India Population Growth: వికసిత్ భారత్‌కు యువజన బాట
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:48 AM
ఒక దశాబ్దం క్రితం వరకు పేదరికం, నిరుద్యోగం, ఆహార సంక్షోభం వగైరా సమస్యలకు దారితీస్తోందనే సాకుతో జనాభా పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతుండేవి. అంతకంతకు పెరుగుతున్న జనాభాను మానవవనరులుగా పరిగణించే....
ఒక దశాబ్దం క్రితం వరకు పేదరికం, నిరుద్యోగం, ఆహార సంక్షోభం వగైరా సమస్యలకు దారితీస్తోందనే సాకుతో జనాభా పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతుండేవి. అంతకంతకు పెరుగుతున్న జనాభాను మానవవనరులుగా పరిగణించే సానుకూల భావన ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కువమంది పిల్లల్ని కనాలంటూ పిలుపునివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల అనేది ప్రతికూలత కన్నా ఎక్కువగా అనుకూలతను వ్యాప్తి చేస్తోంది. యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశం కొంతవరకు సరైనదే అయినా... వనరులు, మౌలిక సదుపాయాలు లేకుండా జనాభా పెరుగుదల అనారోగ్యకరమని అంగీకరించాల్సిందే. విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు సమర్థంగా లేని పరిస్థితిలో, అధిక జనాభా సామాజిక అసమానతలను, వనరులపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. ‘పాపులేషన్ హాలిడే’ భావన అనేది నిర్దిష్ట కాలానికి జనాభా పెరుగుదలపై ఆంక్షలు విధించడాన్ని సూచిస్తుంది. ఇది పంటకు ఇచ్చే విరామం లాంటిది. భూసారం పెంచేందుకు పంటల విరామం పాటించడం ఆనవాయితీ. దీన్ని క్రాప్ హాలిడే అంటారు.
ముక్కారు పంటలు పండే చోట కూడా నేలను కొంతకాలం ఖాళీగా ఉంచి విరామం ఇవ్వడం వల్ల భూమిలో పోషకాల సమతుల్యత సర్దుబాటు అవుతుందనేది శాస్త్రవేత్తల మాట. సహజవనరుల ఆదాకు చైనా లాంటి దేశాలు జనాభా విరామాన్ని అధికారికంగా అమలు చేసే క్రమంలో దశాబ్దం గడిచే సరికి సంతానోత్పత్తి రేటు దారుణంగా క్షీణించింది. అయితే మనదేశంలో కుటుంబ నియంత్రణ కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ప్రభుత్వపరంగా కాకుండా ప్రజలస్వామ్యంతో విజయవంతమయింది. చిన్న కుటుంబాల సిద్ధాంతం విజయవంతం కావడం అనేది మహిళల విద్య, ఆరోగ్య పరిరక్షణలో పెట్టుబడి వల్ల సాధ్యమైంది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే జనాభా నియంత్రణ సాధ్యపడుతుంది. చిన్న కుటుంబాలకు పన్ను లాభాలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ఈ విధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. జనాభా పెరుగుదల సహజవనరులైన నేల, నీరు, ఇంధనం వగైరాలపై ఒత్తిడి కలిగించి, వాటి కొరతకు దారితీస్తుంది. అధిక జనాభా వల్ల పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. సమాజంపై దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందనడానికి పెచ్చరిల్లే నిరుద్యోగం, పేదరికం, నివాసాల లేమి, ఆహార సంక్షోభం, విద్యా వైద్య వనరుల్లో కోత ఆపై పట్టణాలు, నగరాలు కిక్కిరిసిపోవడం... ఇలా అనేక సమస్యలకీ అధిక జనాభా ప్రధాన కారణమవుతుంది. ఈ సమస్యలు మన దేశంలో స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై జనాభా పెరుగుదల భారంగా పరిణమిస్తుంది. జనాభా పెరుగుదల అదుపులోకి రావాలంటే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమవుతుంది. జనాభా పెరుగుదల ఆర్థికవృద్ధికి దారితీయదు. ప్రపంచంలోని కొన్ని పేద దేశాలలో అధిక జనాభా ఉంది. శ్రమశక్తిలో చురుకుగా పాల్గొనే కార్మికుల విద్య, నైపుణ్యాలు ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. జనాభా గణాంకాలు ఆర్థిక వృద్ధి భవితవ్యాన్ని నిర్ణయించవు. అయితే అవి ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యానికి కీలకం కావచ్చు. అభివృద్ధి చెందిన దేశాలలో తగ్గుతున్న జనన రేటుతో పాటు వృద్ధాప్య జనాభా భవిష్యత్తులో ఆర్థిక వృద్ధిలో తగ్గుదలను సూచిస్తుంది. విద్య, నైపుణ్యాలు, ఉత్పాదకత పెరుగుదల వగైరా చర్యలు జనాభా మార్పుల ప్రభావాన్ని తగ్గించగలవు. సాంకేతిక పురోగతి ఉత్పాదకత పెంపుదలకు ఒక మూలం. జనాభాలో యువజన సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు బాగా లబ్ధి పొందుతాయి. ప్రపంచంలో అధిక యువజనాభా కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి. 2024లో దాదాపు 65 శాతం భారతీయ జనాభా 35 ఏళ్లలోపు వారే. ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వయస్సు కలిగిన కార్మిక జనాభా తగ్గుతుండగా, పనిచేయని జనాభా పెరుగుతోంది. శ్రామికశక్తి జనాభా తగ్గుతున్నప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి కారణంగా యూరప్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. జపాన్‌లో, కొరియాలో వృద్ధుల జనాభా ఆందోళన కలిగిస్తోంది. సామాజిక భద్రత, వైద్య సేవలు సవాలుగా మారాయి.
