Share News

Color Changing Cars: రంగులు మార్చే కార్లు

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:49 AM

కారు కొన్నాం... అని ఎవరైనా చెప్పగానే సహజంగా అందరూ అడిగేది.. కార్‌ కలర్‌ ఏంటి అని కారు రంగుకు అంత ప్రత్యేకత ఉంటుంది.

Color Changing Cars: రంగులు మార్చే కార్లు

దశాబ్దాల క్రితమే ప్రతిపాదనలు.. అప్పట్నుంచీ చర్చ.. బీఎండబ్ల్యూ, నిస్సాన్‌, ఫోర్డ్‌ సంస్థల ప్రయోగాలు

  • అన్నీ ఇంకా ప్రతిపాదనలు, పరిశోధనల దశలోనే!

  • నీతా అంబానీ వద్ద ఈ తరహా ఔడీ కారుందంటూవైరల్‌ అవుతున్న వార్తలన్నీ వదంతులే : నిపుణులు

‘కారు కొన్నాం’.. అని ఎవరైనా చెప్పగానే సహజంగా అందరూ అడిగేది.. ‘కార్‌ కలర్‌ ఏంటి?’ అని! కారు రంగుకు అంత ప్రత్యేకత ఉంటుంది. కంటికి ఆహ్లాదకరంగా కనిపించడానికే కాదు.. గుర్తింపునకు కారు రంగు ఉపయోగపడుతుంది. ఏదైనా నేరం జరిగినప్పుడు.. నేరగాళ్లు వాడే వాహ నం (కారు/వ్యాన్‌.. ఇలా ఏదైనా) రంగు దర్యాప్తు సంస్థలకు కీలకంగా మారుతుంది. అందుకే కారు రిజిస్ట్రేషన్‌ సందర్భంగా తప్పనిసరిగా కారు రంగును పేర్కొంటారు. అంత కీలకమైన కారు రంగు.. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా కావాలంటే అలా మారిపోతే? వినడానికే చాలా ఉత్సాహంగా ఉన్న ఈ ఆలోచన కార్ల తయారీదారులు, వినియోగదారులకు చాలా కాలంగానే ఉంది. రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ భార్య నీతా వద్ద రంగులు మార్చే సత్తా ఉన్న ఔడీ-ఏ9 కారు ఉందని.. దాని విలువ రూ.100 కోట్లని.. ప్రపంచం మొత్తమ్మీదా ఇలాంటి కార్లు 11 మాత్రమే ఉన్నాయని.. వాటిలో ఒకటి నీతా వద్ద ఉందన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కానీ.. అది వదంతి మాత్రమేనని, అందులో నిజంలేదని ఆటోమొబైల్‌రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ డిజైన్‌ను 2010లో స్పెయిన్‌కు చెందిన డేనియల్‌ గ్రేసియా అనే డిజైనర్‌ ప్రతిపాదించాడని వారు తెలిపారు. ఆయన ప్రతిపాదనకు, ఔడీ సంస్థకు ఎలాంటి సంబంధమూలేదని.. అలాంటి ఒక ప్రసిద్ధ కంపెనీ పేరుతో ఈ ఆలోచనను మార్కెట్లోకి తీసుకెళ్తే ఎక్కువ ప్రచారం లభిస్తుందనే ఉద్దేశంతోనే అలా చేశారని సమాచారం. అప్పట్నుంచీ ఇది అడపాదడపా వార్తల్లో కనిపిస్తూ నే ఉంది. డేవిడ్‌ గ్రేషియా ప్రతిపాదన అప్పట్నుంచీ కాన్సెప్ట్‌ దశలోనే ఉంది తప్ప.. వాస్తవరూపం దాల్చలేదు. ఆయన ప్రతిపాదన ప్రకారం నానో టెక్నాలజీ సాయంతో కారు రం గులు మారేలా చేయొచ్చు. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని కావడం, ఔడీ సంస్థకు ఆయనకు ఏ సంబంధమూ లేకపోవడంతో ఆ ప్రాజెక్టు అసలు పట్టాలే ఎక్కలేదు.

ఆటోమొబైల్‌ పరిశ్రమలో సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. మారనిదల్లా కార్లకు వేస్తున్న రంగులు మాత్రమే. రంగుల టెక్నాలజీలో మార్పులు వచ్చాయిగానీ.. ప్రాథమికంగా చాలా కార్లు తెలుపు, నలుపు, బూడిద, నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లోనే కనిపిస్తాయి. కొన్ని మాత్రమే వీటికి భిన్నమైన రంగుల్లో కనిపిస్తాయి. ఒకే రంగు కాకుండా కావాలనుకున్నప్పుడు కావాలనుకునే రంగులోకి మారే కార్ల తయారీపై ఉత్పత్తి సంస్థలకు చాలాకాలంగా ఆసక్తి ఉంది. ఈక్రమంలోనే బీఎండబ్ల్యూ, లెక్సస్‌, ఫోర్డ్‌, నిస్సాన్‌ వంటి కార్ల కంపెనీలు పలు ప్రయోగాలు చేశాయి. ఈ-ఇంక్‌ టెక్నాలజీ, కెమెలియన్‌ ర్యాప్‌, కెమెలియన్‌, టెంపరేచర్‌ సెన్సిటివ్‌ పెయింట్‌వంటి పరిజ్ఞానాలతో కార్ల రంగులు మార్చే ప్రయత్నాలు చేశాయి.


