Yusuf Meherally: మూర్తీభవించిన మానవతే మెహెరలీ
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:10 AM
ప్రపంచ నగరంగా పరిగణన పొందేందుకు ఒక నగరానికి ఉండవలసిన ప్రమాణాలు ఏమిటి అవేమిటో నిర్ణయిస్తూ 2006లో నేను ఇప్పుడు ఆగిపోయిన)
‘ప్రపంచ నగరం’గా పరిగణన పొందేందుకు ఒక నగరానికి ఉండవలసిన ప్రమాణాలు ఏమిటి? అవేమిటో నిర్ణయిస్తూ 2006లో నేను (ఇప్పుడు ఆగిపోయిన) ఒక పత్రికలో వ్యాసం రాశాను. ‘ప్రపంచ నగరం’ అనే ప్రతిపత్తిని కల్పించే అర్హతలు: నగరం చాలా పెద్దదిగా ఉండాలి; దానికి చారిత్రక గంభీరత ఉండాలి; నిత్యం అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక జీవనం ఉండాలి; భాష, మత, సామాజిక వైవిధ్యం అపారంగా ఉండాలి; జాతి పురోగతికి దోహదం చేసే ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా ఉండాలి. ఈ ప్రమాణాల ఆధారంగా చూస్తే ప్రపంచంలో మూడే మూడు ప్రపంచ నగరాలు ఉన్నాయి. అవి: లండన్, న్యూయార్క్, ముంబై. న్యూయార్క్ మేయర్ పదవికి పోటీపడుతున్న జోహ్రాన్ మమ్దానీ గురించి చదివినప్పుడు నాకు నా పాత వ్యాసం గుర్తుకు వచ్చింది. క్రైస్తవులు అత్యధికంగా ఉన్న లండన్ ఇప్పటికే ఒక ముస్లిం మేయర్‌ను ఎన్నుకున్నది. క్రైస్తవులు, యూదులతో పాటు నాస్తికులు గణనీయంగా ఉన్న న్యూయార్క్ సైతం త్వరలో ఒక అన్యమతస్థుడిని మేయర్‌గా ఎన్నుకోనున్నదా? ఈ ప్రశ్న గురించి తర్కిస్తూ ఉంటే మన మూడో ప్రపంచ నగరం ముంబై దశాబ్దాల క్రితమే ఆరుగురు ముస్లిం మేయర్లను ఎన్నుకున్నదన్న విషయం గుర్తుకు వచ్చింది. ఈ ఆరుగురిలో మొదటివారు 1934లోను, చివరివారు 1963లోను ఎన్నికయ్యారు.
ముంబై మేయర్లుగా ఎన్నికైన ఆ ఆరుగురిలో ఒకరిని జ్ఞాపకం చేసుకోవడమే ఈ కాలమ్ లక్ష్యం. ఆ వ్యక్తి ఆ పదవిలో స్వల్పకాలం మాత్రమే ఉన్నారు. అదే ఆయన ఏకైక ప్రత్యేకత గానీ, ప్రధాన విశిష్టత గానీ ఎంతమాత్రం కాదు. ఆయన పేరు యూసఫ్ మెహెరలీ. 75 సంవత్సరాల క్రితం ఇదే నెలలో ఆయన కీర్తిశేషుడు కావడం కూడా ఈ కాలమ్‌కు ప్రేరణ అయిన కారణాలలో ఒకటి. బాంబేలో 1903లో జన్మించిన మెహెరలీ ఆ నగరంలోనే పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం చేశారు. విద్యార్థి దశలోనే మంచి వక్తగా పేరు పొందారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందినప్పటికీ రాజకీయ భావాలు, అభిప్రాయాల కారణంగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు అవసరమైన లైసెన్స్‌ను ఆయనకు నిరాకరించారు. విద్యాభ్యాసం ముగిసిన తరువాత స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928లో అందరూ శ్వేతజాతీయులే ఉన్న సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించారు. రెండేళ్ల తరువాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1934లో జాతీయ కాంగ్రెస్‌లో భాగంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు సామ్యవాద ఆలోచనా స్పష్టత, పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి ప్రభావశీలంగా తీసుకువెళ్లగల నాయకుడుగా మెహెరలీ పేరు పొందారు. కార్మిక హక్కులను కాపాడే విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. అలాగే ఆసియా, ఆఫ్రికా దేశాలలో ప్రబలమవుతున్న వలసపాలన వ్యతిరేక ఉద్యమాలలో కూడా విశేష శ్రద్ధ చూపారు. 1930వ దశకంలో మెహెరలీ అవిరామంగా ఆసేతు హిమాచలం పర్యటిస్తూ సమాజంలోని అట్టడుగు వర్గాల వారిలో కూడా సోషలిస్టు సిద్ధాంతాలను ప్రభావదాయకంగా ప్రచారం చేశారు. అదే కాలంలో ఆయన ఐరోపా, అమెరికాలలో విస్తృతంగా పర్యటించి ఆయా దేశాలలోని డెమొక్రాటిక్ సోషలిస్టు పార్టీలు, నాయకులతో విస్తృత సంబంధాలు నెలకొల్పుకున్నారు.
