The Divine Form of Sri Venkateswara: శ్రీవారి రూపం... అపురూపం
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:47 AM
తిరుమలలోని ఆనంద నిలయ విమానంలో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి రూపం సర్వాంగ సుందరం. ఆ దివ్య స్వరూపాన్ని బ్రహ్మాది దేవతలు, అగస్త్యాది ఋషులు...
తిరుమలలోని ఆనంద నిలయ విమానంలో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి రూపం సర్వాంగ సుందరం. ఆ దివ్య స్వరూపాన్ని బ్రహ్మాది దేవతలు, అగస్త్యాది ఋషులు... ఇలా ఎందరో దర్శించి తరించారు. బ్రహ్మపురాణం, శ్రీవరాహ పురాణాల్లో దీనికి సంబంధించిన వర్ణన ఉంది. ‘‘భుజకీర్తులు, కడియాలు తదితర అందమైన ఆభరణాలు కలవాడు, పొడవైన చక్కని నాలుగు చేతులు కలవాడు. నీల మేఘాల్లాంటి శరీర వర్ణం కలిగినవాడు, చిక్కని చిరునవ్వుతో భక్తుల మనసులను దోచుకొనే అందమైన ముఖమండలాన్ని, ‘దయ’ అనే తరంగంతో వికసించిన తామరల్లాంటి విశాలమైన కన్నులు, నిటారైన ముక్కు కలిగినవాడు. బంగారు మకర కుండలాలను, సుదర్శన చక్రాన్ని, శంఖాన్ని ధరించినవాడు. ఎల్లప్పుడూ వరాలు ఇవ్వడానికి వరద హస్తాన్ని, తనను ఆశ్రయించిన వారికి సంసార సాగరం మోకాలి లోతు వరకే ఉంటుందని సూచిస్తూ... కటి ప్రదేశం దగ్గర హస్తాన్ని కలిగినవాడు అయిన నారాయణుణ్ణి స్తుతిస్తూ.. దేవతలు, ఋషులు, దశరథుడు తదితరులు సూర్యుణ్ణి పోలిన ఆ తేజోరాశిని సందర్శించారు’’ అని అది చెబుతోంది.
ఆభరణాలు, అలంకారాలు....
తిరుమల కొండపై కొలువైన శ్రీవారి రూప సౌందర్యాన్ని ఆపాదమౌళి పర్యంతం కేవలం శుక్రవార అభిషేకం సమయంలో మాత్రమే దర్శించవచ్చు. పైన పేర్కొన్న పురాణ వర్ణన... శ్రీవారి నిజరూపానికి సరిగ్గా సరిపోలుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి పదహారు దళాలతో ఉన్న విశాలమైన పద్మపీఠంపై స్థిరంగా, ఠీవిగా నిలబడి ఉంటాడు. ఆయన రెండు పాదాలకు ‘నూపురాలు’ అనే ఆభరణాలు ఉన్నాయి. రెండు పాదాల్లో.... మధ్య వేళ్ళకు తప్ప మిగతా అన్ని వేళ్ళకూ ఉంగరాలు ఉన్నాయి. పాదాల నుంచి నడుము వరకు పీతాంబరాన్ని ధరించి ఉంటాడు. అందమైన మడతలతో నడుము చుట్టూ ధోవతి చుట్టుకొని, ముడి వేసుకొని, చక్కని సింహతలాటంతో కూడిన వడ్డాణం పెట్టుకొని ఉంటాడు. ఆ ధోవతి కుచ్చిళ్ళను పట్టి ఉంచే నిలువు కుచ్చిళ్ళు... కాళ్ళకు మధ్యలో, నిండు పాదాల వరకూ ఉంటాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రకారం... గోచి పోసి, వెనుకవైపు నడుము మధ్య భాగంలో ముడివేసి చెక్కుకున్నట్టు ధోవతి ఉంటుంది. ఇక శ్రీవారి కంఠాభరణాలుగా మూడు హారాలు ఉంటాయి. శ్రీవైష్ణవ సంప్రదాయ ‘విష్ణుముడి’ కలిగిన యజ్ఞోపవీతం ఆరు పోగులతో ఉంటుంది. దాన్ని‘ ప్రలంబ యజ్ఞోపవీతం’ అంటారు. పొట్ట చుట్టూ ‘ఉదరబంధం’ అనే ఆభరణం ఉంటాయి. ఛాతీకి కుడివైపున వక్షస్థలంలో... త్రిభుజాకారంలో రెండు చేతులతో... అభయ, వరద ముద్రలున్న ‘వ్యూహలక్ష్మీ అమ్మవారి’ స్వరూపం అత్యంత స్పష్టంగా ఉంటుంది.
