Share News

Cultural Crisis: పతనమవుతున్న నైతిక విలువలు

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:08 AM

ప్రజలకు ప్రశాంతమైన, గౌరవప్రదమైన, ఉన్నత విలువలతో కూడిన జీవితం నేడు ఊహకందని విషయంగా మారింది.

Cultural Crisis: పతనమవుతున్న నైతిక విలువలు

ప్రజలకు ప్రశాంతమైన, గౌరవప్రదమైన, ఉన్నత విలువలతో కూడిన జీవితం నేడు ఊహకందని విషయంగా మారింది. అడుగడుగునా ఆవహించిన నేరమయ సంస్కృతి నాగరిక సమాజాన్ని వెక్కిరిస్తోంది. ప్రజల్లో నైతిక విలువలు నానాటికీ పతనమైపోతున్నాయి.


సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో పనిచేస్తూ ఆన్‌లైన్‌ జూదానికి అలవాటు పడ్డాడు. సుమారు రూ.15 లక్షల అప్పు చేశాడు. రుణదాతల ఒత్తిడి పెరగడంతో కొద్దిరోజుల కిందటే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఓ యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగుల్లో రూ. 6 లక్షలు పోగొట్టుకుని రైలు కిందపడి ఉసురు తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన ఓ బాలుడు ఆన్‌లైన్‌ బెట్టింగుకు తల్లి బ్యాంకు అకౌంటు లింక్ చేసి, రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పాలకుర్తిలో ఓ ఇంటర్ విద్యార్థిదీ ఇదే కథ. అతడి తండ్రి భూమి అమ్మగా వచ్చిన రూ.18 లక్షలను బ్యాంకులో భద్రపరిచాడు. తన ఫోన్‌ నెంబర్‌కు బ్యాంక్‌ అకౌంట్‌కు లింక్ చేసి ఉండడంతో, ఆ విద్యార్థి బెట్టింగుల్లో రూ. 18 లక్షల పోగొట్టుకున్నాడు. తండ్రి మందలిస్తాడనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కష్టపడకుండానే త్వరగా డబ్బు సంపాదించాలన్న పేరాశ యువతను ఆన్‌లైన్‌ బెట్టింగుల వైపు నడిపిస్తోంది. టెలిగ్రామ్ లింకులు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా చాలామంది బెట్టింగ్ యాప్స్‌ వలలో పడుతున్నారు. ఇలా ఆన్‌లైన్‌ జూదంలో సర్వం కోల్పోయి తెలంగాణలో నెల రోజుల వ్యవధిలోనే ఆరుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వివాహ బంధంలోనూ నైతిక విలువలు క్షీణిస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు కడతేర్చుకునే పరిస్థితులు దాపురించాయి.


ఇటీవలి కాలంలో విలువల్లేని కొన్ని సినిమాలు, పలు టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్న హాస్య కార్యక్రమాలు (ఆ పేరుతో ద్వంద్వార్థాలు, వెకిలి వేషాలు), పలు ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌లు.. యువతలో నైతిక, కుటుంబ విలువలను దిగజార్చి, వారిలో హింసాత్మక ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయి. పిల్లలు గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోతుండడంతో వారిలో మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. వారి మనస్తత్వమే మారిపోతోంది. క్రమంగా యువత గంజాయి, మత్తు మందులకు బానిసలై నేరగాళ్లుగా తయారవుతున్నారు. మన రాష్ట్రంలో సగటున ఒక వ్యక్తి రోజుకు ఆహారానికి రూ. 80 ఖర్చు చేస్తే.. తాగుడుకు 158 రూపాయలు ఖర్చు చేస్తున్నాడని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి! ఈ విషసంస్కృతిని బద్దలుకొట్టి సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించేలా కళా సృజనలు, రచనలు, కళాయాత్రల రూపకల్పన జరగాలి. అందుకోసం బలమైన సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం చేయాల్సిన కర్తవ్యం ప్రభుత్వంతో పాటు ప్రజా రచయితలు, కవులు, కళాకారుల భుజస్కంధాలపై ఉంది. ప్రపంచాన్ని బలప్రయోగంతో కాదు, భావాలతోనే జయించాలి.

-భూపతి వెంకటేశ్వర్లు,

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం

Updated Date - Jul 16 , 2025 | 01:08 AM