Share News

Employment Crisis: సమస్యల సుడిలో సంపద సృష్టికర్తలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:30 AM

ఇటీవల దూరదర్శన్‌ సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తమ పదకొండేళ్ల పాలన శ్రామికుల సంక్షేమం చుట్టూ సాగిందని, ఉపాధి కల్పన, సాంఘిక సంక్షేమంలో గణనీయమైన వృద్ధి సాధించామని పేర్కొన్నారు.

 Employment Crisis: సమస్యల సుడిలో సంపద సృష్టికర్తలు

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 1.45 లక్షల కోట్ల రూపాయలను నష్టపోతోంది. దేశంలో ఎక్కడా కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాల సవరణ కానీ, చెల్లింపు కానీ జరగడం లేదు. అందువల్ల ప్రధాని పేర్కొన్నట్లు ప్రభుత్వ విధానం కార్మికులకు కాకుండా, దానికి భిన్నంగా కార్పొరేట్లకు అనుకూలంగా మాత్రమే ఉంది.

టీవల దూరదర్శన్‌ సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తమ పదకొండేళ్ల పాలన శ్రామికుల సంక్షేమం చుట్టూ సాగిందని, ఉపాధి కల్పన, సాంఘిక సంక్షేమంలో గణనీయమైన వృద్ధి సాధించామని పేర్కొన్నారు. అదే సందర్భంలో కార్మికుల సాధికారత, సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కూడా తెలిపారు. కానీ వాస్తవమేమిటంటే మోదీ ప్రభుత్వ విధానాలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వీరి విధానాల వల్ల పేదరికం ఎంతగా పెరిగిందంటే దేశంలో ఐదేళ్ల లోపు పిల్లలలో 36 శాతం మంది ఉండవలసిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఇది పౌష్ఠికాహార లోపానికి సూచిక. అలాగే 15–49 మధ్య వయసుగల మహిళలలో రక్తహీనత 2015–16లో 53 శాతం నుంచి 2019–20కి 57.2 శాతానికి పెరిగింది. ఇదే వయస్సు గర్భిణులలో రక్తహీనత 50.4 శాతం నుంచి 52.2 శాతానికి పెరిగింది. ఒక పరిశోధన ప్రకారం 2023–24లో గ్రామీణ భారతంలో 40 శాతం మంది రెండుపూటలా భోజనం కూడా తీసుకోలేకపోతున్నారు. ఈ గణాంకాలన్నీ దేశంలో పెరుగుతున్న పేదరికానికి చిహ్నాలు.


అదే సందర్భంలో దేశంలోని కార్పొరేట్‌ సంస్థల ఆదాయాలు మాత్రం ఎలాంటి హద్దూ లేకుండా పెరిగిపోతున్నాయి. సంపద కేంద్రీకృతమవుతోంది. ప్రభుత్వరంగ సంస్థలను, ప్రకృతి వనరులను మోదీ ప్రభుత్వం కారు చవకగా వీరికి ధారాదత్తం చేస్తోంది. ఫలితంగా దేశంలో శత కోటీశ్వరులు సంఖ్య 2014లో వంద నుంచి 2024 నాటికి రెండు వందలకు పెరిగింది. వంద మంది శత కోటీశ్వరుల ఆస్తి 85 లక్షల కోట్ల రూపాయలకు పైగా చేరింది. మోదీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలకు ఇది నిదర్శనం. దేశంలో నేటి ఈ ఆర్థిక అసమానతలకు కారణం ప్రభుత్వ విధానాలే. ప్రభుత్వ పన్నుల విధానం క్రమేణా కార్పొరేట్ల నుంచి ప్రజలపై భారాలు వేసే దిశగా మారింది. మొత్తం రెవిన్యూ పన్ను ఆదాయంలో కార్పొరేట్‌ పన్ను వాటా 2014–15లో 34.5 శాతం ఉండగా, 2024–25 కల్లా అది 27.2 శాతానికి తగ్గిపోయింది. దీనికి తోడు ఈ పదకొండేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం 16.61 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్‌ సంస్థల బ్యాంకుల రుణాలను మాఫీ చేసింది.


ఇదే సమయంలో సంపద సృష్టికర్తలయిన శ్రామికుల కష్టాలు మరింతగా పెరిగాయి. సంఘటిత రంగంలో వేతన వృద్ధి ముందు ఐదేళ్లలో 10.1 శాతం ఉండగా, 2014–20 మధ్య ఆరు శాతానికి పడిపోయింది. ధరల పెరుగుదల వల్ల నిజ వేతనాలు పడిపోతున్నాయి. నికర జోడింపు విలువలో కార్మికుల వాటా 2020లో 18.9 శాతం నుంచి 2023 నాటికి 15.9 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో కార్పొరేట్ల లాభాల వాటా 38.7 శాతం నుంచి 51.9 శాతానికి పెరిగింది.


కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 1.45 లక్షల కోట్ల రూపాయలను నష్టపోతోంది. దేశంలో ఎక్కడా కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాల సవరణ కానీ, చెల్లింపు కానీ జరగడం లేదు. అందువల్ల ప్రధాని పేర్కొన్నట్లు ప్రభుత్వ విధానం కార్మికులకు కాకుండా, దానికి భిన్నంగా కార్పొరేట్లకు అనుకూలంగా మాత్రమే ఉంది. తమ విధానాలు ఇలా ఉండగా ప్రధాని వేరే విధంగా మాట్లాడడం సహేతుకం కాదు.


