Share News

Anjali Sud: ఆమె పయనం సమున్నతం

ABN , Publish Date - Jun 02 , 2025 | 04:56 AM

భారత సంతతికి చెందిన అంజలి సూద్‌ను హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ‘బోర్డ్‌ ఆఫ్‌ ఓవర్సీర్స్‌’ సభ్యురాలిగా నియమించడంపై నెటిజన్లు ఆసక్తిగా ఉన్నారు. ట్యూబి సీఈఓగా ఉన్న ఆమె, గతంలో ప్రముఖ కంపెనీల్లో కీలకపాత్రలు నిర్వహించారు.

Anjali Sud: ఆమె పయనం  సమున్నతం

అంజలి సూద్‌... భారత సంతతికి చెందిన ఈ అమెరికన్‌ గురించి ఇప్పుడు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

కారణం... ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం... ‘బోర్డ్‌ ఆఫ్‌ ఓవర్సీర్స్‌’ (పర్యవేక్షక మండలి) సభ్యురాలిగా ఆమెను ఎంపిక చేయడం.

అమెరికా ఓటీటీ ‘ట్యూబి’ సీఈఓగా ఉన్న అంజలి... గతంలో విమియో, అమెజాన్‌ తదితర ప్రముఖ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పని చేశారు. వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించి... లాభాల బాట పట్టించారు.

‘విద్యాశక్తి ద్వారా అమ్మానాన్నలు నా గురించి కన్న కలలను నిజం చేశాను. దాన్ని రేపటి తరానికి అందించాలని కోరుకొంటున్నాను’ అంటున్న 41 ఏళ్ల అంజలి విజయ ప్రస్థానం ఇది.

అమెరికాలో ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్‌ ప్రభుత్వం... హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం మధ్య వివాదం తీవ్రస్థాయికి వెళ్లింది. ఈ తరుణంలో అంజలి వర్సిటీ ‘బోర్డ్‌ ఆఫ్‌ ఓవర్సీర్స్‌’ సభ్యురాలిగా ఎంపిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పదవిలో ఆమె రెండేళ్లు కొనసాగుతారు. ‘బోర్డ్‌ ఆఫ్‌ ఓవర్సీర్స్‌’... హార్వర్డ్‌ రెండో అత్యున్నత పాలకమండలి. లిబరల్‌ పార్టీ నాయకుడిగా ఎన్నికైన మార్క్‌ కార్నే బోర్డులో తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో, ఆ ఖాళీని అంజలితో భర్తీ చేసింది వర్సిటీ. ఆమె హార్వర్డ్‌ పూర్వ విద్యార్థిని కూడా.

అదే వర్సిటీలో...

అంజలిది అమెరికాలో స్థిరపడిన పంజాబీ కుటుంబం. డెట్రాయిట్‌లో పుట్టిన ఆమె... ఫ్లింట్‌ నగరంలో పెరిగారు. పధ్నాలుగేళ్ల వయసులో ‘ఫిలిప్స్‌ అండోవర్‌ అకాడమీ’లో చదివేందుకు మసాచుసెట్స్‌ వెళ్లారు. 2005లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో బీఎస్సీ పూర్తి చేశారు. 2011లో హార్వర్డ్‌ వర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇప్పుడు అదే వర్సిటీ పాలక మండలిలో కీలక బాధ్యతలు చేపట్టారు.


ఉన్నత హోదాలు...