స్వామి నాలుగు చేతులకు కేయూరాలు, కటక, కంకణాలనే ఆభరణాలను, బాహువుల పైభాగంలో కేయూరాలను ధరించి ఉంటాడు. నాలుగు చేతులలో... మణికట్టు దగ్గర మూడేసి కంకణాలు, ప్రతి చేతికి ముంజేతి భాగంలో ‘వలయం’ అనే మరో ఆభరణం ఉంటాయి. ‘వరద హస్తం’ లేదా ‘వైకుంఠ హస్తం’ అని పిలిచే శ్రీవారి కుడి అరచేతి మీద.. ఉత్తమమైన హస్త సాముద్రిక లక్షణాలతో కూడిన హస్తరేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘కటి హస్తం’ లేదా ’కట్యవలంబిత హస్తం’ అని పిలిచే ఎడమ చేతిలో నాలుగు వేళ్ళు ఎడమ తొడను తాకుతూ ఉంటాయి, బొటన వేలు పైకి ఉంటుంది.
అతృప్త్య అమృతరూపం
శ్రీవారి రెండు చెవులకూ మకర కుండలాలు భుజాల వరకూ వేలాడుతూ ఉంటాయి. శిరస్సు మీద అత్యంత గంభీరంగా, వెదురుకాండంలా పొడవైన, అందమైన కిరీటం ఉంటుంది. కిరీటం కింది భాగంలో రత్నపట్ట, మధ్యభాగంలో కళాసౌందర్యంతో నిండిన పత్రపూరిమం, కిరీటం కింది భాగంలో ‘ముకుళం’ అనే పద్మం, దానిపైన శిఖామణి ఉంటాయి. కిరీటానికి, లలాటానికి మధ్య అనుసంధానంగా ‘లలాట పట్టి’ అనే రమణీయ ఆభరణం ఉంటుంది. స్వామివారి నాసిక సూటిగా కొనదేలి ఉంటుంది. పుష్టిగా ఉన్న బుగ్గలు, చిన్న గడ్డం, అందమైన పెదవులు, వాటిపై అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే చిరునవ్వుతో దర్శనమిస్తారు. కళ్ళు కలువల్లా ఉంటాయి. మధ్యలో కనుపాప గుండ్రంగా స్పష్టంగా కనిపిస్తుంది. కనుబొమ్మలు చక్కటి కృతితో, నాసిక ప్రారంభమయ్యేచోట కలుస్తాయి. ఒక్కటని ఏమిటి... శ్రీవారి దివ్యమంగళ విగ్రహంలో ప్రతి భాగం... పాదాల నుంచి కిరీటం వరకూ అత్యద్భుతంగా ఉంటుంది. చూసేకొద్దీ చూడముచ్చటగా భక్తుల మనస్సులను కట్టి పడేస్తుంది. అందుకే శ్రీవారి అర్చన స్వరూపానికి ‘అతృప్త్య అమృతరూపం’ అని పేరు.
దగ్గుపాటి నాగవరప్రసాద్ స్థపతి, 9440525788
థాయిలాండ్‌లో విష్ణురూపం
ఇటీవల థాయిలాండ్‌లో వెలుగుచూసిన విష్ణురూపం విషయానికి వస్తే... అర్చారూపంలో ఉన్న స్వామి రెండు పరహస్తాలలో శంఖు, చక్రాలను ధరించాడు. కుడి స్వహస్తాన్ని అభయముద్రగా, ఎడమ హస్తాన్ని ‘కట్యవలంబిత ముద్ర’గా కలిగి ఉన్నాడు. తలపై కిరీటం, మెడలో కంఠహారం, ఉదరబంధం, యజ్ఞోపవీతం, కటిపై మణిమేఖలం, పాదాలపై మంజీరాలు, చేతులకు కడియాలు, బాహు వలయాలు, నడుము నుంచి దిగువకు పట్టుధోతీ, మధ్యలోనూ, నడుముకు అటూ ఇటూ కుచ్చిళ్ళు, ఆ ధోతీని బిగించి పట్టి ఉంచేందుకు అందమైన వడ్డాణం ధరించి ఉన్నాడు. ప్రతిమా లక్షణాన్ని అనుసరించి... ఆ విష్ణుమూర్తి శిల్పం క్రీస్తుశకం పది లేదా పదకొండో శతాబ్దాల కాలానిదని చెప్పవచ్చు. అయితే గదా పద్మాలు లేవు కాబట్టి... అది విష్ణుమూర్తి చతుర్వింశతి మూర్తులకన్నా భిన్నంగా ఉంది. ఎడమ హస్తం... కట్యవలంబిత హస్తంగా... శ్రీ వేంకటేశ్వరస్వామిని పోలి ఉన్నా, కుడి హస్తం వరద ముద్రగా కాకుండా అభయ ముద్రగా ఉంది కాబట్టి.... ఆ అందమైన మూర్తిని విష్ణు అంశకు చెందిన ఒక ప్రత్యేక ప్రతిమగా చెప్పవచ్చు. కానీ పాదపీఠం అచ్చం తిరుమల శ్రీవారి పాదపీఠంలా ఉండడం విశేషం.