National Institute of Design: డిజైనింగ్ @ ఎన్‌ఐడి
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:06 AM
దుస్తులు, పాదరక్షలు, వాచీ, హ్యాండ్‌బ్యాగ్ సహా ఏదైనా సరే, ఒక వస్తువుకు ఉండాల్సిన సాధారణ లక్షణాలు దెబ్బతినకుండా అందంగా, ఆధునికంగా మరింత...
దుస్తులు, పాదరక్షలు, వాచీ, హ్యాండ్‌బ్యాగ్ సహా ఏదైనా సరే, ఒక వస్తువుకు ఉండాల్సిన సాధారణ లక్షణాలు దెబ్బతినకుండా అందంగా, ఆధునికంగా మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడాన్నే డిజైనింగ్ అంటాం. ఈ అంశానికి సంబంధించి మన దేశంలో అత్యున్నత శిక్షణ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడి) అహ్మదాబాద్. దానికితోడు గాంధీనగర్‌లో పీజీ క్యాంపస్, బెంగళూరులో ఆర్ అండ్ డి క్యాంపస్ ఏర్పాటు చేశారు. తరవాతి రోజుల్లో విజయవాడ (ఆంధ్రప్రదేశ్), కురుక్షేత్ర(హర్యానా), భోపాల్(మధప్రదేశ్), జోర్హాట్(రాజస్థాన్)లలో కూడా ఎన్‌ఐడి దేనికదిగా ఏర్పాటై గ్రాడ్యుయేట్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వీటన్నింటికి కలిపి అడ్మిషన్లకు ప్రకటన విడుదలైంది.
కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడి). డిజైన్ ఎడ్యుకేషన్, సంబంధిత పరిశోధనలో గ్లోబల్ లీడర్‌గా అవతరించాలన్నది ఎన్‌ఐడి లక్ష్యం. విభిన్న డొమైన్లు ఇక్కడ ఉన్నాయి. కోర్సు పూర్తయ్యేనాటికి సంబంధిత పరిశ్రమలో ఇమిడిపోయే వ్యక్తిగా విద్యార్థిని తీర్చిదిద్దుతారు.
బీ డిజైన్ సీట్లు: అహ్మదాబాద్ క్యాంపస్‌లో 128 సీట్లు; ఆంధ్రప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, అసోం క్యాంపస్‌లలో ఒక్కోదానిలో 75 సీట్లు ఉన్నాయి.
అర్హత: అభ్యర్థులు 2005 జూలై 1న లేదా ఆ తరవాత జన్మించి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 2025-26 విద్యాసంవత్సరంలో ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
డీఏటీ వివరాలు: ప్రిలిమ్స్‌ను పేపర్ - పెన్సిల్/ పెన్ విధానంలో నిర్వహిస్తారు. టెక్ట్స్, విజువల్స్ అంశాల నుంచి ప్రశ్నలను ఆంగ్ల మాధ్యమంలో అడుగుతారు. పరీక్ష వ్యవధి వివరాలను అడ్మిట్‌కార్డ్‌లో తెలియజేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు రూ.3,000; మహిళలు రూ.2000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500, దివ్యాంగులు రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 1
డీఏటీ ప్రిలిమ్స్ తేదీ: డిసెంబర్ 21
ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్‌సైట్: admissions.nid.edu