Share News

Shweta Agarwal: చిన్నారుల భవితకు దిక్సూచి

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:19 AM

స్కూలు ఫీజు కట్టలేక అవమానాలు పడ్డారు. పట్టుదలతో చదివి ఆర్కిటెక్ట్‌ అయ్యారు. జీవితానికి అర్థం వెతుకుతూ దేశమంతా తిరిగారు. ‘తోటివారికి సాయం చెయ్యడమే జీవిత....

Shweta Agarwal: చిన్నారుల భవితకు దిక్సూచి

స్కూలు ఫీజు కట్టలేక అవమానాలు పడ్డారు. పట్టుదలతో చదివి ఆర్కిటెక్ట్‌ అయ్యారు. జీవితానికి అర్థం వెతుకుతూ దేశమంతా తిరిగారు. ‘తోటివారికి సాయం చెయ్యడమే జీవిత పరమార్థం’ అని తెలుసుకున్నారు. ఇప్పుడు వేలాదిమంది పిల్లల భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తున్నారు. ఒడిశాకు చెందిన శ్వేతా అగర్వాల్‌ ప్రయాణం ఇది.

‘‘అప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను. మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నా స్కూలు ఫీజు కట్టకపోవడంతో తరగతిలోకి రానివ్వలేదు. తోటి పిల్లల నుంచి అవమానం, ఎగతాళి ఎదుర్కొన్నాను. ‘ఆర్థిక సమస్యల వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం కాకూడదు’ అనే నా నిశ్చయానికి బీజం అప్పుడే పడింది’’ అంటారు శ్వేతా అగర్వాల్‌. ఆర్కిటెక్ట్‌ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా... చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. ఎన్నో ఇబ్బందులు పడినా... పట్టుదలతో చదివారు, అనుకున్నది సాధించారు. అగ్రశ్రేణి కంపెనీల్లో పని చేశారు. పెద్ద ఆసుపత్రులను డిజైన్‌ చేశారు. ‘‘ఆసుపత్రుల్లో రోగుల్ని చూసినప్పుడు ‘ఇంతమంది ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారు? సైన్స్‌ ఇంత పురోగతి సాధించినా రోగాలు ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి?’... ఇలాంటి ప్రశ్నలు నన్ను వేధించేవి. మరోవైపు నాలో ఏదో వెలితి. వృత్తిపరమైన విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నానని గ్రహించాను’’ అని గుర్తు చేసుకున్నారు శ్వేత.

జీవిత పాఠాలెన్నో నేర్చుకున్నా...

ఆ తరువాత ఆమె ఉద్యోగాన్ని వదిలేసి... వివిధ ప్రాంతాల్ని సందర్శించడం ప్రారంభించారు. ‘‘మన దేశంలో ఎన్నో ప్రదేశాలు చూశాను. నేపాల్‌ కూడా వెళ్ళాను. ట్రక్కుల్లో ప్రయాణం, రైతుల ఇళ్ళలో బస... ఇలా గొప్ప అనుభూతులు అనేకం ఉన్నాయి. అప్పుడే ఫొటోగ్రాఫర్‌గా మారాను. ఆ సంచారం నాకు జీవిత పాఠాలు ఎన్నో నేర్పింది. రకరకాల మనుషులను చూసిన తరువాత... పేదరికం, వ్యాధులు, హింస, పర్యావరణ సంక్షోభం... ఈ సమస్యలన్నిటికీ మూలకారణాలు... ఆరోగ్యవంతమైన, నాణ్యమైన విద్య లేకపోవడమేనని గ్రహించాను’’ అని చెప్పారు శ్వేత. తన యాత్రను ముగించుకొని భువనేశ్వర్‌కు తిరిగి వచ్చిన ఆమె... ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’లో భాగమైన ‘టీఎ్‌ఫఐఎక్స్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడే తను పయనించాల్సిన మార్గం ఆమెకు స్పష్టమయింది. పిల్లల కోసం అంకితభావంతో పని చేస్తున్న యువతను చూశాక... సమాజంలో మార్పు వస్తుందనే నమ్మకం కలిగింది. 2017లో ‘ఉన్ముక్త్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ ఏర్పాటుకు ప్రేరణ ఇచ్చింది.


చేయాల్సింది చాలా ఉంది...

సామాజిక సేవపై ఆసక్తి ఉన్న యువత ఆ సంస్థలో వాలంటీర్లుగా చేరారు. పేద, గ్రామీణ పిల్లల కోసం ‘ఫ్రీడమ్‌ ఫెలోషిప్‌’ పేరిట రెండేళ్ళ కార్యక్రమానికి శ్వేత రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా వాలంటీర్లు పాఠశాలలకు, సామాజిక కేంద్రాలకు వెళ్తారు. పిల్లల్లో శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా ఎదుగుదలకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారిలో సృజనాత్మకత, పర్యావరణ స్పృహ, నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదం చేస్తారు. ‘‘విద్య అనేది కేవలం మెదడుకు సంబంధించినది కాదు, అది శరీరానికి, ఆత్మకు కూడా సంబంధించింది. అందుకే కళలు, సామాజిక విలువలు, సహానుభూతి లాంటి అంశాలను కూడా పిల్లలకు నేర్పిస్తున్నాం. ఇప్పటివరకూ కొన్ని వేలమంది ‘ఉన్ముక్త్‌’ ద్వారా ప్రయోజనం పొందారు. ఈ కృషికి గుర్తింపుగా అవార్డులు కూడా అందుకున్నాను. అయితే చేసినదానితో సంతృప్తి పడడం లేదు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది’’ అని చెబుతున్నారు శ్వేత.

Updated Date - Dec 22 , 2025 | 04:19 AM