బీఎస్సీ అవ్వగానే ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించిన అంజలి కెరీర్‌ వాయు వేగంతో దూసుకుపోయింది. 2005- 2014 మధ్యకాలంలో ఆమె సాజెంట్‌ అడ్వైజర్స్‌, టైమ్‌ వార్నర్‌, అమేజాన్‌లలో ఫైనాన్స్‌, మీడియా విభాగాల్లో పని చేశారు. తరువాత ‘విమియో’ గ్రూప్‌లో గ్లోబల్‌ మార్కెటింగ్‌ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లు తిరక్కుండానే ఆ కంపెనీకి సీఈఓ అయ్యారు. అంజలి సారథ్యంలో కంపెనీ కంటెంట్‌ ప్రొడక్షన్‌ నుంచి కంటెంట్‌ క్రియేటర్లకు సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ అందించే స్థాయికి ఎదిగింది. ఎన్నడూ చూడని లాభాలను ఆర్జించింది. ప్రత్యక్ష ప్రసారాలకు ఉద్దేశించిన ‘లైవ్‌స్ర్టీమ్‌’, వీడియో ఎడిటింగ్‌ కోసం తెచ్చిన ‘మ్యాజిస్టో’ యాప్‌లతో పాటు ‘వైర్‌మ్యాక్స్‌, విబ్బిట్జ్‌’ సాఫ్ట్‌వేర్‌ స్టార్ట్‌పలను ‘విమియో’ సొంతం చేసుకోవడంలో అంజలిదే ప్రముఖ పాత్ర.

కొత్త బాధ్యతలు...

తాజాగా హార్వర్డ్‌ వర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ ఓవర్సీర్స్‌కు ఎంపిక కావడంతో తన కల నెరవేరిందంటారు అంజలి. ‘మా అమ్మానాన్న నా గురించి ఎన్నో కలలు కన్నారు. విద్యాశక్తి ద్వారా ఆ కలలను నేను సాకారం చేయగలిగాను. దీన్ని తరువాతి తరాలవారికి అందించాలనేది నా సంకల్పం’ అంటున్న అంజలి... హార్వర్డ్‌ అందుకు సరైన వేదికగా భావిస్తున్నారు. అంతేకాదు... ఆమె ప్రస్తుతం ‘సిరియస్‌ ఎక్స్‌ఎమ్‌, డోల్బీ లేబరెటరీ్‌స’కు బోర్డు మెంబర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ‘చేంజ్‌ డాట్‌ ఓఆర్జీ’కి చైర్మన్‌గా ఉన్నారు.


అందరిలో ఆసక్తి...

హార్వర్డ్‌లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల సమాచారం ప్రభుత్వానికి ఇచ్చేందుకు వర్సిటీ నిరాకరించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీంతో అటు వర్సిటీకి, ఇటు ట్రంప్‌ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వర్సిటీ పాలక మండలిలో అంజలి కీలక బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె కార్యాచరణ ఎలా ఉంటుందనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

అవార్డులు ఎన్నో...

ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫార్చూన్‌ 40 అండర్‌ 40’ జాబితాలో చోటు దక్కించుకున్న అంజలి ఎన్నో అవార్డులు, గౌరవ సత్కారాలు అందుకున్నారు. 2019లో ఆమెకు ‘న్యూయార్క్‌ ఉమెన్‌ ఇన్‌ ఫిలిమ్‌ అండ్‌ టెలివిజన్‌’ అవార్డు లభించింది. గత సంవత్సరం ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌’ ప్రకటించిన వినోద రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో అంజలికి చోటు దక్కింది. అంచెలంచెలుగా ఎదుగుతూ కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఆమె నికర ఆదాయం దాదాపు రూ.73 కోట్లు. ఇదంతా వివిధ కంపెనీలకు అందించిన సేవల ద్వారా పొందిన ప్రతిఫలం. సాధించాలన్న పట్టుదల, బలమైన సంకల్పం ఉంటే ఏ లక్ష్యం పెద్దది కాదని అంజలి నిరూపించారు. కలలను ఛేదించి... భావితరాలకు స్ఫూర్తిమంత్రం అయ్యారు.


విజయ పరంపర...

దాదాపు పదేళ్లపాటు విమియో విజయాల్లో భాగస్వామి అయిన అంజలి... 2023లో కంపెనీ నుంచి తప్పుకున్నారు. ఆ వెంటనే ఫాక్స్‌ కార్పొరేషన్‌ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. దాని అనుబంధ సంస్థ అయిన ‘ట్యూబి’ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అమెరికాలో ఉచితంగా సినిమాలు, టీవీ షోలు అందించే ఓటీటీ వేదిక ఇది. అంజలి చేరికతో కంపెనీ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది. నెలకు దాదాపు పది కోట్ల మంది దీన్ని ఉపయోగిస్తున్నారంటే... అందులో ఆమె కృషి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 04:56 AM