ఈ-ఇంక్‌ టెక్నాలజీ: బీఎండబ్ల్యూ 2022లో జరిగిన కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ షో (సీఎస్‌ఈ)లో తొలిసారి ఒక కలర్‌ చేజింగ్‌ కార్‌ను ప్రదర్శనకు పెట్టింది. ఇంద్రధనుస్సులో ఉండే అన్ని రంగులూ కనిపించే కారు కాదది. కేవలం నలుపు, తెలుపు, బూడిదరంగుల్లోని రకరకాల షేడ్స్‌లోకి మారుతుందది. ఎలకో్ట్ర ఫోరేటిక్‌ ఇంక్‌ (ఈ-ఇంక్‌) ప్యానెల్స్‌ ద్వారా ఆ కారు రంగులు మారుస్తుంది. దీన్ని మరింత ఆధునీకరించి.. నలుపు, తెలుపు, బూడిదరంగుల్లోని 32 షేడ్స్‌లోకి మారేలా చేశారు. 2023 సీఈఎ్‌సలో దాన్ని ‘బీఎండబ్ల్యూ ఐ విజన్‌ డీ’ పేరుతో ప్రదర్శించారు. ఈ రెండు కార్లూ ఇంకా ప్రోటోటైప్‌ దశలోనే ఉన్నాయి. మార్కెట్లోకి రాలేదు.

కెమెలియన్‌ రాప్‌:కారుపై పెయింట్‌కు బదులు పల్చటి, బలమైన వినైల్‌ షీట్‌ను అతికిస్తారు. ఆ షీట్‌లో కలర్‌ షిఫ్ట్‌ పిగ్మెంట్లు ఉండటం వల్ల కారును మనం ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో రంగులో కనిపిస్తుంది. 2010-2012 మధ్య లెక్సస్‌ తయారుచేసిన ఎల్‌ఎ్‌ఫఏ మోడల్‌ కార్లను కొన్న సం పన్నులు.. వినైల్‌ షీట్లను అతికించి హల్‌చల్‌ చేశారు. 2012 తర్వాత ఈ మోడల్‌ కార్ల తయారీని లెక్సస్‌ నిలిపేసింది.

కెమెలియన్‌ పెయింట్‌ : నిస్సాన్‌ ‘కెమెలియన్‌ పెయింట్‌’పై ప్రయోగాలు చేసింది. ఇందులో భాగంగా వాడే ‘ఎలకో్ట్రక్రోమిక్‌ పెయింట్‌’లోని మాలిక్యూల్స్‌ రంగు.. ఓల్టేజ్‌ను బట్టి మారుతుంది. కారులోని డ్రైవర్‌ చిన్న బటన్‌ నొక్కి ఓల్టేజీలో మార్పులతో కారు కలర్‌ మారేలా చేయొచ్చు. కారును పగలు తెల్లగా.. రాత్రిపూట నల్లగా మార్చుకోవచ్చు. కానీ, ఇదింకా పరిశోధన దశలోనే ఉంది.

చివరాఖరు: నీతాఅంబానీ వద్ద రంగులు మార్చే రూ.100కోట్ల కారు లేదుగానీ.. ఆమె వాడే అత్యంత ఖరీదైన కారు.. ‘రోల్స్‌రాయిస్‌ ఫాంట్‌ 8 ఈడబ్ల్యూబీ’ మోడల్‌. అది బేసిక్‌ మోడలే రూ.12కోట్ల దాకా ఉంటుందని అంచనా. దానికి నీతా కోరిన మరిన్ని హంగులతో అందించేందుకు ఇంకా భారీగానే ఖర్చయి ఉంటుందని చెబుతారు.

- సెంట్రల్‌ డెస్క్‌

టెంపరేచర్‌ సెన్సిటివ్‌ పెయింట్‌

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌.. టెంపరేచర్‌ సెన్సిటివ్‌ (థెర్మోక్రోమిక్‌) పెయింట్‌పై విస్తృత పరిశోధనలు చేసింది. ఈ పెయింట్‌ వేసిన కారు వేడి తగిలితే ఒక రంగులోకి, చల్లగా ఉన్నప్పుడు మరో రంగులోకి మారిపోతుంది (ఫోర్డ్‌ ఒక డెమోలో భాగం గా.. కారుపై వేడినీరు పోసినప్పుడు బాడీ కలర్‌ మారింది). కానీ ఇది కాన్సెప్ట్‌ దశలోనే ఆగిపోయింది. కారుపై ఈ పెయింట్‌ వేస్తే వాతావరణ ప్రభావానికి సులభంగా దెబ్బతింటుంది. మన్నిక తక్కువ. నిర్వహణ ఖర్చు ఎక్కువ. అందుకే దీని ఉత్పత్తి ప్రారంభించలేదు.

Updated Date - Aug 12 , 2025 | 04:50 AM