మీ అవినీతిని మర్చిపోరు!
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:47 AM
ప్రజలు గతం మరిచిపోయుంటారు కదా, ఇక గమ్మత్తయిన అబద్ధాలతో మరోమారు ప్రజల గుమ్మం ఎందుకు తొక్కకూడదూ... అన్న ఆలోచనలో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఫీజు...
ప్రజలు గతం మరిచిపోయుంటారు కదా, ఇక గమ్మత్తయిన అబద్ధాలతో మరోమారు ప్రజల గుమ్మం ఎందుకు తొక్కకూడదూ... అన్న ఆలోచనలో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఫీజు పోరు కార్యక్రమానికి తెర తీశారు (ఇప్పుడు దీని పేరును ‘యువత పోరు’గా మార్చారు). కానీ ఫీజుల పెండింగ్ జరిగింది జగన్ ప్రభుత్వ హయాంలోనే అన్న విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. నాటి వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2832కోట్లు, వసతి దీవెన కింద రూ. 989కోట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.450కోట్లు పెండింగులో పెట్టింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకు నేరుగా ఫీజులు చెల్లించేవి గత ప్రభుత్వాలు. కానీ తన స్వార్థం కోసం ఆ విధానాన్ని మార్చి, విడతల వారీగా చెల్లింపులు అని చెప్పి, పేద తల్లిదండ్రులలో ఆశలు రేపారు జగన్‌రెడ్డి. వారి ఆశలను మధ్యలోనే చిదిమేశారు. వైసీపీ పాలనలో పాఠశాల విద్యాశాఖలో జరిగినన్ని చిత్రవిచిత్రాలు ఏ శాఖలోనూ జరగలేదు. 2019–24 మధ్య 5.70 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు తరలిపోయారు. స్కూళ్లకు రంగులు కొట్టి రూ.1,800కోట్లు కొట్టేశారు. సీబీఎస్ఈ, వరల్డ్ బ్యాంక్ సాల్డ్ ఒప్పందం, ఈ నేపథ్యంలోనే 4,700 పాఠశాలలు మూసివేయడం, బైజూస్ కుంభకోణం... ఈ విధంగా తమ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అక్షర రంగానికి అవినీతి గొడుగు తొడిగేశారు. విద్యాశాఖకు నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పీఆర్ ఎజెన్సీని పెట్టుకున్నారు. తమిళనాడు న్యూస్ ప్రింట్ లిమిటెడ్ అనే తమిళనాడు సంస్థకు రూ.200కోట్లు బాకీ పడ్డారు. తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇస్తున్నారు కాబట్టి ఆ బాకీ ఈ డబ్బులు చెల్లేసుకోమన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో విద్యార్థులు తక్కువయ్యే కొద్ది విద్యా కానుక ఖర్చు పెరిగిపోయింది. విద్యా కానుకకు 2021–22లో 45లక్షల మంది విద్యార్థులకు రూ. 789 కోట్లు ఖర్చు చూపించిన ప్రభుత్వం 2023–24లో 39 లక్షల మంది విద్యార్థులకు రూ.1,042 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పింది. విద్యార్థుల సంఖ్య తగ్గినప్పుడు ఖర్చు పెరిగిందంటే రూ.270కోట్లు అడ్డంగా దోచేశారన్నమాట. టోఫెల్‌కి అందరినీ సన్నద్ధం చేస్తున్నామని నాటి సీఎం జగన్ అనేకసార్లు చెప్పారు. లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీలో ఉంది. ఈ సంస్థకు 34 మంది ఉద్యోగులే ఉన్నారు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఎస్ఈఆర్టీ బాగుందని అన్నారంట! ఎంపిక చేసిన టీచర్లకు టోఫెల్ ట్రైనింగ్ ఇచ్చేశారని, విద్యార్థులందరూ టోఫెల్‌కి సిద్ధంగా ఉన్నారని ప్రగల్భాలు పలికారు. లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వెబ్‌సైట్‌ని చూస్తే బండారం బయటపడుతుంది. ఈ విధంగా నోటికొచ్చిన ప్రగల్బాలన్నీ పలికి, పేద విద్యార్థులపై అసమర్థ, అవినీతి విధానాలను అమలు చేసిన ఘనతను మూటగట్టుకున్న వైసీపీ నేడు ఫీజుపోరు, యువత పోరు అంటూ కూటమి ప్రభుత్వంపై యుద్ధం చేయడం హాస్యాస్పదమే.
డాక్టర్ డి.ఉదయకుమార్
తిరుపతి
ఇవి కూడా చదవండి:
BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..