Share News

From Border Guard to Classroom Guide: అక్షర సైనికురాలు

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:09 AM

చిన్నప్పటి నుంచి టీచర్‌ కావాలనే లక్ష్యంతో చదువుకున్నా. ఇంటర్‌, ‘డైట్‌’ శిక్షణ పెనుమూరులో, డిగ్రీ చిత్తూరులో పూర్తి చేశాను. మేము ముగ్గురం ఆడపిల్లలం....

From Border Guard to Classroom Guide: అక్షర సైనికురాలు

కశ్మీర్‌ లోయల్లో... ఎముకలు కొరికే చలిలో గస్తీ కాస్తూనే ఉపాధ్యాయురాలు కావాలనే తన లక్ష్యం కోసం గురి తప్పని సాధన కొనసాగించింది. తాజా డీఎస్సీలో మంచి ర్యాంకుతో ఎస్‌జీటీ టీచర్‌గా ఎంపికైంది. తుపాకీ పట్టిన చేత్తోనే బలపం పట్టి భావి పౌరుల్ని తయారు చేయడానికి సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లా గొడుగుమానుపల్లె గ్రామానికి చెందిన రోజా తన ప్రయాణం గురించి ‘నవ్య’తో పంచుకుంది.

‘‘చిన్నప్పటి నుంచి టీచర్‌ కావాలనే లక్ష్యంతో చదువుకున్నా. ఇంటర్‌, ‘డైట్‌’ శిక్షణ పెనుమూరులో, డిగ్రీ చిత్తూరులో పూర్తి చేశాను. మేము ముగ్గురం ఆడపిల్లలం. నేను చిన్నదాన్ని. మా తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, జగన్నాథరెడ్డి ఆడపిల్లలనే వివక్ష లేకుండా మమ్మల్ని చూడకుండా అన్ని విధాలా ప్రోత్సహించారు. మా తమ్ముడు బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. పెద్ద అక్క అంగన్వాడీ వర్కర్‌. చిన్నక్క 2018లో టీచర్‌ ఉద్యోగం సాధించింది. నేను 2018 డీఎస్సీలో అక్కతో పాటు ఎంపిక అవ్వాల్సి ఉండగా, తృటిలో తప్పింది. 2018 డీఎస్సీ తర్వాత చాలా ఏళ్లు మళ్లీ నోటిఫికేషన్‌ పడలేదు. దీంతో 2022లో ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసి, ఎంపికయ్యాను. దేశం నలుమూలల నుంచి సుమారు 600 మంది అమ్మాయిలం పంజాబ్‌లో 11 నెలల పాటు శిక్షణ తీసుకున్నాం. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో పని చేశాను. ప్రస్తుతం జమ్మూలోని 15 బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాను.


12 గంటలు డ్యూటీ చేస్తూనే చదువుకున్నా...

జమ్మూలోని మా బెటాలియన్‌లో మొత్తం 1,200 మంది సైనికులు ఉండగా, 80 మంది అమ్మాయిలం. పగలు ఆరు గంటలు, రాత్రి ఆరు గంటలు డ్యూటీ చేయాలి. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇవ్వడంతో... పరీక్షకు ప్రిపేర్‌ అయ్యాను. 2022కు ముందు అవనిగడ్డలో మూడు నెలల పాటు టీచర్‌ ఉద్యోగానికి శిక్షణ తీసుకున్నాను. ఆ పుస్తకాలు తీసుకెళ్లి, సరిహద్దుల్లో చదువుకున్నాను. రోజూ పన్నెండు గంటల పాటు ఉద్యోగం చేస్తూ చదువుకోవడం బాగా ఇబ్బంది అనిపించేది. అయినా నా ఆశయం కోసం అన్ని విధాలా సిద్ధమయ్యాను. ‘టెట్‌’లో 150కు 138 మార్కులు, తుది పరీక్ష అయిన డీఎస్సీ ఫలితాల్లో వందకు 83.16 మార్కులు వచ్చాయి. ఈసారి చిత్తూరు జిల్లాలో ఓసీలకు 79 మార్కులకు కటాఫ్‌ విధించారు. నేను ఉత్తమ ర్యాంకుతో ఎస్‌జీటీ టీచర్‌గా ఎంపియ్యాను. ఈ విషయంలో నా ఇద్దరు అక్కలు నాకు అందించిన సహకారం మరువలేనిది. సరిహద్దుల్లో దేశం కోసం కాపలా కాస్తున్న నేను... తరగతి గదిలో అక్షర సైనికుల్ని తయారు చేయడానికి ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టబోతున్నాను. ఏడేళ్ల కిందట ఉపాధ్యాయ పోస్టు గురి తప్పినా, ఇప్పుడు నా శ్రమ ఫలించడం ఎంతో సంతోషంగా ఉంది.’’

కరీముల్లా షేక్‌

చిత్తూరు.

Updated Date - Sep 24 , 2025 | 01:09 AM