Ananya Panday Emphasizes Self Love: మనల్ని మనం ప్రేమించాలి
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:45 AM
జయాపజయాలతో సంబంధం లేకుండా బిజీగా ఉండే నటి అనన్య. చంకీ పాండే తనయగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ తార... తెలుగులోనూ మెరిసింది. సినిమాలో పాత్రలతోనే కాదు...
జయాపజయాలతో సంబంధం లేకుండా బిజీగా ఉండే నటి అనన్య. చంకీ పాండే తనయగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ తార... తెలుగులోనూ మెరిసింది. సినిమాలో పాత్రలతోనే కాదు... నాజూకైన శరీరాకృతితోనూ కోట్లమంది అభిమానులకు సంపాదించుకుంది. తొలి చిత్రం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తినా... సామాజిక మాధ్యమాల్లో చులకన చేసినా... వేటికీ కుంగిపోలేదు. తన పని తాను చేసుకొంటూ... వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.
అనన్యా పాండే... పరిచయం అక్కర్లేని నటి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’తో తొలిసారి వెండితెరపై కనిపించింది. ‘లైగర్’లో విజయ్ దేవరకొండ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ప్రస్తుతం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరో. ‘చాంద్ మేరా దిల్’ షూటింగ్ జరుగుతోంది. 2019లో మొదలైన ఆమె ప్రయాణంలో ఇప్పటికి పధ్నాలుగు చిత్రాలు చేరాయి. పలు టెలివిజన్ షోలు, మ్యూజిక్ వీడియోల్లోనూ ఆకట్టుకున్న అనన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండున్నర కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి పోస్టుకూ లక్షల్లో లైక్‌లు, వేలల్లో అభినందనలు. తన ప్రాజెక్ట్ అప్‌డేట్సే కాకుండా... వ్యాయామాలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోమంటూ అభిమానులను ప్రోత్సహిస్తుంది. వర్కవుట్ వీడియోలు పోస్ట్ చేసి, ఉత్సాహం నింపుతుంది. అనన్యకు సినిమాలు ఎంత ముఖ్యమో, ఫిట్‌నెస్ కూడా అంతే. అదే తనను నిత్యయవ్వనంగా ఉంచుతుందని చెబుతుంది.
ఎంత బిజీగా ఉన్నా...
‘ముందు మనల్ని మనం ప్రేమించాలి. మన శరీరం చెప్పేది వినాలి. గౌరవించాలి. ఎందుకంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం. అందుకు మార్గం... రోజూ వ్యాయామం. దీనివల్ల జీవక్రియ మెరుగవుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శరీరం కాంతిమంతంగా తయారవుతుంది. రోజంతా నన్ను ఉత్తేజంగా ఉంచేది వ్యాయామాలే. ముఖ్యంగా యోగావల్ల రక్తప్రసరణ పెరిగి, చర్మానికి మరింత ప్రాణవాయువు అందుతుంది. దానివల్ల చర్మం నాజూకుగా తయారవుతుంది. చేసే పనిలో ఏకాగ్రత కుదురుతుంది’ అంటుంది అనన్య.
అదేపనిగా వెయిట్‌లిఫ్టింగ్, కార్డియో ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయడం అంత మంచిది కాదన్నది ఆమె అభిప్రాయం. ‘జిమ్‌కు వెళ్లినప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఫ్లెక్లిబిలిటీ, మొబిలిటీ మీద. అప్పుడే బరువులు ఎత్తినప్పుడు, రన్నింగ్‌లాంటివి చేసినప్పుడు గాయాలు కాకుండా ఉంటాయని’ అంటుంది.
అనన్య వర్కవుట్‌లో యోగా తరువాత ప్రధానమైనవి పిలెట్స్. ఇది మంచి స్ర్టెచింగ్ ఎక్స్‌ర్‌సైజ్. బిగుసుకున్న కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.
ఫ ఎప్పటికప్పుడు కొత్త వర్కవుట్స్‌తో తనకు తాను సవాలు విసురుకొంటుంది అనన్య. ఇంట్లో రోజూ హఠ, విన్యాస యోగాతో పాటు మరింత కఠినమైన ఏరియల్ యోగా చేస్తుంది. జిమ్‌లో రొటీన్ ఎక్స్‌ర్‌సైజ్‌ల వల్ల కీళ్లు, వెన్నెముకలపై పడే ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుందనేది ఆమె మాట.
ఒకటే నచ్చదు
అనన్యకు బాగా ఇష్టమైన ఫుడ్ బర్గర్లు. ప్రతి ఆదివారం ఆమెకు ‘బర్గర్ డే’. ‘నచ్చింది తింటాను. వారానికి ఒకసారి పొట్ట శుభ్రం చేసుకొంటాను. ఏదో ఒక డైట్ ప్లాన్ తీసుకొని... దాన్నే అనుసరిస్తూ వెళ్లడం నాకు నచ్చదు. దానిమీద దృష్టి పెట్టే కంటే... రోగనిరోధకశక్తినిచ్చే ఆహారం తీసుకోవడం పైనే శ్రద్ధ పెడతాను’ అంటుంది అనన్య. ఉదయం యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్‌తో మొదలువుతుంది. ఆ తరువాత తీసుకొనే మెనూలో కూడా పసుపు, పండ్లు, విటమిన్-సి గల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకొంటుంది. ఎంత బిజీగా ఉన్నా కడుపు నిండా తినడం, అదనపు క్యాలరీలో కరిగేదాకా వ్యాయామం చేయడం ఆమెకు అలవాటు.
బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్, బటర్‌తో బ్రెడ్ టోస్ట్, బ్లాక్ కాఫీ
లంచ్‌కు ఉడకబెట్టిన కూరగాయ ముక్కలతో చికెన్ శాండ్‌విచ్
సాయంత్రం స్నాక్స్ సమయంలో నట్స్, కప్పు బ్లాక్ కాఫీ
రాత్రి భోజనంలో గ్రిల్డ్ ఫిష్ లేదా చికెన్, సూప్