అమెరికా, యూరోపియన్ దేశాలలో శ్రామిక వయస్సు జనాభా గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. 2040 నాటికి యువ జనాభా కనీస స్థాయికి చేరుకుని శ్రామిక సంక్షోభం తలెత్తుతుందని అంచనా. తక్కువ శ్రామికశక్తి జనాభా కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి భవిష్యత్తులో తగ్గే అవకాశాన్ని సూచిస్తోంది. సాంకేతిక పురోగతి ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తున్నది. ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవాలంటే, జనన రేటు పెద్ద మొత్తంలో పెరగాలి లేదా ఉత్పాదకత పెరుగుతూనే ఉండాలని చాలామంది భావిస్తున్నారు. సాంకేతిక ఆవిష్కరణల కారణంగా ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ, సంబంధిత నైపుణ్యాలలో శిక్షణ పొందిన వారికి లబ్ధి చేకూరుతుంది. ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మధ్య, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత, రష్యా ఆర్థిక వ్యవస్థలను ఉద్దేశించి ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్య ఆర్థిక వ్యవస్థ)లు అంటూ ఎత్తి పొడిచారు. ప్రపంచంలో అతి పెద్ద జనసంఖ్య కలిగిన దేశంగా మారిన భారతదేశం ఏ రకంగా చూసినా డెడ్ ఎకానమీ అనిపించుకోదు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగిన సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెడితే, జనవనరుల ద్వారా అద్భుతాలు చేసే వీలుంది. దేశీయంగా బలమైన మార్కెట్ ఉన్న దేశం ఎప్పటికీ నిర్జీవం కాదు. అసలు అతిపెద్ద వినిమయ దేశంగా ఉన్న అమెరికానే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం కోరల్లో ఉంది. అమెరికా అభివృద్ధి చెందిన దేశమే అయినా, దాని ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేయడం లేదు. అమెరికా ప్రభుత్వ రుణభారం 35 ట్రిలియన్ డాలర్లు మించిపోయింది. అదే సమయంలో భారతదేశంలో తయారీ రంగం, మౌలిక సదుపాయాలు వేగం అందుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగానే ఉంది. ట్రంప్ చెప్పిన దానికి, వాస్తవానికి పొంతన లేనేలేదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ముందు మన ప్రజల ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అడుగులు వేయాలి. ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ ఎత్తి పొడుపును సవాల్‌గా తీసుకున్న ప్రధాని మోదీ ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని మరింత దృఢంగా పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధన ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, ప్రజల ఆశయాల్లో భాగంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ఇంధన స్వాతంత్ర్యం కలిగి ఉండడం, డిజిటల్ రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించడం, ఉత్పత్తి–సేవల రంగాల్లో అంతర్జాతీయ పోటీతత్వం ప్రదర్శించడం మొదలైన లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ లక్ష్యాలను నిజంగా అభివృద్ధిగా మార్చాలంటే, ఎన్నో విషయాల్లో పురోగతి చెందాలి. ముఖ్యంగా నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. కార్మిక చట్టాల సరళీకరణ, భూసంస్కరణలు, బ్యాంకింగ్ రంగంలో నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్ క్లీన్–అప్, పచ్చదనం, డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు అనే సంస్కరణలు లేకుండా సుస్థిర అభివృద్ధి సాధ్యం కాదు. ఈ మార్పులతో మాత్రమే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ నాయకత్వ స్థానాన్ని సొంతం చేసుకొనే మార్గం సుగమం అవుతుంది.
- నిమ్మగడ్డ లలితప్రసాద్ డైరెక్టర్, బ్రహ్మయ్య అండ్ కో