Venkateswara in the Forests of Thailand: థాయ్‌లాండ్ అడవుల్లో వెంకటేశ్వరుడు!
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:49 AM
ఒకప్పుడు శాతవాహనులకు దక్షిణాసియాలోని అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉండేవి. మచిలీపట్నం, చెన్నపట్నం లాంటి రేవుల నుంచి నౌకలు ఇతర దేశాలకు వెళ్తూ ఉండేవి, వస్తూ ఉండేవి....
ఒకప్పుడు శాతవాహనులకు దక్షిణాసియాలోని అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉండేవి. మచిలీపట్నం, చెన్నపట్నం లాంటి రేవుల నుంచి నౌకలు ఇతర దేశాలకు వెళ్తూ ఉండేవి, వస్తూ ఉండేవి. ఈ సమయంలోనే మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను, హిందూ మతాన్ని అనేకమంది ఇతర దేశాలలో ప్రచారం చేశారు. ఈ సమయంలోనే దక్షిణ భారత దేశానికి చెందిన కొందరు బ్రాహ్మణులు ప్రస్తుత థాయ్‌లాండ్ ప్రాంతానికి తరలి వెళ్లారు. అక్కడ హిందూ మతాన్ని ప్రచారం చేశారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఫాంగ్ నాగా ప్రాంతంలోని అడవులలో ప్రతిష్ఠించిన విష్ణుమూర్తి విగ్రహం.
బౌద్ధ సన్యాసులు పూజారులు...
ఈ విగ్రహం ఆ ప్రాంతంలో ప్రతిష్టించటానికి అనేక కారణాలున్నాయి. ఒకప్పుడు కంబోడియా, బర్మాలకు చెందిన వారు... థాయ్‌లాండ్‌లోని పుణ్యక్షేత్రాల మీద దాడులు చేసేవారు. అక్కడి విగ్రహాలను ఎత్తుకుపోయి తమ వద్ద ప్రతిష్ఠించుకొనేవారు. ఇలాంటి మూకల నుంచి రక్షించటానికి... ఒక చెట్టు తొర్రలో కొన్ని ప్రత్యేకమైన తాంత్రిక ప్రక్రియ ద్వారా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతంలోని స్థలపురాణాల ప్రకారం- కేవలం విష్ణువుపై స్వచ్ఛమైన భక్తి ఉన్నవారు మాత్రమే ఈ విగ్రహాన్ని దర్శించగలుగుతారు. సుమారు 35 సంవత్సరాల క్రితం... బౌద్ధులు ఈ ప్రాంతంలో తమ ఆరామాన్ని నిర్మించుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు చెట్టు తొర్రలో ఈ విగ్రహం దొరికింది. అక్కడ నివసించే ఒక వృద్ధ బౌద్ధ సన్యాసి ఈ విగ్రహం ఎలా దొరికిందో నాకు వివరించారు. ‘‘మేము ఆరామం నిర్మించుకోవటానికి అనువైన స్థలం కోసం అడవిలో వెతుకుతున్నాం. ఇంతలో ఒక పిల్లవాడు మా దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టు వైపు చూపించాడు. మేమందరం అక్కడకి వెళ్తే మూడు విగ్రహాలు కనిపించాయి. ఒకటి పెద్ద విష్ణువు విగ్రహం. మరొకటి అమ్మవారి విగ్రహం. ఇంకొక విగ్రహం ఏమిటో ఇంకా తెలియదు. ఈ మూడింటిని చూసి బయటకు వచ్చేసరికి ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఒక రాయివైపు వెళ్లాడు. రాయిపై కాలు వేసి అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ ఆ రాయి, దానిపై కాలి గుర్తులు మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆ పిల్లవాడు నాకు ఎప్పుడూ కనబడలేదు..’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విగ్రహాలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలోనే ఆరామం నిర్మించుకోవాలనుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని నివాసయోగ్యంగా మార్చుకున్నారు. ఈ ప్రాంతానికి ‘నారాయణ నికరం’ అని పేరుపెట్టారు. అప్పటి నుంచి ఈ విగ్రహానికి బౌద్ధ సన్యాసులు తమవైన పద్ధతుల్లో పూజలు చేస్తూ ఉంటారు.
ఆధ్యాత్మిక పరిశోధకురాలు, థాయ్‌లాండ్