Zohran Mamdani: న్యూయార్క్‌లో కొత్త పొద్దుపొడుపు
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:39 AM
ఆ అబ్బాయి గురించి నేను ఆందోళన పడుతున్నాను అని ఇటీవల భారతీయ అమెరికన్‌ల సమావేశంలో ఒక మాతృమూర్తి కంపిత స్వరంతో అన్నారు.
‘ఆ అబ్బాయి గురించి నేను ఆందోళన పడుతున్నాను’ అని ఇటీవల భారతీయ అమెరికన్‌ల సమావేశంలో ఒక మాతృమూర్తి కంపిత స్వరంతో అన్నారు. ‘అతడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మతిస్థిమితం లేని అనేక మంది తుపాకులతో తెగబడుతున్నారు..’ అని కూడా ఆమె అన్నారు. ఆ మాతృమూర్తి ప్రస్తావించిన ‘అబ్బాయి’ ప్రభవిస్తున్న జనాకర్షక యువనేత జోహ్రాన్ ఖ్వామె మమ్దానీ. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీలలో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన దార్శనిక నాయకుడు. అవును, మమ్దానీ గెలుపు విస్మయపరచడమేకాదు, దిగ్భ్రాంతిపరిచింది కూడా. అనూహ్య విజేత మమ్దానీ. ఆయన ప్రత్యర్థులు ప్రభావశీలురు కాకపోవచ్చు కానీ సొంత పార్టీలోనే చాలా మంది విమర్శకులు ఉన్నారు. మమ్దానీ సైద్ధాంతిక విశ్వాసాలను వారు ప్రశ్నిస్తున్న దృష్ట్యా అంతిమ ఎన్నికలో ఆయన విజయం నల్లేరుపై నడక కాదు, కాబోదు. మేయర్ పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలుచుకున్న రోజు, మేయర్ ఎన్నిక జరగనున్న నవంబర్ 4, 2025 మధ్య ఏమైనా సంభవించవచ్చు.
అయితే మమ్దానీ యోధుడు. ఆయన సైద్ధాంతిక చిత్తశుద్ధి శక్తిమంతమైన ప్రభావాన్ని నెరపుతోంది. ఆ ప్రభావానికి చాలా మంది ఇప్పటికే లోనయ్యారు. ఇదే ఆయన్ను తన లక్ష్య సాధనలో ముందుకు సాగేందుకు ప్రేరేపిస్తూనే ఉంటుంది. పార్టీ పరాజయాలు, ప్రజల విముఖతతో నిరుత్సాహంలో మునిగిపోయిన యువ డెమొక్రాట్స్‌ను, ప్రగతిశీలవాదులను ఆయన ఉత్తేజపరచడం కొనసాగుతూనే ఉంటుంది. అధ్యక్ష ఎన్నికలలో కమలాహారిస్ ఓడిపోయిన తరువాత డెమొక్రాటిక్ పార్టీ శ్రేణులు తడబడుతున్నాయి. ఆ దయనీయ స్థితి నుంచి వారిని బయటపడవేసేందుకు మమ్దానీ సకల విధాలా ప్రయత్నిస్తున్నారు. మేయర్ పదవికి పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలుచుకోవడం అందులో భాగమే. పార్టీ తనపై పెట్టిన బాధ్యతను అంగీకరిస్తూ నెల్సన్ మండేలా స్ఫూర్తిదాయక మాటలను మమ్దానీ ఉటంకించారు: ‘ఏదైనా సాధించేంతవరకు అది అసాధ్యంగానే కనిపిస్తుంది’.
జోహ్రాన్ మమ్దానీ సరైన సమయంలో ప్రభవించారు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, న్యూయార్క్ మేయర్ పదవీ ఎన్నిక ఫలితం భావి ఎన్నికల సంభావ్య జయాపజయాలకు ఒక సూచిక అవుతుంది. న్యూయార్క్ నగరం మిగతా అమెరికా కంటే భిన్నమైనది కావచ్చుకాని తమ కొత్త మేయర్‌పై ఈ మహానగర ప్రజల నిర్ణయం భావి ఎన్నికల ఫలితాలకు ఒక సంకేతం అవుతుంది, సందేహం లేదు. జూలై 4, 2026న అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నది. వచ్చే ఏడాదే భారతీయ అమెరికన్లు తమకు విశేషంగా మేలు చేసిన ఒక ప్రముఖ చారిత్రక సంఘటన 80వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం ముగింపు (1945), భారత స్వాతంత్ర్య విజయం (1947) మధ్య సంవత్సరం (1946) లో అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ లూస్–సెల్లర్ చట్టం (దీనినే ఫిలిప్పీన్స్, ఇండియా ఇమ్మిగ్రేషన్ చట్టం అని కూడా అంటారు)పై సంతకం చేశారు. అమెరికాలోని ఫిలిప్పీనీయులు, భారతీయులకు పౌరసత్వ హక్కులు ప్రసాదించడంతో పాటు ఆ రెండు దేశాల నుంచి అమెరికాకు ఏడాదికి 100 మంది చొప్పున వలస రావడానికి ఈ చట్టం అనుమతించింది. అలా వలసవచ్చినవారు సహజసిద్ధంగా అమెరికా పౌరులుగా మారే హక్కును కూడా ఆ చట్టం కల్పించింది. ఈ చట్టానికి ఆమోదాన్ని పొందడంలో వలసదారు క్రియాశీలురు కీలకపాత్ర నిర్వహించారు. ద్వితీయ యుద్ధ ప్రపంచంలో మిత్ర రాజ్యాల విజయానికి ఫిలిప్పీన్స్, భారత్ ప్రజల నుంచి లభించిన సహాయసహకారాలకు గాను ప్రత్యుపకారంగా అమెరికా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆసియా జనాభాపై వివక్ష చూపుతున్న వలస విధానాలకు స్వస్తి చెప్పేందుకు ఈ చట్టం విశేషంగా దోహదం చేసింది.