ఏప్రిల్ 1942లో బాంబే మేయర్‌గా యూసఫ్ మెహెరలీ ఎన్నికయ్యారు. అదే ఏడాది ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీ ప్రారంభించారు. బాంబేలో జరగనున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు గాంధీ రైలులో నగరానికి వచ్చినప్పుడు ఆయనకు మేయర్‌గా మెహెరలీ స్వాగతం పలికారు. ఆ ఏఐసీసీ సమావేశంలోనే చరిత్రాత్మక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు. క్విట్ ఇండియా నినాదాన్ని సృష్టించింది మెహెరలీయేనన్న ఐతిహ్యం ఒకటి ఉన్నది. అయితే ఇది ఆయనకు తప్పుగా ఆపాదించింది కావచ్చేమో?! ఒకటి మాత్రం స్పష్టం: 1928లో ‘గో బ్యాక్ సైమన్’ అన్న నినాదాన్ని ఇచ్చింది మెహెరలీయే. ఆ స్ఫూర్తిదాయక నినాదం ఆనాడేకాదు ఇప్పుడు కూడా భారతీయుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. క్విట్ ఇండియా నినాదాన్ని ఇచ్చింది మెహెరలీయేనని మధు దండావతే తాను రాసిన ‘మెహెరలీ జీవిత చరిత్ర’లో ప్రస్తావించలేదు. మహాత్మాగాంధీ ఆశీస్సులతో 1942 ఆగస్టు విప్లవం సందర్భంగా మెహెరలీ ఆధ్వర్యంలోని పద్మా పబ్లికేషన్స్ అనే సంస్థ ‘క్విట్ ఇండియా’ అనే శీర్షికతో ఒక చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చిందని మాత్రమే మధు దండావతే పేర్కొన్నారు. యూసఫ్ మెహెరలీ గురించి నేను తొలుత 1980ల తొలినాళ్లలో ఒక స్నేహితుడి ద్వారా విన్నాను. కొన్ని సంవత్సరాల అనంతరం న్యూయార్క్ లోని ఒక బుక్ షాప్‌లో అమెరికన్ జర్నలిస్ట్, చరిత్రకారుడు బెర్ట్రామ్ డి. ఉల్ఫె వ్యాస సంపుటి ‘Strange Communists I Have Known’ కొన్నాను. ఆ పుస్తకంలో మెహెరలీపై ఒక వ్యాసం ఉన్నది. ఆ వ్యాస శీర్షిక ‘గాంధీ వెర్సెస్ లెనిన్’. చమత్కారంగా ఉన్న ఆ శీర్షిక వెన్వెంటనే చదివేలా ఆసక్తి రేకెత్తించింది.
మెహెరలీ 1930ల నడిమి సంవత్సరాలలో మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు ఆయనకు ఉల్ఫె పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా వర్ధిల్లింది. మెహెరలీతో పరిచయం లేనప్పుడు ఉల్ఫెకు తెలిసిన వామపక్షవాదులు అమెరికన్ కమ్యూనిస్టులు మాత్రమే. సోవియట్ నియంతలు లెనిన్, స్టాలిన్‌లకు వారు విధేయులు. ఒక మంచి లక్ష్యాన్ని సాధించేందుకు ఎటువంటి అనైతిక మార్గాలనైనా అనుసరించవచ్చని విశ్వసించేవారు. మెహెరలీ సోషలిస్టు విశ్వాసాలలోని దయా స్వభావం, మానవతా దృష్టి ఉల్ఫెను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘గాంధీ ప్రభావం వల్లే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కమ్యూనిస్టుల అనైతిక పద్ధతులకు మెహెరలీ దూరంగా ఉండగలిగార’ని ఉల్ఫె అర్థం చేసుకున్నాడు.
మెహెరలీ గురించి ఆనందప్రదమైన కథనొకదాన్ని ఉల్ఫె చెప్పారు. ఆయన తన భారతీయ మిత్రుడిని కేప్‌కాడ్‌కు తీసుకువెళ్లారు. అట్లాంటిక్ మహాసముద్ర జలాలు మసాచుసెట్స్ బే జలాలు సంగమించే ప్రదేశమది. మెహెరలీ కారు దిగి చెప్పులు విడిచి ఆ సంగమ స్థలి జలాల్లోకి నడుచుకు వెళ్లారు. ఆ సంగమ జలాల్లో కొంత సేపు ధ్యానమగ్నుడై ఉండి తిరిగి వెనక్కి వచ్చారు. ‘అప్పుడు ఆయన మోములో అనిర్వచనీయమైన ఆనందానుభూతిని గమనించాను. మెహెరలీ అంత సంతోషంగా ఉండడం నేను అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు’ అని ఉల్ఫె గుర్తు చేసుకున్నారు. ‘నదుల సంగమమైనా, సాగరాల కూడలి అయినా, కాలవల కలయిక అయినా... జలాల సంగమ ప్రదేశాన్ని మహాపవిత్రమైన స్థలంగా మా భారతీయులు విశ్వసిస్తారు’ మెహెరలీ తన అమెరికన్ స్నేహితుడికి వివరించారు.
