JEE Main preparation: అప్రమత్తంగా వ్యవహరిస్తే అధిక స్కోర్
ABN , Publish Date - Dec 15 , 2025 | 02:44 AM
గత ఏడాది ఏప్రిల్ సెషన్‌లో దాదాపుగా అన్ని షిప్టుల్లో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి న్యూమరికల్స్ రావడంతో ప్రశ్నపత్రం కష్టంగా అనిపించింది. అలాగే ఎలకో్ట్ర కెమిస్ట్రీ....
గత ఏడాది ఏప్రిల్ సెషన్‌లో దాదాపుగా అన్ని షిప్టుల్లో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి న్యూమరికల్స్ రావడంతో ప్రశ్నపత్రం కష్టంగా అనిపించింది. అలాగే ఎలకో్ట్ర కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్ చాప్టర్ల నుంచి వచ్చిన ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకున్నాయి. అయితే ఈ ఏడాది జనవరి సెషన్‌లో మాత్రం ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా అంటే ప్రతి షిప్ట్‌లో దాదాపుగా 8-10 ప్రశ్నలు కనిపించాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మిగతావాటితో పోలిస్తే ఇనార్గానిక్ కెమిస్ట్రీ సిలబస్ తక్కువ. ఇందులోని చాలా పాఠాలను డిలీట్ చేశారు. ఫలితంగా కెమిస్ట్రీలో బాగా స్కోర్ చేయగలిగారు. అప్పటికీ మెకానిజమ్ ఆధారిత ప్రశ్నలు విద్యార్థులను కొద్దిగా ఇబ్బంది పెట్టాయి.
జేఈఈ మెయిన్ కెమిస్ట్రీ ప్రిపరేషన్
మంచి స్కోర్‌కు చిట్కాలు
పరీక్షలో 50 నుంచి 60 శాతం ప్రశ్నలను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే అడుగుతున్నారు. అందువల్ల ఆ పుస్తకాల్లోని ప్రతి లైన్ చదవాలి. ప్రత్యేకించి ఇనార్గానిక్ కెమిస్ట్రీని పరీక్షకు కొన్ని రోజుల ముందు నుంచి బాగా రివైజ్ చేయాలి.
ఎక్కువ వెయిటేజ్ ఉన్న కోఆర్డినేషన్ కాంపౌండ్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండ్ ప్రోపర్టీస్, క్వాడ్రేటివ్ ఇనార్గానిక్ అనలిటిక్స్, కెమికల్ బాండింగ్ చాప్టర్లపై అధికంగా దృష్టి సారించాలి.
ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ ప్రశ్నలు స్టేట్‌మెంట్ ఆధారంగా ఉండే అవకాశాలు అధికం. అందువల్ల ఆ తరహా ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
ఫిజికల్ కెమిస్ట్రీలో సాధారణంగా న్యూమరికల్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీలో కామన్‌గా ఉండే థెర్మోడైనమిక్స్, ఆటమిక్ స్ట్రక్చర్(మోడ్రన్ ఫిజిక్స్)పై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా రెండు సబ్జెక్టుల్లో ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. కఠినంగా అనిపించే స్టాయికెమిస్ట్రీ, అయానిక్ ఈక్విలిబ్రియమ్ లాంటి చాప్టర్లలో కాన్సెప్టులను బాగా రివైజ్ చేయాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములా షీట్లను రెడీ చేసుకుని రివైజ్ చేసుకోవాలి. మోడరేట్‌గా అంటే సొల్యూషన్స్, కైనెటిక్స్ లాంటి చాప్టర్లపై కూడా దృష్టిపెట్టి మంచి స్కోర్ సాధించవచ్చు.
ముందే అనుకున్నట్టు ఫిజికల్ కెమిస్ట్రీలో న్యూమరికల్స్ ఎక్కువగా ఉన్నందున టైమ్ మేనేజ్‌మెంట్ ముఖ్యం. కాలిక్యులేషన్స్‌తో ఎక్కువ సమయం వృఽథా కాకుండా చూసుకోవాలి.
ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్, రీఏజెంట్స్‌పై దృష్టి పెట్టడం ద్వారా కూడా మంచి స్కోర్‌ని సాధించవచ్చు. ఈ విభాగంలో ఎక్కువగా కాన్సెప్ట్, రియాక్షన్ ఆధారిత ప్రశ్నలు, మేట్రిక్స్ మేచింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
జనరల్‌గా
2020 నుంచి ఈ అయిదేళ్ళ ప్రశ్నపత్రాల్లో అడిగిన వాటిని తప్పనిసరిగా రివైజ్ చేయాలి.
ప్రతి వారం ఒక పార్ట్ టెస్ట్, ఒక ఫుల్ సిలబ్‌సపై టెస్ట్ రాయాలి.
మాక్ రాసిన తరవాత జరిగిన తప్పులకు సంబంధించి లోతైన విశ్లేషణ చేసుకోవాలి. కాన్సెప్ట్, సిల్లీ, కాలిక్యులేషన్ అని తప్పులను మూడు రకాలుగా విభజించుకోవాలి. ఎక్కడ, ఎలా తప్పులు దొర్లుతున్నాయో తెలుసుకుని, వాటి నుంచి బైటపడే ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి.
జవాబులుగా ఇచ్చిన ఆప్షన్స్‌ను ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. తప్పుగా అనిపించే వాటిని ఎలిమినేట్ చేయడం ద్వారా కూడా కరెక్ట్ అన్సర్‌ను పొందవచ్చు. అవగాహన లేకుండా ఏదో ఒకటి గుర్తించి మాత్రం మైనస్ మార్కులు పొందకూడదు.
చివరిగా, కెమిస్ట్రీ సులువైన సబ్జెక్టు. స్కోరింగ్ సబ్జెక్ట్. ఇందులో మంచి మార్కులను పొందే యత్నం గట్టిగా చేయాలి.
- డాక్టర్ పవన్ కుమార్ కాసు, ఎక్స్‌లెన్సియా, హైదరాబాద్.