Relationship: భర్తల్లో ఈ లక్షణాలుంటే.. భార్యల్లో పెరిగే విముఖత
ABN , Publish Date - Dec 07 , 2025 | 10:21 PM
భర్తల్లో కొన్ని లక్షణాలు భార్యలకు చిరాకు తెప్పించి చివరకు వివాహ బంధాన్ని బలహీన పరిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అవేంటో తెలుసుకుని ముందుగా మార్చుకుంటే వివాహ బంధాన్ని కాపాడుకోవచ్చని మ్యారేజ్ కౌన్సిలర్లు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో స్త్రీపురుషుల బంధాల్లో క్షణాల్లో విచ్ఛిన్నమైపోతున్నాయి. పూడ్చలేనంత ఎడం పెరిగినప్పుడు విడిపోవడమే మంచిది. కానీ చిన్న చిన్న విషయాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే బంధాలను కాపాడుకోవచ్చని మ్యారేజ్ కౌన్సిలర్లు చెబుతుంటారు. ముఖ్యంగా పురుషుల్లో కనిపించే కొన్ని లక్షణాలు వారి భార్యల్లో విముఖత పెంచుతాయని అంటున్నారు.
పెళ్లయిన కొత్తల్లో భర్తలు తమ భాగస్వాములకు తగిన సమయం కేటాయిస్తారు. రానురాను ఇందులో మార్పు వస్తుంది. భార్యల వెంట బయటకు వచ్చేందుకు కూడా కొందరు ఆసక్తి కనబరచరు. దీంతో, మహిళల్లో ఒంటరితనం పెరుగుతుందని, మానసిక బంధం తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళల వేషధారణ, రూపురేఖలను భర్తలు నిత్యం విమర్శించడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది. ఈ విషయంలో అనవసర ఆంక్షలు విధించడం కూడా ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇలాంటివి అస్సలు చేయకూడదు.
భార్య సమక్షంలోనే వారి గురించి ఇతరులతో భర్తలు విమర్శలకు దిగడం, లేదా చిన్న చిన్న విమర్శలు చేయడం బంధాన్ని బలహీన పరుస్తుంది. అది ఆ సమయంలో జోక్‌గా అనిపించినా మానసికంగా గాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మహిళలకు తమకంటూ వ్యక్తిగత సమయం లేకుండా వారి భర్తలు నిత్యం ఏదోక పని అప్పజెప్పడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది. మహిళలు తమ పుట్టింటికి వెళుతున్నా భర్తలు వెంట వస్తే వారు ఇబ్బందిగా ఫీలయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మహిళలు తమ పుట్టింటి వారిపై విమర్శలను అస్సలు సహించరు. కానీ ఈ విషయాన్ని అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ భార్యల పుట్టింటి వారిని విమర్శిస్తుంటారు. ఇది కూడా భార్యాభర్తల బంధానికి చేటు తెస్తుందన్న విషయం మర్చిపోకూడదు.
కాబట్టి పురుషులు ఈ విషయాలను మనసులో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలు ముదరకుండా మొదట్లోనే తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read:
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..
ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో చూశారా
For More Lifestyle News