Share News

Senior Athlete: వయసు 72... పతకాలు మెండు

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:27 AM

మనసుంటే... శరీరం సహకరిస్తే... వయసు దేనికీ అవరోధం కాదని నిరూపించారు బి.మంజమ్మ. డెబ్భై రెండేళ్ల ఆమె... ఇటీవల జరిగిన ‘ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌...

Senior Athlete: వయసు 72... పతకాలు మెండు

మనసుంటే... శరీరం సహకరిస్తే... వయసు దేనికీ అవరోధం కాదని నిరూపించారు బి.మంజమ్మ. డెబ్భై రెండేళ్ల ఆమె... ఇటీవల జరిగిన ‘ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప’ 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించారు. భర్త మరణంతో కుంగిపోయిన మంజమ్మ... ఆ ఒత్తిడి నుంచి బయటకు రావడానికి 65 ఏళ్లప్పుడు అథ్లెటిక్స్‌ మొదలుపెట్టారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అద్భుత విజయాలు నమోదు చేసుకున్నారు.

‘‘అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది! సంతోషాలు, సుఖాలే కాదు... కష్టాలు, కుదుపులు కూడా వెన్నంటే ఉంటాయి. అది నాకు కాస్త ఆలస్యంగా అనుభవంలోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ మాది. జిల్లా ఆరోగ్య కేంద్రంలో లేడీ హెల్త్‌ విజిటర్‌ (ఎల్‌హెచ్‌వీ)గా, ఇన్‌చార్జి నర్సింగ్‌ అధికారిగా 36 ఏళ్లు సేవలు అందించాను. 2013లో పదవీ విరమణ పొందాను. అదే ఏడాది మావారు దేవరాజ్‌ మరణించారు. ‘కర్ణాటక హ్యాండ్‌లూమ్‌ అండ్‌ ఉలెన్‌ సొసైటీ’లో పని చేసేవారు. ఆయన మరణం నన్ను మానసికంగా కుంగదీసింది. ఎంత ప్రయత్నించినా... చాలా ఏళ్లు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాను.

అరవై ఐదేళ్ల వయసులో...

మా అమ్మాయి, సన్నిహితుల సూచనతో మావారు పోయిన ఐదేళ్ల తరువాత జాగింగ్‌ మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు 65. క్రమంగా జాగింగ్‌ నాకు ఒక వ్యాపకంగా మారిపోయింది. రోజూ ఓ గంట అలా నడుస్తుంటే కాస్త ఉపశమనం కలిగినట్టు అనిపించేది. అదేసమయంలో మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ గురించి తెలిసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా పేరు నమోదు చేసుకున్నా. 2018లో తొలిసారి పోటీల్లో పాల్గొన్నా. షార్ట్‌పుట్‌లో మొదటి బహుమతి లభించింది. ఆ ఉత్సాహంతో ప్రతి ఈవెంట్‌లో పోటీపడ్డాను. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి దాటి ఇప్పుడు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటున్నాను.


మా అమ్మాయి సహకారంవల్లే...

ఇటీవల చెన్నైలో జరిగిన 23వ ‘ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప’ 400 మీటర్ల రిలే పరుగు పందెంలో స్వర్ణ పతకం నెగ్గాను. ఇన్నేళ్ల నా శ్రమకు తగిన ఫలితం ఇది. 27 ఏళ్ల మా అమ్మాయి వర్షిణి దాస్‌ సహకారం, ప్రోత్సాహంవల్లే నేను ఇన్నేళ్లుగా రాణించగలుగుతున్నా. తను బెంగళూరులో డాక్టర్‌. అంతేకాదు, నా స్నేహితులు, మైసూరు, మంగళూరు క్రీడా సంఘాలవారు అన్ని వేళలా నాకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా వృద్ధులకు ఒక మంచి వ్యాపకమే కాదు... వారిని చురుగ్గా ఉంచేందుకు చక్కని వ్యాయామం కూడా. యోగా, నడక, ధ్యానం, క్రీడలు... ఇవన్నీ మనిషి జీవితానికి ఎంతో అవసరమైనది. అందుకే అందరూ, ముఖ్యంగా వయసు మీదపడినవారు తప్పకుండా రోజులో కొంత సమయం వీటికి కేటాయించాలి.

ప్రతిభకు వయసు అడ్డుకాదు...

అందరిలోనూ ప్రతిభ, నైపుణ్యాలు ఉంటాయి. వాటికి పదునుపెడితే అద్భుతాలు సాధించవచ్చు. ఇందుకు వయసు అడ్డంకి కాదు. అంకితభావంతో కృషి చేస్తే అసాధ్యమనేది ఏదీ ఉండదనేది నా అభిప్రాయం. అందుకు నేను ఒక ఉదాహరణ. నేను ఇప్పటివరకు నాసిక్‌, హైదరాబాద్‌, గోవా, పుణే, కొచీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో మా రాష్ట్రం తరుఫున పాల్గొన్నాను. అలాగే బ్రునీ, శ్రీలంక మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఇంటర్నేషనల్‌, సౌంత్‌ ఏషియా టోర్నమెంట్‌, సౌతిండియా టోర్నమెంట్‌లలో పోటీపడ్డాను. మొత్తంగా 110 పతకాలు గెలుచుకున్నాను. గతంలో నేను 100, 200 మీటర్ల రేసుల్లో మాత్రమే పాల్గొనేదాన్ని. కానీ ఇప్పుడు ఎక్కువగా షార్ట్‌పుట్‌, డిస్కస్‌, జావెలిన్‌ త్రో, 1కేఎం వాక్‌, 60 మీటర్ల రేస్‌లపై దృష్టి పెట్టాను.

వాటికి దూరంగా ఉండాలి...

నేటి తరం పిల్లలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. రాత్రిపూట ఆలస్యంగా నిద్ర పోవడం, జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడటం, గంటలకు గంటలు మొబైల్‌లో గడపడం వారికి నిత్యకృత్యమైపోయింది. వీటివల్ల చిన్న వయసులోనే ఊబకాయంతో బాధపడుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకొంటున్నారు. యువతరం ఈ అలవాట్లను మార్చుకోవాలి. సమయానికి నిద్రపోవాలి. ఇంటి ఆహారం తినాలి. రోజులో కనీసం ఒక గంట వాకింగ్‌, జాగింగ్‌, యోగా లాంటివాటికి కేటాయించాలి. ఏదో ఒక క్రీడలో భాగస్వాములైతే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. చేసే పనిపై శ్రద్ధ పెట్టగలుగుతారు. అన్నిటికీ మించి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు.’’

Updated Date - Dec 27 , 2025 | 03:27 AM