Jobs Faith: విశ్వాసానికి పరీక్ష
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:48 AM
యోబు... దేవుడైన యెహోవాకు అచంచలమైన భక్తుడు. దేవుని ఆదేశాలపట్ల ఎంతో విధేయతతో నడుచుకున్నాడు.
యోబు... దేవుడైన యెహోవాకు అచంచలమైన భక్తుడు. దేవుని ఆదేశాలపట్ల ఎంతో విధేయతతో నడుచుకున్నాడు. దానికోసమే కన్నీటి పాలయ్యాడు. ‘మానవుడి జీవితం కష్టాల కడలి. దైవాన్ని నమ్ముకున్నవారికి మరిన్ని కష్టాలు పరీక్షలు ఎదురవుతాయి. చివరకు దైవ విశ్వాసులదే విజయం’ అని యోబు కథ స్పష్టం చేస్తుంది.
కనానుకు సమీపంలోని ఊజు దేశంలో యోబు హాయిగా బతికేవాడు. అతని పచ్చటి జీవితం మీద యెహోవా శత్రువైన సాతాను కళ్ళు పడ్డాయి. ‘‘నువ్వు యోబుకు అన్నీ ఇచ్చావు. సుఖవంతంగా ఉండేలా ఆశీర్వదించావు. కాబట్టే అతను నీ పట్ల విశ్వాసంతో ఉన్నాడు. కానీ వాటన్నిటినీ తీసేస్తే... అతను అంతే విధేయతతో ఉంటాడా? నిన్ను దూషించకుండా ఉంటాడా?’’ అని దేవుణ్ణి సాతాను సవాలు చేశాడు.
యోబు అంటే యెహోవాకు గొప్ప నమ్మకం. అందుకే ‘‘నీవు వెళ్ళు. యోబుకు ఆ సిరిసంపదలేవీ లేకుండా చెయ్యి. నీవు చేయాలనుకున్నంత కీడు చెయ్యి. అతను నన్ను దూషిస్తాడేమో చూద్దాం. కానీ ఒక్క షరతు... ఎట్టి పరిస్థితుల్లోనూ నా భక్తుణ్ణి చంపకూడదు’’ అన్నాడు. ఆ షరతుకు సాతాను ఒప్పుకున్నాడు. వెంటనే యోబు మీద వీర విజృంభణ చేశాడు. మొదటగా... యోబుకు చెందిన పశువులు, ఒంటెలు దొంగతనానికి గురయ్యేటట్టు చేశాడు. గొర్రెలు మరణించేలా చేశాడు. ఆ తరువాత తుపాను బీభత్సంలో అతని పది మంది కుమారుల్ని, కుమార్తెల్ని చంపేశాడు. అనంతరం ఒక భయంకరమైన వ్యాధితో యోబును బాధించాడు, వేధించాడు. ఇలా ఎన్నో వేదనలను యోబు అనుభవించాడు. అప్పుడు యోబు భార్య ‘‘దేవుణ్ణి దూషించి చచ్చిపో’’ అని అతనితో అంది. కానీ యోబు అలా చెయ్యలేదు. దైవం పట్ల తన గట్టి నమ్మకాన్ని ఏ పరిస్థితులలోనూ కోల్పోలేదు. యోబు భక్తికి దేవుడు ముగ్ధుడయ్యాడు. భక్తుడి విజయమే తన విజయంగా భావించాడు. అతనికి సోకిన వ్యాధిని బాగు చేశాడు. మళ్ళీ పదిమంది పిల్లలు కలిగేలా ఆశీర్వదించాడు. అతని పశువులను, గొర్రెలను, ఒంటెలను మునుపటికన్నా రెట్టింపు చేశాడు.
దేవునిపై నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. మనకు సాతానులాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అయినా విశ్వాసం వదలకూడదు. పట్టువదలకుండా పోరాడాలి. అటువంటివారికి దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్, 9866755024