Share News

India Creates History: క్రికెట్‌లో కొత్త అధ్యాయం

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:09 AM

నలభై రెండు సంవత్సరాల క్రితం చరిత్రాత్మక లార్డ్స్‌ మైదానంలో చోటు చేసుకున్న మహాద్భుతం యావత్‌ భారత క్రికెట్‌ రంగం స్థితిగతులనే మార్చివేసింది..

India Creates History: క్రికెట్‌లో కొత్త అధ్యాయం

నలభై రెండు సంవత్సరాల క్రితం చరిత్రాత్మక లార్డ్స్‌ మైదానంలో చోటు చేసుకున్న మహాద్భుతం యావత్‌ భారత క్రికెట్‌ రంగం స్థితిగతులనే మార్చివేసింది. 1983 ప్రపంచ కప్‌ పోటీల్లో అనామక జట్టుగా అడుగుపెట్టిన కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని టీమిండియా అంతిమ సమరంలో దిగ్గజ ఆటగాళ్లున్న వెస్టిండీస్‌ జట్టును ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. మహిళల క్రికెట్‌లోనూ ఇలాంటి మరపురాని ఘట్టం కోసం ఎదురుచూసిన భారతీయుల స్వప్నం ఇప్పుడు సాకారమైంది. క్రీడా మైదానంలో మన అమ్మాయిలు విజయనాదం చేశారు. నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మహిళల వన్డే ప్రపంచకప్‌లో చాంపియన్లుగా నిలిచారు. ఈ విజయం భారత మహిళా క్రికెట్‌లో ఒక గొప్ప అధ్యాయానికి నాంది కానున్నది. వన్డే ప్రపంచ కప్‌లో గతంలో రెండు పర్యాయాలు తుది మెట్టుపై పరాజితులుగా మిగిలి వేదనను అనుభవించిన భారత మహిళల జట్టు మూడో ప్రయత్నంలో ఫలితాన్ని రాబట్టి అందరి కళ్లల్లోనూ ఆనందాన్ని నింపింది. ఈసారి జగజ్జేతగా నిలవడంలో సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో పాటు జట్టులోని సభ్యులంతా తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. గ్రూప్‌ దశ పోటీల్లో బ్యాట్‌తో స్మృతీ మంధాన, ప్రతీకా రావల్‌, అమన్‌జోత్‌, రిచా ఘోష్‌, బంతితో దీప్తి శర్మ, క్రాంతి గౌడ్‌, రేణుకా సింగ్‌ అదరగొట్టారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో జెమీమా రోడ్రిగ్స్‌ ఛేదనలో వీరోచిత సెంచరీతో ఆకట్టుకుంటే, అసలైన తుదిపోరులో దక్షిణాఫ్రికాపై షఫాలీ వర్మ సూపర్‌ ఇన్నింగ్స్‌, ఆల్‌రౌండర్‌గా దీప్తి శర్మ ప్రతిభ భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టాయి. జట్టు విజయంలో కడప జిల్లాకు చెందిన బౌలర్‌ శ్రీచరణి రాణించడం తెలుగువారు గర్వించదగ్గ విశేషం. ఇంతటి అద్భుత ప్రదర్శన కనబరచిన జట్టు సభ్యుల్లో చాలామంది దిగువ మధ్యతరగతి స్థాయి నుంచి వచ్చినవారే. గ్రామీణ నేపథ్యం నుంచి కెప్టెన్‌ స్థాయికి ఎదిగిన హర్మన్‌ప్రీత్‌, కార్పెంటర్‌ అయిన తండ్రి చెక్కిన బ్యాట్‌తో కెరీర్‌ మొదలుపెట్టిన అమన్‌జోత్‌, మూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి, ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న రేణుక, పోలీస్‌ కానిస్టేబుల్‌ కూతురు క్రాంతి గౌడ్‌...వారిలో కొందరు మాత్రమే.


భారతీయుల ప్రపంచ కప్‌ కలను సాకారం చేసిన టీమిండియా క్రీడాకారిణుల వెనుక ఇలాంటి త్యాగాలు, పోరాటాలు, కన్నీళ్లకు కొదవే లేదు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా పట్టుదలతో జట్టుకోసం శ్రమించి ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టును నిలబెట్టిన మన అమ్మాయిల ఆట ప్రశంసనీయం. గతంలో సరైన ఆదరణకు నోచుకోని మహిళా క్రికెట్‌ను బీసీసీఐ తన చేతుల్లోకి తీసుకున్నాక వసతులు, పారితోషికాలు మెరుగయ్యాయి. పురుషుల, మహిళల జట్ల మధ్య వేతన సమానత్వాన్ని బీసీసీఐ ప్రవేశపెట్టడం మహిళా క్రికెట్‌లో ఓ ముందడుగు. పురుషుల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తరహాలో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చి వారు ఆర్థికంగా కుదురుకునేలా చేసింది. ఈ క్రమంలోనే మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి లాంటి సీనియర్ల ప్రేరణతో నవతరం క్రీడాకారిణులు సత్తా చాటుతుండడంతో అమ్మాయిల క్రికెట్‌కు అభిమానులూ పెరిగారు. వారి మ్యాచ్‌లు వీక్షించేందుకు స్టేడియాలకు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ ఉత్సాహంతో మన క్రికెటర్లు మరింత శ్రమించి ఐసీసీ ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వరుసగా రెండుసార్లు అండర్‌–19 జట్టు ప్రపంచ కప్పు నెగ్గడం, ఇప్పుడు సీనియర్‌ జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌తో క్రికెట్‌లో ఆధిపత్యాన్ని చాటుకోవడం.. మహిళల క్రికెట్‌లో భారత్‌ ఉజ్వల భవితకు తార్కాణాలు. ప్రోత్సాహం ఉండాలే కానీ, అద్భుతమైన విజయాలు అందించగలమని కొన్నాళ్లుగా మన అమ్మాయిలు నిరూపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఖో ఖో ప్రపంచ కప్‌లో పురుషులతో పాటు భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. నిరుడు పారిస్‌ ఒలింపిక్స్‌లో షూటర్‌ మనూ భాకర్‌ రెండు పతకాలతో విశ్వవేదికపై సత్తా చాటింది. లండన్‌ విశ్వక్రీడల్లో బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ కాంస్యం, టోక్యోలో వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతం, బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ కాంస్యం, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు వరుస ఒలింపిక్స్‌ల్లో రజత, కాంస్య పతకాలు, ప్రపంచ చెస్‌ యవనికపై కోనేరు హంపి, దివ్యా దేశ్‌ముఖ్‌, వైశాలి మెరుపులు.. ఇలా, ఆట ఏదైనా విశ్వక్రీడావనిలో తమదైన ప్రతిభాప్రదర్శనతో అబ్బురపరుస్తుండడం భారత నారీశక్తి ప్రభంజనానికి నిదర్శనం. ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుందని గురజాడ అన్నారు. మహిళాక్రికెటర్లు క్రికెట్‌క్రీడ భావిచరిత్రను నిర్ణయాత్మకంగా తీర్చిదిద్దుతారని ఆశించడంలో తప్పులేదు.

Updated Date - Nov 04 , 2025 | 04:09 AM