Ananya Vishwesh: అడవే ఆమె చిరునామా
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:39 AM
అడవి, పక్షులు, జంతువులు, ప్రకృతి... వీటితో అనన్యా విశ్వేశ్ జీవితం బాల్యంలోనే పెనవేసుకుపోయింది. ఇప్పటికే కొన్ని పదుల సర్పాల్ని కాపాడింది. వేలమంది పిల్లలకు పర్యావరణ పాఠాలు చెబుతోంది. ‘‘తరగతి గదిలోకన్నా ఎక్కువ విషయాలను అడవిలో నేర్చుకున్నాను’’ అంటోంది కేరళకు చెందిన ఈ 14 ఏళ్ళ అమ్మాయి.....
అడవి, పక్షులు, జంతువులు, ప్రకృతి... వీటితో అనన్యా విశ్వేశ్ జీవితం బాల్యంలోనే పెనవేసుకుపోయింది. ఇప్పటికే కొన్ని పదుల సర్పాల్ని కాపాడింది. వేలమంది పిల్లలకు పర్యావరణ పాఠాలు చెబుతోంది. ‘‘తరగతి గదిలోకన్నా ఎక్కువ విషయాలను అడవిలో నేర్చుకున్నాను’’ అంటోంది కేరళకు చెందిన ఈ 14 ఏళ్ళ అమ్మాయి.
‘‘పాముల కోసం నీ ప్రాణాల్ని ఎందుకు రిస్క్ చేస్తావు? అని ఒకసారి నన్ను ఎవరో అడిగారు. ‘‘ఎందుకంటే... మనం చాలా భయపడే జీవుల్ని ఎవరో ఒకరు పట్టించుకోవాలి కదా!’’ అని బదులిచ్చాను. నా స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. చుట్టూ చెట్లు, పక్షుల అరుపులు, వర్షం కురిసిన తరువాత మట్టి వాసన... వీటన్నిటి మధ్యా పెరిగాను. ఆరేళ్ళ వయసులో ఊటీకి విహారయాత్రకు వెళ్ళాను. పొగమంచు కప్పేసిన కొండలు, ప్రకృతి సౌందర్యం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. వన్యప్రాణులంటే మక్కువ బాగా పెరిగింది. ఆ తరువాత ఊటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలగిరి జిల్లా మసినగుడి గ్రామానికి మా కుటుంబం మారింది. ఆరేళ్ళపాటు అక్కడ ఉన్నాం. ఆ గ్రామం ముదుమలై నేషనల్ పార్క్‌కు సమీపంలో ఉంటుంది. దాంతో తరచు అడవిలోకి వెళ్ళడం, పక్షులను పరిశీలించడం, వాటి గురించి తెలుసుకోవడం నాకు హాబీగా మారిపోయింది. అలా... 288 పక్షి జాతులను ఫొటోలు తీశాను. వాటన్నిటి వివరాలతో... పదకొండేళ్ళకే ‘బర్డ్స్ ఆఫ్ మసినగుడి’ అనే పుస్తకాన్ని విడుదల చేశాను. ఆ సందర్భంగా నా పేరు ‘ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు చేసుకుంది.
పాము కనిపిస్తే ఫోన్ చేస్తారు...
ఏనుగులంటే నాకు చాలా ఇష్టం. ముదుమలై అడవుల్లో వాటికి దగ్గరగా గడిపే అవకాశం చాలాసార్లు కలిగింది. అలాగే నన్ను బాగా ఆకర్షించినవి... పాములు, బల్లులు లాంటి ‘సరీసృపాలు’. నా తోటి పిల్లలు జంతువుల బొమ్మలున్న స్టిక్కర్లు సేకరిస్తూ ఉంటే... నేను సరీసృపాల వివరాలను సేకరించడం మొదలుపెట్టాను. ఈలోగా కొవిడ్ వచ్చింది. బడులు మూతపడడంతో చాలా సమయం దొరికింది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో... హెర్మటాలజీలో జూనియర్ మాస్టర్స్ కోర్సు చేసి, సర్టిఫికెట్ అందుకున్నాను. చాలామంది పాములంటే భయపడతారు. కానీ ఆ కోర్సు తరువాత... నాకు ప్రమాదం లేకుండా వాటిని పట్టుకోవడం నేర్చుకున్నాను. మా స్వస్థలమైన పాలక్కాడ్‌కు తిరిగి వచ్చిన తరువాత... వన్యప్రాణుల సంక్షేమం కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థలతో, కేరళ అటవీశాఖతో కలిసి పని చెయ్యడం ప్రారంభించాను. నా నైపుణ్యాన్ని గుర్తించిన అధికారులు జనావాసాల్లో ప్రవేశించే పాములను పట్టుకోవడానికి పిలుస్తున్నారు. అంతేకాదు... నా గురించి తెలుసుకున్న స్థానికులు కూడా ఎక్కడైనా పాము కనిపిస్తే నాకు ఫోన్ చేస్తారు. ఇప్పటివరకూ 75కు పైగా పాములను పట్టుకొని... వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలిపెట్టాను.
ఆరు భాషలు వచ్చు...
ప్రస్తుతం నేను బెంగళూరుకు చెందిన ఒక స్కూల్‌లో ఆన్‌లైన్ విధానంలో చదువుతున్నాను. మా నాన్న విశ్వనాథన్ సుబ్రహ్మణియం వ్యాపారవేత్త. మా అమ్మ స్కూల్ టీచర్. నా అభిరుచులకు వారు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. వారి సహకారంతోనే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అటవీ శాఖ నిర్వహించే ఫారెస్ట్ నేచర్ క్యాంప్‌లకు హాజరు కాగలుగుతున్నాను. నేను ఆరు భాషలు మాట్లాడగలను. విద్యా సంస్థల్లో, ఇతర చోట్ల వర్క్‌షాపులు తదితర కార్యక్రమాల ద్వారా వన్యప్రాణులను, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి ఇప్పటివరకూ దాదాపు పదివేలమంది విద్యార్థులకు అవగాహన కల్పించాను. ప్రముఖ సంస్థల నుంచి ‘యంగ్ అఛీవర్’ తదితర అవార్డులు అందుకున్నాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీ్‌సలో చేరాలన్నది నా ఆశయం. దాని కోసం కృషి చేస్తూనే వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమాలను కొనసాగించాలనుకుంటున్నాను.’’