CBSE exam: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష తేదీ మార్పు
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:09 AM
సీబీఎ్‌సఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసింది. పది, 12 తరగతుల విద్యార్థులకు మార్చి 3న జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేసింది.
పదో తరగతి పరీక్ష మార్చి 11కు..12వ తరగతి పరీక్ష ఏప్రిల్ 10కి రీషెడ్యూల్
న్యూఢిల్లీ, డిసెంబరు 30: సీబీఎ్‌సఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసింది. పది, 12 తరగతుల విద్యార్థులకు మార్చి 3న జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. పాలనాపరమైన కారణాలతో ఈ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు బోర్డు ప్రకటించింది. మార్చి 3న పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన పరీక్షను మార్చి 11కు; 12వ తరగతి విద్యార్థులకు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 10కి మార్చినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. ఇతర పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని తెలిపింది. ఫిబ్రవరి 17 నుంచి సీబీఎ్‌సఈ పది, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 3న పదో తరగతి విద్యార్థులకు టిబెటన్, జర్మన్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, భోటి, బోడో, తంగ్‌ఖుల్, జపనీస్, భుటియా, స్పానిష్, కశ్మీరీ, మిజో, బహసా మెలయు, ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ వంటి పరీక్షలు జరగాల్సి ఉండగా.. 12వ తరగతి విద్యార్థులకు లీగల్ స్టడీస్ పరీక్ష ఉంది. తాజాగా ఈ పరీక్షల తేదీ మారింది. ఆయా పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఎలాంటి గందరగోళం లేకుండా వీలైనంత త్వరగా ఈ సమాచారాన్ని తెలియజేయాలని పాఠశాలలను బోర్డు కోరింది. రీషెడ్యూల్ చేసిన తేదీలను గమనించి, అందుకు అనుగుణంగా పరీక్షకు సిద్ధమవ్వాలని సూచించింది.