Share News

Chandrababu Naidu Return: ఆంధ్రుల మనోరథం నెరవేరేనా

ABN , Publish Date - May 28 , 2025 | 06:14 AM

1977 దివిసీమ ఉప్పెన విధ్వంసానికి సరితూగేలా, 2019–2024 మధ్య కాలంలో వైసీపీ పాలన తెలుగు ప్రజలపై ఆర్థిక, సామాజిక, రాజకీయ అరాచకాలను మోపిందని ప్రజలు భావించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చైతన్యంతో స్పందించి, చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు.

Chandrababu Naidu Return: ఆంధ్రుల మనోరథం నెరవేరేనా

రాత్రి (1977, నవంబర్ 18) దివిసీమ జనం పాలిట కాళరాత్రిగా చరిత్రలో మిగిలిపోయింది. బంగాళాఖాతంలో తలెత్తిన ఉప్పెన సమీప గ్రామాలపై విరుచుకుపడింది. గ్రామాలకు గ్రామాలను ముంచెత్తింది. నిద్రపోతున్నవారు ఎటో కొట్టుకుపోయారు; మెలుకువ వచ్చినవారు ఆ ప్రవాహంలో చెట్ల కొమ్మలకు తగులుకుని, వాటినే పట్టుకుని వేలాడుతూ ఆ కాళరాత్రి గడిపారు. వరి కుప్పలు కొట్టుకుపోయాయి. వేలాదిగా పశువులు చనిపోయాయి. మనుషుల్ని, కోట్లాది విలువైన ఆస్తుల్ని, పొలాల్లో పంట కుప్పల్ని ఒకే ఒక రాత్రిలో ఉప్పెన ఊడ్చేసింది. పచ్చని పంట పొలాలు మేట వేసుకుపోయాయి. తెల్లవారాక చూస్తే, బంగాళాఖాతం ఎంతో అమాయకంగా, ప్రశాంతంగా... ‘జగన్ చిరునవ్వు’లా కనిపించింది. కానీ, ఒక్క రాత్రిలో అది సృష్టించిన విధ్వంసం నుంచి దివిసీమను చక్కదిద్దడానికి మండలి వేంకటకృష్ణారావు వంటి నిస్వార్థ నేతలకు సైతం ఒక దశాబ్దానికి పైగా పట్టింది. వైసీపీ అసురగణం ‘‘మేమేంటో చూద్దురు గానీ... ఒక్క ఛాన్స్‌... ప్లీజ్’’ అంటూ అభ్యర్థించారు. జనం కూడా అమాయకంగా నమ్మేశారు. ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చారు. 2019లో తెలుగు రాష్ట్రంపై పడిన వైసీపీ అసురల పాలన 1977 నాటి దివిసీమ ఉప్పెన విధ్వంసాన్ని గుర్తు చేసింది. నింగి, నేల, నీరు అనే దానితో పెద్ద పట్టింపు లేకుండా, దోచుకోవడానికే తాము ఈ మానవ జన్మ ఎత్తాం అన్నట్టుగా చెలరేగిపోయారు. నడమంత్రపు సిరులతో కళ్లు పూర్తిగా పూడిపోయినట్టుగా విశృంఖలంగా వ్యవహరించారు. ‘తా చెడ్డ కోతి, వనమెల్లా చెరిచింది’ అనేది ఓ తెలుగు సామెత. ఒక రాజకీయ పార్టీ ముసుగు కప్పుకున్న పలురకాల సంఘ వ్యతిరేక శక్తులు, తమకు అవసరమైన అధికార, న్యాయ, కేంద్ర సర్వీస్ వ్యవస్థలను కూడా తమ బాటలోకి తెచ్చుకుని, సుభిక్షమైన ప్రజాస్వామిక రాష్ట్రాన్ని ఒక ఆటవిక రాజ్యంగా మార్చివేశారు. హిందూ దేవుళ్లను సైతం చెరబట్టేశారు. పోలీస్ స్టేషన్లలో కొందరు ఖాకీయులు యమకింకరుల అవతారం ఎత్తారు. ఫిర్యాదులు చేయడానికి వెళ్లిన బాధితులపైనే కేసులు బనాయించారు. ప్రశ్నిస్తే చితక బాదారు. వైసీపీ వారే కొన్ని చోట్ల పోలీసు అధికారుల లాగా వ్యవహరించి, ఎవరిని ఎలా హాండిల్ చేయాలో అధికారులకు డిక్టేట్ చేశారు. కాకినాడలో అనంత బాబు అనే ఎమ్మెల్సీ చేసిన అరాచకమే రాష్ట్రంలో సగటు వైసీపీ అసురుని బరితెగింపు వ్యవహార శైలికి, సగటు పోలీసుల అమానుష ప్రవర్తనకు తిరుగులేని ఉదాహరణలు. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిపాటి హెచ్చు తగ్గులు, తేడాలతో ఎందరో అనంతబాబులు, ఎందరో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్లు ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులు, వరస కుదిరితే ప్రైవేట్ ఆస్తులు, ఇసుక మింగేశారు. ప్రజల మద్యం బలహీనతను అడ్డం పెట్టుకుని వేలాది కోట్లు దండుకున్నారు. భూగర్భ ఖనిజ సంపదను స్వాహా చేశారు. ఇదేంటి స్వామీ అని ఎవరైనా నసిగితే, అర్ధరాత్రుళ్ళు కొంపల మీద పడి, గోడలు దూకి, తలుపులు పగలకొట్టి, జనాన్ని ఎత్తుకుపోవడం వంటి పోలీసు అరాచకాలు చూస్తూ జనం భయవిహ్వలతకు లోనయ్యారు. దీంతో పాటు తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై నిత్యం మాటల కాలుష్యం, పలికెల కొద్దీ దుమ్మెత్తి పోయడానికి పేటీఎం భజన గొట్టాలు, కరపత్రాలు, దొంగ సమీక్షకుల ఊదర. ఎంత పేటీఎం పేమెంట్‌కు అంత ఊదర అన్నట్టుగా జనం మీదకు (యాంటీ సోషల్ మీడియా) వీడియోలు వదలడం నిత్యకృత్యమై పోయింది. ఇందుకో ఉదాహరణ చూద్దాం.


విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఓపెన్ టాప్ వాహనంలో వెడుతుంటే ఎవరో ఆకతాయి గులకరాయి లాంటిది విసిరినట్టు పత్రికల్లో వచ్చింది. జగన్ చుట్టూ ఉండే సెక్యూరిటీని తప్పించుకుని, అది జగన్‌కు తగిలి, అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ అనే ఎమ్మెల్యేకి కూడా తగిలింది (ఏ వస్తువైనా ఎవరైనా విసిరితే, అది ఒకరి తరువాత ఒకరికి ఒకేచోట తగలడం ఇదే మొదటిసారి). పైగా జగన్‌కు ఎక్కడ తగిలిందో, వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా సరిగ్గా అక్కడే తగిలిందని... వారిద్దరూ నుదిటికి ఎడమవైపు వేసుకున్న జాన్సన్ బ్యాండేజ్ స్ట్రిప్‌ను బట్టి అర్థం చేసుకోవాలి. హైదరాబాద్‌లోని ఒక పేటీఎం విశ్లేషకుడు ‘జగన్‌పై జరిగిన దాడి మీద చంద్రబాబు వైఖరి ఏమిటి?’ అని అంటూ ఒక వీడియో వదిలారు. జగన్ ఒక్కరే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాలేదు. అంతకు ముందు 1953 నుంచి సీఎంలుగా పలువురు తెలుగు రాష్ట్రాన్ని పాలించారు. వారి పాలనా రీతులను, జగన్మోహన్‌రెడ్డి నడమంత్రపు పాలన కంటే ముందే తెలుగు ప్రజలు చవి చూశారు. కానీ, ఇంత దోపిడీ, విద్వేషం, రాజకీయ కాలుష్యం, విచ్చలవిడితనం, అధికారం పతనం, పోలీసు కర్కశత్వం... తెలుగు ప్రజలు గత డెబ్భై ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. అందుకే, తెలుగు ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం వేయికళ్లతో ఎదురు చూశారు. తమ మనసులో ఏముందో మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఎంతమంది వాలంటీర్లను నిఘా పెట్టినా, ఎన్ని రకాల సర్వేలు చేయించినా, వైసీపీ నేతలకు ఓటర్ నాడి అందలేదు. ‘వై నాట్ 175?’ అనే మూడ్‌లో మునిగితేలారు. విశేషమేమంటే ఓటరూ అదే అనుకున్నాడు, ఈసారి ‘కూటమికి వై నాట్ 175!?’ అని. ‘ఓటు’ అనే వేటకొడవలి తీసుకుని, వైసీపీ అనే ఓ అరాచకాన్ని కసితీరా 164 పోట్లు పొడిచాడు. దాంతో, ఓ ఐదేళ్ల వరకు వారిని ఆవహించిన భయం తొలగిపోయింది. మళ్లీ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. ‘పోలీస్ పీడ’ విరగడయింది. తమ ఆస్తిపాస్తులను ఎవరో అర్ధాంతరంగా దొంగిలించుకు పోతారనే భయం వీడింది.


