Poet Enugu Narasimhareddy: పద్యంలోనే ఎఫెక్టివ్‌గా చెప్పగలిగే విషయాలు కొన్ని ఉన్నాయి
ABN , Publish Date - May 19 , 2025 | 01:19 AM
కవి ఏనుగు నరసింహారెడ్డి రచించిన పద్య శతకం ‘ఏడుకోలల బాయి’, ప్రజలను చైతన్యవంతులుగా మార్చే రాజకీయ చింతనతో కూడిన శతకంగా నిలిచింది. రాజకీయాల లోతులు, ప్రజల అమాయకత్వం, నాయకుల మాయ మాటలపై పద్యాల రూపంలో వ్యంగ్యంగా చర్చించడం ఈ కావ్యానికి ప్రధాన లక్ష్యం.
సృజన ప్రక్రియలలో కొత్త కోణాలను అన్వేషించి అంతే అపురూపంగా వ్యక్తం చేస్తున్న కవి ఏనుగు నరసింహారెడ్డి. ‘సమాం తర స్వప్నం’, ‘నేనే’, ‘కొత్త పలక’, ‘మూలమలుపు’, ‘నీడల దృశ్యం’, ‘పూల పూల వాన’ పుస్తకాలు ఆయన కవిత్వ సృజనకు నిలువుటద్దాలు. కవిత్వంతోపాటు అనువాదాలు, విమర్శ, పరిశోధన గ్రంథాలు రాశారు. వర్తమాన కవులు ఎక్కువమంది పట్టించుకోని కవితా రూపాలైన రుబాయిలు, ఛందో బద్ధపద్యాల్ని కూడా ఆయన పట్టించుకున్నారు. పద్యాన్ని ఆధునీకరించి ప్రజలకు చేరువగా చేసిన కవులలో ఏనుగు నరసింహారెడ్డి పేర్కొనదగినవాడు. ఆయన ఇటీవల వెలువరించిన రాజకీయ శతకం ‘ఏడుకోలల బాయి’. గుర్రం జాషువా రాసిన ‘గబ్బిలం’ ఎట్లా ప్రతీకాత్మక కావ్యమో, అట్లానే వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెట్టే రాజకీయ ప్రతీకాత్మక కావ్యం ‘ఏడు కోలల బాయి’. ప్రజలను ఓటర్లుగా మాత్రమే కాక చైతన్యవంతమైన పౌరులుగా జీవించమని చెబుతున్న పద్యాలివి. ఈ శతక నేపథ్యంలో ఏనుగు నరసింహారెడ్డి జరిపిన సంభాషణ ఇది.
మీ నుంచి వచన కవిత్వేతర రూపాలు అప్పుడు ‘తెలంగాణ రుబాయిలు’ ఇప్పుడు ‘ఏడుకోలల బాయి’ రావడానికి కారణాలేంటి?
కాలమే కవుల్ని ప్రభావితం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో వచన కవిత్వంలో చెప్పిన విషయం కన్నా రుబాయిలలో చెప్పే విషయం ప్రజలను తొందరగా చేరుకుంటుందని భావించి అప్పుడు ‘తెలంగాణ రుబాయిలు’ రాశాను. అనుకున్నట్లుగానే అవి గేయంగా మారి అనేక మాధ్యమాల ద్వారా ప్రజల దగ్గరికి చేరాయి. ఇప్పుడు రాజకీయాలు వేస్తున్న వేషాలు, ఎన్నికలప్పుడు చేస్తున్న ఫీట్లు చూసి దీన్ని ఒకటో రెండో కవితలుగా రాస్తే లాభం లేదని, ఒక సంపూర్ణ కావ్యం నిర్మించాలని అనుకున్నాను. అందుకు పద్య కావ్యాన్ని ఎంచుకున్నాను.
మీరు ప్రధానంగా వచన కవి కదా. మరి ఈ ‘ఏడుకోలల బాయి’ని పద్యాలలో రాయాలని ఎందుకనిపించింది?
