Ivy Gourd Leaves: మధుమేహానికి దొండాకులే మందు..
ABN , Publish Date - Aug 09 , 2025 | 02:33 AM
మన పూర్వుల ఆహార అలవాట్లు చాలా విశిష్టమైనవి. వాళ్లకు ఆహార కరువు తెలీదు. ఎందుకంటే ప్రకృతిలో
మన పూర్వుల ఆహార అలవాట్లు చాలా విశిష్టమైనవి. వాళ్లకు ఆహార కరువు తెలీదు. ఎందుకంటే ప్రకృతిలో కంటికి కనిపించే ఎన్నో ఆకుల్ని, కాయల్ని, పూలని, దుంపల్ని వాళ్లు ఆహారంగా మలచుకుని తిన్నారు. అలాంటి వాటిలో దొండ ఆకులు కూడా ప్రధానమైనవి. చాలా మంది దొండ ఆకులు వగరుగా ఉంటాయనుకుంటారు. కానీ ఈ ఆకులు కూడా దొండకాయల రుచిలోనే ఉంటాయి. వీటితో కూర, పప్పు, పచ్చడి మొదలైనవి చేసుకోవచ్చు. మన ఆయుర్వేద గ్రంధాల ఆధారంగా దొండ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.
దొండ ఆకులు అమితంగా చలవ చేస్తాయి. వాతాన్ని తగ్గిస్తాయి. అదే సమయంలో శరీరంలో వేడిని కూడా తగ్గిస్తాయి. తరుచు నోటి పూత వచ్చేవారు.
కామెర్ల వ్యాధికి దొండాకుల రసం మంచి మందు. దొండ ఆకుల రసాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ఒక కప్పుడు తాగితే కామెర్లు తగ్గుతాయి.
దొండ ఆకులు రక్తహీనతను తగ్గిస్తాయి. రక్తపుష్టినిస్తాయి.
దొండ ఆకుల రసం క్రమం తప్పకుండా తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. స్థూలకాయం తగ్గుతుంది.
పురుషుల్లో లైంగిక బలహీనతను నివారించే గుణం దొండాకులకుంది.
దొండ ఆకులను ఎండబెట్టి పొడిచేసి నీటిలో కలుపుకుని ప్రతి రోజూ తాగితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దొండ ఆకులు మాత్రమే కాకుండా.. దొండ పువ్వులు, దొండ వేర్లు కూడా మధుమేహ వ్యాధి నివారణకు పనికొస్తాయి.
పక్క తడిపే పిల్లలకు దొండ ఆకులు, దొండవేళ్లు కలిపి నూరిన పసరును తేనెతో కలిపి తాగిస్తే వారిలో మార్పు వస్తుంది.
దొండ ఆకుల పచ్చడి చేయటం ఇలా...
దొండ ఆకులను శుభ్రంగా కడిగి.. సన్నగా తరగాలి. ఈ ఆకులను ఉప్పు నీళ్లలో వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఈ ఆకులకు నేతితో తాలింపు పెట్టాలి. కొద్దిగా ఇంగువ వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి ముద్దగా చేయాలి.