న్యూయార్క్ నగర సమస్యల పరిష్కారానికి మమ్దానీ అనుసరించే ‘డెమొక్రాటిక్ సోషలిస్ట్’ దృక్పథం ఆచరణీయత, సార్థకతపై మద్దతుదారుల అనుమానాలు ఎలా ఉన్నప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం. జోహ్రాన్ మమ్దానీ నిర్భయస్తుడు. ఆయన ఎట్టి పరిస్థితులలోను వలసదారుల హక్కుల పరిరక్షణకు సుస్థిరంగా నిలబడతారు. ట్రంప్ పాలన రెండో హయాంతో వలసదారుల హక్కుల పరిరక్షణకు నిబద్ధమవడమనేది కచ్చితంగా ఎన్నికల ప్రచారంలో ఒక ప్రధాన ఆకర్షణ అవుతుంది. న్యూయార్క్ వాసులలో 60 శాతం మంది వలసదారులు లేదా వారి బిడ్డలే అని 2024లో మేయర్ నివేదిక ఒకటి పేర్కొనడం గమనార్హం. ఈ వాస్తవం దృష్ట్యా వలసదారుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చిన మమ్దానీ ఎన్నికల ప్రచారం ఓటర్ల హృదయాలను గెలుచుకోవడంలో ఆశ్చర్యమేముంది?
గత తరాలలో వలసదారుల తరపున పోరాడిన వారికి మమ్దానీ సమున్నత వారసుడు. లూస్–సెల్లర్ చట్టం అమలులోకి రావడంలో అనుపమేయ కృషి చేసిన వ్యక్తి జేజే సింగ్. న్యూయార్కర్ మ్యాగజైన్ ఈయన్ని ‘వన్ మ్యాన్ లాబీ’ (ఒక నిర్దిష్ట సమస్య పరిష్కారానికి ఎవరూ కలిసిరాకున్నా పూర్తిగా సొంత ప్రయత్నాలు, పలుకుబడి ద్వారా కృషి చేసిన వ్యక్తి)గా అభివర్ణించింది. వ్యాపారవేత్త అయిన జేజే సింగ్ 1946లో లూస్–సెల్లర్ బిల్లుపై సంతకం చేసినప్పుడు ఓవల్ ఆఫీసులో ఉన్న ఇద్దరు భారతీయులలో ఒకరు (మరొకరు ఎమ్‌ఓఏ బైగ్ ఆ తరువాత పాకిస్థాన్ ఎంబసీలో చేరారు). ఆ కాలంలో వలసవాదుల హక్కుల పరిరక్షణకు కృషి చేసినవారిలో తారక్‌నాథ్ దాస్, ముబారక్ అలీ ముఖ్యులు. ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన మరో ప్రముఖుడు దిలీప్‌సింగ్ సాంధ్ (1899–1973). కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన సాంధ్, కాంగ్రెస్ దిగువ సభ ప్రతినిధుల సభకు ఎన్నికైన ప్రప్రథమ ఆసియన్ అమెరికన్. 1957 నుంచి వరుసగా రెండుసార్లు ఆయన కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రతినిధుల సభలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. సాంధ్ మాదిరిగా అందరూ డెమొక్రాట్లే. వర్తమాన అమెరికా సమాజం సాంధ్ కాలం నాటి దానికి చాలా సుదూరమైనదీ, భిన్నమైనదీ అయినప్పటికీ మమ్దానీ లాంటి శ్వేతజాతీయేతర మైనారిటీ అభ్యర్థులకు పూర్తిగా ఈ నాటివైన సమస్యలు, సవాళ్లను విసురుతున్నది. అమెరికాలో నిరంకుశాధికార తత్వం ప్రబలిపోతోన్న పరిస్థితుల్లో కరడుగట్టిన మితవాద రాజకీయ పక్షంగా పరిణమించిన అమెరికా పురాతన రాజకీయ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ మమ్దానీ లాంటి మైనారిటీ, శ్వేతజాతీయేతర అభ్యర్థులు డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారయితే మరింతగా తీవ్ర విమర్శలకు పాల్పడుతోంది. వారి పట్ల నిస్సిగ్గుగా దుర్నీతితో వ్యవహరిస్తోంది.