ప్రభుత్వం నిజంగా కార్మిక సంక్షేమానికి నిధులు రాబట్టాలంటే దానికి అనేక మార్గాలున్నాయి. ఒక మార్గం ప్రభుత్వ బ్యాంకులకు కార్పొరేట్‌ సంస్థలు బకాయిపడ్డ రుణాలను వసూలు చేయడం. ప్రభుత్వ బ్యాంకులు 4,10,758 కోట్ల రూపాయల బకాయి కోసం 16,420 నోటీసులు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఎగవేతదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టి రుణాలు వసూలు చేయడానికి బదులు, ఆశ్చర్యకరంగా వాటిని ఒక్క కలం పోటుతో రద్దు చేసేసింది.


కార్మికులపై ఈ ఆర్థిక భారాలు చాలవన్నట్లు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను హరించేలా మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లను చేసింది. రోజుకు 8 పని గంటల స్థానంలో 12 గంటలు, అంతకంటే ఎక్కువ పని; సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులు సహా అనేక అంశాలను సమూలంగా మార్చివేసింది. కార్మిక సంఘాల నుంచి వస్తున్న ప్రతిఘటనతో దేశవ్యాప్తంగా ఒకేసారి వీటి అమలుకు మోదీ ప్రభుత్వం సంశయిస్తున్నా, తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో వీటి అమలు ఇప్పటికే ప్రారంభమయింది. వేతనాలు పెరగక పోవడం, పని గంటలు పెరగడం, హక్కులు కోల్పోవడం వంటి సుడిగుండంలో నేడు దేశంలోని శ్రామికులున్నారు. మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంటే ఈ పదకొండేళ్లలో 22 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించవలసి ఉంది. కానీ దీనికి భిన్నంగా ఉన్న ఉద్యోగాలే కోల్పోయే స్థితి ముఖ్యంగా నేడు దేశంలోని ప్రభుత్వ సంస్థల్లో నెలకొని ఉంది. కేంద్ర ప్రభుత్వ స్వంత నివేదికల ప్రకారమే ప్రభుత్వరంగ పరిశ్రమలలో ఉద్యోగుల సంఖ్య 2013లో 17.3 లక్షలు ఉండగా 2022 నాటికి ఈ సంఖ్య 14.6 లక్షలకు పడిపోయింది. అదే కాలంలో ఎటువంటి ఉద్యోగ భద్రత లేని కాంట్రాక్టు కార్మికుల సంఖ్య మాత్రం 19 శాతం నుంచి 42.5 శాతానికి పెరిగింది. ప్రభుత్వ బ్యాంకులలో 2014లో 8.5 లక్షల ఉద్యోగులు ఉండగా, 2023లో 7.5 లక్షల మందికి తగ్గిపోయారు.


ఈ విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగంలో ఉపాధి ప్రపంచంలోనే అతి తక్కువగా మన దేశంలోనే ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక ప్రకారం మన దేశంలో మొత్తం ఉద్యోగులలో ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు 3.8 శాతం ఉండగా, బ్రెజిల్‌లో 12.3 శాతం, అమెరికాలో 13.3 శాతం, అర్జెంటీనాలో 16.9 శాతం, బ్రిటన్‌లో 21.5 శాతం, చైనాలో 28 శాతం, రష్యాలో 40.6 శాతం, క్యూబాలో 77 శాతం ప్రభుత్వసంస్థల ఉద్యోగులున్నారు. దీనివల్ల కార్మికుల ఆదాయాలు పడిపోవడమే కాకుండా, రిజర్వేషన్లు తగ్గి, సామాజిక న్యాయం కూడా దెబ్బతింటోంది. దేశం గరిష్ఠ స్థాయి నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోంది. దీనివల్ల పుష్కలంగా ఉన్న యువ మానవ వనరులను సద్వినియోగం చేసుకునే స్థితి లేకపోవడం దేశ భవిష్యత్తుకు హానికరం. నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థ, విశ్వగురు అని ఎన్ని కితాబులు ఇచ్చుకున్నా, ఈ వాస్తవాలను కాదనలేం.


అందువల్ల మోదీ ప్రభుత్వ ఆర్భాట వాగ్దానాలు, అవాస్తవ ప్రకటనలే తప్ప, ఆచరణలో శ్రామికులు బ్రిటిష్‌ ఇండియాలో కూడా లేనంతగా ఆర్థిక అసమానతలు, భారాలను మోయాల్సి వస్తోంది. సంపద సృష్టికర్తలు సుఖంగా లేని ఏ సమాజమూ దీర్ఘకాలంలో సురక్షితంగా ఉండలేదు. దీనికి మన దేశం మినహాయింపేమీ కాదు. ఈ నేపథ్యంలోనే దేశంలోని రైతాంగ, వ్యవసాయ కార్మికవర్గ సమస్యలను కూడా ఎంతో బాధ్యతాయుతంగా జోడించి, జూలై 9న అఖిల భారత సమ్మెకు కార్మికవర్గం పూనుకుంది. ఇదో దేశభక్తియుత పోరాటం.

ఎ. అజశర్మ ప్రధాన కార్యదర్శి,

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - Jul 05 , 2025 | 01:30 AM