మెహెరలీ మొదటిసారి అమెరికాను సందర్శించినప్పుడు బ్రిటిష్ వలసపాలన దుర్మార్గాల పట్ల ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడాన్ని ఉల్ఫె గమనించారు. అయితే 1946లో రెండవసారి అమెరికాను సందర్శించిన సమయంలో బ్రిటిష్ పాలకుల గురించి ప్రేమాస్పదంగా మాట్లాడడం ఉల్ఫెను విస్మయపరిచింది. మెహెరలీ తన మిత్రుడికి ఇలా చెప్పారు: ‘భారతీయ నాగరికత, సంస్కృతికి బ్రిటిష్ వారు చాలా మేలుచేశారు. మరీ ముఖ్యంగా బ్రిటిష్ సంప్రదాయంలో స్వతస్సిద్ధంగా ఉన్న వైయక్తిక, పౌర హక్కులు భారతీయులకు లభించేందుకు దోహదం చేశారు’. ఉల్ఫె దిగ్భ్రాంతి చెందాడు. ‘మిమ్ములను సుదీర్ఘకాలం జైళ్లలో బంధించిన బ్రిటిష్ వారి ‘న్యాయ వివేకం’ను ఎలా మెచ్చుకుంటున్నారని ప్రశ్నించగా మెహెరలీ మృదువుగా ఇలా సమాధానమిచ్చారు: ‘వారు మమ్ములను అణచివేసినప్పటికీ ఆ విషయంలో వారు పూర్తిగా సంతోషదాయకంగా లేరు. ఇబ్బందిపడ్డారు. బ్రిటిష్ జైలులో నేను నిరాహార దీక్ష చేస్తే చదువుకోవడానికి మీ పుస్తకంగానీ, మరేదైనా పుస్తకం గానీ తప్పక అందుబాటులోకి వస్తుంది. అదే హిట్లర్ లేదా స్టాలిన్ జైళ్లలో అయితే నేను నిస్సందేహంగా ఫైరింగ్ స్క్వాడ్ ఎదుట నిలబడవలసివచ్చేది. గాంధీ కనుక సోవియట్ జైలులో ఖైదీగా ఉన్నట్లయితే తన మొదటి నిరసనకే ఆయన గల్లంతయిపోయేవారు. ఇంగ్లీష్ వారయితే ఆయన ధిక్కారం గురించి తమ పై అధికారులకు తప్పక తెలియజేసేవారు. ఎంతగా పరిహసిస్తున్నప్పటికీ మా మహాత్ముడిని తప్పక గౌరవించేవారు. అందుకే ఇంగ్లీష్‌వారు పాల్పడుతున్న దుష్ట పనులను వ్యతిరేకించండి, ఎట్టి పరిస్థితులలోను ఇంగ్లీష్ వారిని అసహ్యించుకోవద్దు అని గాంధీజీ మాకు బోధించారు. ఆయన మాటకు మేము కట్టుబడి ఉన్నాము’.
పరిపూర్ణ నిస్వార్థుడు కాబట్టే సదా ఇతరుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ మెహెరలీ తన సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ కారణంగానే ఆయన అకాల మరణానికి గురయ్యారు. చివరి రోజుల్లో ముంబైలోని ఒక సుప్రసిద్ధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెహెరలీ జయప్రకాశ్ నారాయణ్‌కు ఇలా చెప్పారు: ‘ఆసుపత్రిలో చనిపోవడం ద్వారా నాకు చికిత్స చేసిన డాక్టర్ల మంచి పేరుకు కళంకం తీసుకురావడం నాకు ఇష్టం లేదు. నన్ను ఇంటికి తీసుకువెళ్లండి. నా గృహంలోనే నేను చనిపోదలుచుకున్నాను’. ఇలా అంతిమ క్షణాలలో కూడా మెహెరలీ ఇతరుల బాగోగుల గురించే ఆలోచించారని దండావతే వ్యాఖ్యానించారు. ముస్లింగా పుట్టిన వ్యక్తిని మేయర్‌గా ఎన్నుకోవడమనేది ఒకానొకప్పుడు ముంబైకు ఒక మామూలు విషయంగా ఉండేది. అదే ఆ మహానగర విశిష్ట లక్షణంగా కూడా ఉండేది. లండన్, న్యూయార్క్ నగరాలు ఇటీవలి దశాబ్దాలలో సామాజిక, మత పరమైన వైవిధ్యాన్ని స్వాగతించేవిగా పరిణమించగా ముంబై సంకుచిత దురభిమానాలకు, దురహంకారాలకు ప్రాధాన్యమిస్తున్న నగరంగా మారిపోయింది. ఎంత విషాదం! తన నగర ఘనతను, దేశ ప్రతిష్ఠను నిజంగా సమున్నతం చేసిన యూసఫ్ మెహెరలీ వంటి ఒక మేయర్‌ను ముంబై ఎప్పటికైనా మళ్లీ ఎన్నుకుంటుందా?
-రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)