telangana News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 06:08 AM