‘మమ్దానీ అక్రమ వలసదారు అని అనేక మంది చెబుతున్నారు’ అని అంటూ ఆ యువనేత అమెరికా పౌరసత్వ చట్టబద్ధతను ట్రంప్ ప్రశ్నించారు. మమ్దానీ సహజీకరణ (అమెరికా పౌరుడు కాని వ్యక్తి చట్టబద్ధమైన మార్గాల ద్వారా అమెరికా పౌరుడు అయ్యే ప్రక్రియ) ద్వారా అమెరికా పౌరసత్వాన్ని పొందారు. బరాక్ ఒబామా, కమలా హారిస్‌లు అధ్యక్ష పదవికి పోటీపడిన తరుణంలో కూడా వారిపై ట్రంప్ ఇటువంటి తప్పుడు విమర్శలే చేశారు. ఈ మొరటు దాడులు అనూహ్యమైనవి ఏమీకావు. మేయర్ పదవికి పోటీలో మమ్దానీ ఎదుర్కొంటున్న, ఓటర్ల విదేశీ ద్వేష ధోరణులను ముమ్మరం చేస్తాయి. సాంధ్ ఎదుర్కొన్న వివక్షలు, అవరోధాలు తీవ్రమైనవి. అయితే ఆయన ఎన్నడూ ‘చంపివేస్తామనే’ బెదిరింపులకు గురికాలేదు. తుపాకీ హింసాకాండకు బాధితుడు కాలేదు. ఇప్పుడు అమెరికన్ పౌరులు మొత్తం 500 మిలియన్ (50 కోట్లు) మారణాయుధాలకు యజమానులుగా ఉన్నారు. ఇదే 1950ల్లో ఈ ప్రైవేట్ ఆయుధాల సంఖ్య కేవలం 54 మిలియన్ (5 కోట్ల 40 లక్షలు) మాత్రమేనని ఒక అంచనా. సాంధ్ కాలంలో బ్రౌన్ మైనారిటీ (శ్వేతజాతీయేతరులు కాని అమెరికా పౌరులు. ఆఫ్రికన్– అమెరికన్లను ఈ మైనారిటీ వర్గంలోని వారుగా పరిగణించరు. దక్షిణాసియా, పశ్చిమాసియా, తూర్పు ఆసియా, లాటిన్ అమెరికా దేశాల నుంచి వలస వెళ్లిన వారిని మాత్రమే బ్రౌన్ మైనారిటీగా పరిగణిస్తారు) ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. శ్వేతజాతీయులు అభద్రతా భావానికి లోనుకావలసిన పరిస్థితులు ఏ మాత్రం లేవు. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. వలసదారులకు కాకుండా స్థానిక ప్రజలకే అగ్రప్రాధాన్యమివ్వాలనే ధోరణులు, ప్రబలుతోన్న నిరంకుశాధికారతత్వం, రాజకీయ వదరుబోతుతనం దశాబ్దాలుగా ఉన్న పరిస్థితులను పూర్తిగా తలకిందులు చేశాయి.
ఇదొక నిరాశామయ కాలం. ‘అమెరికన్ స్వప్నం’ (స్వయం కృషితో మెరుగైన, సమున్నత, సంపూర్ణ జీవితాన్ని సాధించుకోవచ్చనే దృఢవిశ్వాసం, ఇందుకు అవకాశాలు లభిస్తాయనే నమ్మకం) ‘అమెరికన్ దుస్స్వప్నం’ (అమెరికా సమాజంలో అందరికీ సమ అవకాశాలు లభిస్తాయనే విషయమై భ్రమలు తొలగిపోవడం, వ్యక్తిగత శ్రేయస్సును అసాధ్యం చేస్తున్న సామాజిక సమస్యలు ప్రబలిపోవడం)గా మారిపోతోందని పలువురు అంటున్నారు. అయితే మమ్దానీ వెనకడుగు వేయలేదు. తన వైయక్తిక విశ్వాసాలకు ఆయన కట్టుబడి ఉన్నారు. ‘ట్రంప్ ప్రకటనలు మన ప్రజాస్వామ్యంపై దాడులు మాత్రమే కాదు, మీ అభిప్రాయాలు ఏమైనప్పటికీ వాటిని గోప్యంగా ఉంచుకోవాలని, వాటిని బహిరంగంగా వ్యక్తం చేస్తే ‘వారు’ మీ వద్దకు వస్తారనే సందేశాన్ని ప్రతి న్యూయార్క్ ఓటరుకు పంపే ప్రయత్నమని’ మమ్దానీ అన్నారు. ట్రంప్ మాటల దాడికి దీటుగా ప్రతిస్పందిస్తూ ‘ఇటువంటి బెదిరింపులను మనం ఎట్టి పరిస్థితులలోను అంగీకరించకూడదు. వాటికి భయపడకూడదు’ అని మమ్దానీ దృఢంగా అన్నారు.
-మురళి కమ్మ అట్లాంటాలోని ‘ఖబర్’
మాసపత్రిక ఎడిటర్ (క్వింట్ సౌజన్యం)