మహిళల మానప్రాణాలకు రక్షణ ఏర్పడిందనే భరోసా కలిగింది. ఆత్మగౌరవంతో తమ బతుకులు తాము బతికే రోజులు మళ్లీ తిరిగి వచ్చాయనే ఆనంద డోలికల్లో జనం తేలియాడుతూ సంబరాలు చేసుకున్నారు. ఏ స్వేచ్ఛా సమాజం అయినా ఇంతకంటే ఏమి కోరుకుంటుంది? చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు వల్ల తెలుగు ప్రజలు సాధించిన అతి గొప్ప విజయం ఇదే. ఆ ప్రభుత్వం తీసుకునే ప్రతి పథకం, ప్రతి ఆలోచన కూడా తెలుగు వారికి అదనపు బోనస్సే. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏమీ చేయకపోయినా ప్రజలకు ఐదు పైసల నష్టం లేదు. చంద్రబాబు పునరాగమనంతో లభించిన ఆత్మగౌరవంతో కూడిన జీవనం, మాన మర్యాదలకు భంగం లేని, ఆస్తిపాస్తులకు బూచోళ్ల నుంచి కబ్జా భయం లేని సమాజం... తెలుగువారి జీవనయానంలో లభించిన ఓ గొప్ప ఉపశమనం. అయితే, ఐదేళ్ల పాటు తమ జీవనాన్ని నరకప్రాయం చేసి, సమాజాన్ని, ప్రకృతి వనరులను దోచేసినవారు ఉండవలసింది ప్రజాక్షేత్రంలో కాదని మెజారిటీ తెలుగు ప్రజలు భావిస్తున్నారు. వారికి ‘తగిన’, అర్హమైన చోట్లకు వారిని పంపించాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా చంద్రబాబు వెనుకపడ్డారనే భావం తెలుగుదేశం కార్యకర్తలనే గాకుండా, మామూలు ప్రజలను కూడా దహించి వేసింది. తమ ఆగ్రహావేశాలను సోషల్ మీడియా వేదికలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా వ్యక్తపరచడానికి వారేమీ మొహమాటపడలేదు. చివరాఖరికి– ‘సిట్’లు, దర్యాప్తులు, జైళ్లు... వంటివి మొదలయ్యాయి. వైసీపీ అరాచకాలపై యుద్ధం మొదలైంది. తెలుగు తమ్ముళ్ళకి కొంత ఉపశమనం కలగడం మొదలైంది. అది ఇంకా వేగం పుంజుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలే కాక, సగటు తెలుగువాడు కూడా కోరుకుంటున్నాడు. సంక్షేమం–అభివృద్ధి పథకాలతో ముందుకు వెడుతున్నామని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారు. ఆ రెండింటికీ వారు మరొకటి కలపాలి. అదే– ‘సిట్’లు. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ‘సిట్’ ఏర్పాటు కావాలి. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు పునరాగమనానికి ముందున్న ఐదేళ్ల ‘పీడకల’ లాంటి కాలంలో అరాచకాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు, కబ్జాలకు, మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడిన దుశ్శాసనులకు ప్రజాక్షేత్రంలో చోటు లేకుండా చంద్రబాబు ప్రభుత్వం చూడాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగు సమాజానికి ఆయన ఇచ్చే ‘రిటర్న్ గిఫ్ట్’ అదే. అందుకే ఆయనకు 164 సీట్లిచ్చి, సంబరాలు చేసుకున్నారు. మరి, తన మీద ప్రజలు పెట్టుకున్న ‘ఈ ఆశలు, ఆకాంక్ష’లను ఆయన నెరవేర్చి, తెలుగు ప్రజల ఋణం తీర్చుకుంటారా!?

- భోగాది వేంకటరాయుడు

Updated Date - May 28 , 2025 | 06:16 AM