నేను వచన కవినే. వచన కవిత్వంలో చెప్పలేని అంశం అంటూ ఏదీ ఉండదని నేను నమ్ముతాను. కానీ కొన్ని సందర్భాలలో వచన కవిత్వం కన్నా పద్యంలోనే ఎఫెక్టివ్‌గా చెప్పగలిగే విషయాలు కొన్ని ఉన్నాయని అనిపిస్తుంది. వర్తమాన రాజకీయాలను అనేకమంది వచన కవిత్వంలో రాశారు, నేనూ రాశాను. అవి రాజకీయం లోని కొన్ని అంశాలని స్పృశించి సద్దుమణిగాయి. కానీ డెబ్బై అయిదేళ్ళ స్వతంత్ర భారతంలో రాజకీయ పార్టీలు పోతున్న పోకడను సంపూర్ణంగా చర్చించడానికి ఒక పద్య కావ్యమే కావాలనిపించింది నాకు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాలలోనూ అనేక భావజాలాలున్న ప్రభుత్వాలు వచ్చాయి. అయినా రాజకీయం సామాన్యులకు అసలైన జ్ఞానాన్ని కలిగించలేకపోతోంది. డబ్బుల చర్చ లేని రాజకీయం కనుచూపుమేరలో కనిపించకుండా పోయింది. ఈ agony నుండే 101 సీస పద్యాలలో రాజకీయాల గుట్టును, నాయకుల లోగుట్టును, ప్రజల అమాయకత్వాన్ని కదలకుండా నమోదు చేశాను. చాలామంది కవుల లాగే అడపాదడపా కొన్ని కవితలు రాసి ఊరుకోవడం కంటే ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థ రూపాన్ని పూర్తిగా తొలగించుకునేంతవరకు నిరంతరం ప్రాసంగికత ఉండే పద్యాలు కొన్ని రాసి ప్రజల నోళ్ళ మీద ఉండేట్లు చేయాలని అనిపించింది. తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో కొన్ని పద్యాలు రాసాను. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని పద్యాలు రాశాను. ఇవి చదివిన వారిపై గట్టి ముద్ర వేస్తాయని మాత్రం కవిగా నేను బలంగా నమ్ముతున్నాను.
ఎలాంటి శిల్ప వైవిధ్యంతో ప్రజలను చేరుకునే వ్యూహరచన చేశారు?
సీస పద్యానికి నిడివి ఎక్కువ ఉండడం అనేది ఒక సౌలభ్యం. అందువల్ల ఎక్కువ రాజకీయాలు చెప్పవచ్చు. బాగా నచ్చిన వారు ఎవరైనా పాడుకోవడానికి అనువైన లయ కూడా అందులో ఉంది. ఇక భాష కూడా సామాన్యులు రోజూ వాడుకునే మాటలనే తీసుకొని పద్యాల పట్టాల నడుమ ఇరికించాను. తెలంగాణ ప్రాంతపు లోకోక్తులు, సామెతలు, ఉర్దూ మిళిత పదబంధాలను ఇందు లో చాలా చేర్చాను. అందువల్ల– తమిళ పదాలు ఉచ్చరించడానికి మొదలు కొంత కష్టపడ్డా తర్వాత అవి మరిచిపోలేని విధం గా ఉన్నట్లు– ఈ పద్యాలు కూడా చదవడానికి కొంత ప్రయత్నించాలి. చదివారా అవి మీ వెంటే ఉండిపోతాయి అని చెప్పగలను.
మకుటానికి ఒక పద్యాన్ని పూర్తిగా వాడుకున్న కవి గతంలో ఎవరూ లేరు. మీరు మకుటానికి అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణమేమిటి?
నేను శతకం నిండా చెప్పుతున్న రాజకీయ అక్రమాలను ఓటరుకు ప్రతి పద్యంలో గుర్తు చేయవలసిన అవసరం ఉంది. అందుకే వ్యంగ్యంగా నిత్య వ్యవహార పదబంధంతో ఒక పూర్తి తేటగీతి పద్యాన్ని మకుటంగా పెట్టాను. ఎవరైనా ఆ ఒక్క మకుటాన్ని గుర్తు పెట్టుకుంటే ఆ పద్యం ఏమై ఉంటుందా అన్న క్యూరియాసిటీ రావాలన్నదే కవిగా నా లక్ష్యం.
‘‘మాయ మాటల హామీల మర్మమెరిగి
గుర్తు లేకుండ ఓటెట్ల గుద్దుతావు
ఓరి ఎంకన్న! దోస్తుగా! ఒర్లుబోతు!
ఒక్క మాటన్న వినవార! తిక్కలోడ!’’
‘ఏడుకోలల బాయి’ అని పేరు పెట్టడంలో గల సార్థకత ఏమిటి?
బావుల లోతు కొలవడానికి ‘కోల’ ఒక కొలమానం. ఏడు కోలల అంత లోతైన బావి అంటే అది చాలా లోతైన బావి అనే అర్థంలో వాడుతారు. ఎన్నికలు, ఓట్లు, రాజకీయాలు కూడా అంత లోతైనవి, అంత గుట్టు కలిగి ఉండేవి అనే అర్థంలో ఈ పేరు పెట్టాను. ఇంకా కొన్ని చోట్ల గుట్టుగా ఉండే మనుషులను ‘వాడు మామూలోడు కాదురా. ఏడు కోలల బాయి! ఎవరికీ అర్థం కాడు’ అనడం కూడా కద్దు. వెరసి రాజకీయ వ్యవహారం అంతా సామాన్య జనాలకు అర్థం కాని తంతు. అందుకే ఆ పేరు పెట్టాను.
- ఇంటర్వ్యూ
బెల్లంకొండ సంపత్ కుమార్
99085 19151