Van Samaradana: వన సమారాధన...ప్రకృతి ఆరాధన
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:48 AM
సహజమైన సంపదకు అసలైన అర్థం ఏమిటో తెలుసుకోవడంతో పాటు ఆ సంపదను మనం పూర్తిగా అనుభవించడం కోసం పూర్వీకులు..
సహజమైన సంపదకు అసలైన అర్థం ఏమిటో తెలుసుకోవడంతో పాటు ఆ సంపదను మనం పూర్తిగా అనుభవించడం కోసం పూర్వీకులు అనేక ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు. అవి మనకు దైనందిన జీవితంలో అలవడేలా చూశారు. ఆ విధంగా ఏర్పాటుచేసినవే కార్తిక మాసంలోని వనభోజనాలు. అనుకూలమైన వనంలో బంధుమిత్రుల కలయిక, అక్కడే వంటలు, ఆటపాటలు, భోజనాలు. ఒకవైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం. కార్తిక మాసంలో వన సమారాధనలు అంటే మనకు గుర్తొచ్చేవి ఇవే. దీనిలో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి శ్రీమాతాజీ నిర్మలాదేవి వివిధ సందర్భాల్లో వివరించారు.
మన ఋషులు, మునులు ఏర్పాటు చేసిన సంప్రదాయాలన్నీ మన సూక్ష్మ శరీరంలోని కుండలినీ జాగృతి కోసం చక్రనాడుల శుద్ధి కోసం ఉద్దేశించినవే. ఎందరో మహనీయులు జన్మించి, తమ పాదస్పర్శతో చైతన్యపరచిన, పునీతం చేసిన భూమి మనది. అలాంటి భూమిని మనం తగిన విధంగా గౌరవిస్తున్నామా? భూమాతతో అనుసంధానమై ఉంటున్నామా? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీనికి వనభోజనాలు చక్కటి సమాధానం అందిస్తాయి. ప్రకృతితో మమేకం కావడంతో పాటు... సామూహికంగా అందరూ కలిసి ఆనందించడానికి దోహదం చేస్తాయి. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. ఇలా ఉసిరికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ నెల నుంచి శీతాకాలం మొదలవుతుంది. సీజనల్ వ్యాధులతో పాటు దగ్గు, జలుబు లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఈ నెలలో ఉసిరి తినడం ద్వారా, లేక ఉసిరి చెట్టు నీడన గడపడం వల్ల ఆ దోషాలను నివారించుకోవచ్చు. ‘‘సకల మానవాళిని రక్షించే, వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి’’ అని చరక సంహిత పేర్కొంది.
సామూహిక జీవనం కోసం...
మానవ శరీరం పంచభూతాలైన భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని అనే అయిదు మూలకాలతో తయారవుతుంది. ఈ పంచ భూతాల తత్త్వాలతోనే మన సూక్ష్మ శరీరంలోని ఆరు చక్రాలు రూపొందాయి. ఉదాహరణకు మన సూక్ష్మ శరీరంలోని మొదటి శక్తి కేంద్రం అయిన మూలాధార చక్రం భూతత్త్వంతో ఏర్పడుతుంది. ఆ శక్తి కేంద్రంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు... మనం భూమి మీద కూర్చొని, రెండు చేతులు భూమి మీద పెట్టి, సహజయోగ పద్దతిలో ధ్యానం చేస్తే... ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఈ విధంగా పంచభూతాత్మకమైన ప్రకృతి... మానవుల సూక్ష్మ శరీరంలోని శక్తికేంద్రాలను చైతన్యపరచి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. వనభోజనాల ద్వారా సమకూరే మరో ప్రయోజనం... మనలో సామూహిక జీవనం మరింత బలపడం. పరస్పరం కలిసి పనిచేయడం వల్ల ప్రేమపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ ఉన్న మొక్కలు, చెట్లు, పువ్వుల పేర్లను పిల్లలకు పరిచయం చేయడం వల్ల... ప్రకృతి మనకు అందిస్తున్న అపారమైన సంపద ఏమిటో వారు గ్రహిస్తారు.
అందరితో సత్సంబంధాలు
మన విశుద్ధ చక్రం ఆకాశతత్త్వాన్ని కలిగి ఉంటుంది. వన భోజనాల లాంటి సామూహిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు... ఆ చక్రం వృద్ధి చెంది, చక్కటి సంభాషణా చాతుర్యం అలవడుతుంది. అందరితో సత్సంబంధాలు పెంచుకోగలుగుతాం. మనలోపల ఉన్న ఆరు చక్రాలూ సహజమైన ప్రకృతిలో ఉన్న పంచభూత తత్వాల ద్వారా చాలా వేగంగా స్పందిస్తాయి. కాబట్టి ఏడాదికి ఒకసారైనా కార్తిక మాసంలో వన భోజనాల ద్వారానైనా ప్రకృతితో మమేకమై, ధ్యానంతో, భజనలతో, ఆటపాటలతో గడిపితే... మన సామాజిక జీవితం మరింత బలోపేతం అవుతుంది.
-డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