Share News

Gender Wage Gap: ఈ అసమానతలు తొలగేదెప్పుడు

ABN , Publish Date - May 01 , 2025 | 03:33 AM

భారతదేశ ఆర్థిక వృద్ధి వృద్ధి చెందుతున్నప్పటికీ, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం గణనీయంగా తక్కువగా ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో మరింత తగ్గిపోతున్నదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉపాధి హామీ పథకాలు, సమాన వేతనాలు, సురక్షిత పని వాతావరణం లాంటి అంశాలు మహిళల శ్రామిక స్థితిని మెరుగుపరచడంలో కీలకం.

 Gender Wage Gap: ఈ అసమానతలు తొలగేదెప్పుడు

భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా ఆర్థికవృద్ధి గణనీయంగా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 2014–24 మధ్య కాలంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీఎన్‌పీ) పెరుగుదల రేటు సంవత్సరానికి 8.2 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఆదాయ పెరుగుదల రేటు ఆధారంగా ప్రపంచ దేశాలలో భారతదేశ స్థానం ఆరుగా పరిగణించారు. ఇంతటి విశిష్టమైన పెరుగుదల రేటు ప్రాతిపదికన భారతదేశం 2022–23 సంవత్సరం నాటికి 3.7 ట్రిలియన్ల (జీడీపీ)కి చేరనున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. అయితే ఇంతటి గణనీయమైన అభివృద్ధిని సాధించిన భారతదేశం, సమాజంలో 50 శాతంగా ఉన్న మహిళల/ మహిళా శ్రామికుల అభివృద్ధి ఏ మేరకు సాధించింది? భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం సగటు ప్రపంచ దేశాల సగటు కంటె ఎందుకు తక్కువగా ఉంది? గ్రామాలలో ఈ భాగస్వామ్యం ఎందుకు తగ్గుతున్నది? గ్రామీణ, పట్టణ మహిళా శ్రామికుల పని వసతులు ఎందుకు తగ్గుతున్నాయి? అలాగే స్త్రీ పురుషుల వేతనాలు మధ్య అంతరం ఎందుకు పెరుగుతున్నది? ఈ అన్ని ప్రశ్నలకు పెరుగుతున్న జీడీపీ ఏం సమాధానం చెప్పగలదు? ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చకుండా, లింగ అభివృద్ధిని, సమానత వైపు నడిపించకుండా ఏ దేశమైనా అభివృద్ధి చెందగలదా? భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి పురోగమనాన్ని విశ్లేషిస్తే– 131 దేశాలలోని మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటులో భారతదేశానిది 120వ స్థానం అని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అలాగే 2023లో భారతదేశ మహిళా శ్రామిక శక్తి (15–59సంవత్సరాల మహిళలు) భాగస్వామ్యం రేటు 37 శాతం. ఇది ప్రపంచ దేశాల సగటు కన్నా తక్కువ.


ఇదే ఏడాది పురుష శ్రామిక శక్తి భారతదేశంలో 76.8 శాతం. మన దేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు అభివృద్ధిలో వెనుకబడ్డ బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల కన్నా తక్కువగా ఉంది. ఆ దేశాలలో భాగస్వామ్యం రేటు పెరుగుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మన దేశంలో మాత్రం 1990–2013 మధ్య కాలంలో భాగస్వామ్యం రేటు 34 నుంచి 27 శాతానికి తగ్గింది. 2004–2020 మధ్యకాలంలో మహిళా పట్టణ శ్రామిక శక్తి భాగస్వామ్యం 16.6 నుంచి 16.8 శాతానికి పెరగగా, గ్రామాలలో ఇది 32.7 నుంచి 24 శాతానికి తగ్గిందని 2023లో పాండే తన అధ్యయనంలో పేర్కొన్నారు. మహిళలు చేసే పనుల్లో రక్షణ, భద్రత ఉండాలి. పని పరిసరాలు సహకరించేవిగా ఉండాలి. స్త్రీ–పురుష అసమానతలు లేకుండా ఉండాలి. మహిళలకు పని అవకాశాలు పెరిగి, నైపుణ్యాలు పెంచుకునేలా ఉండడంతో పాటు, క్రెష్‌ వంటి అవకాశాలు ఉండాలి. యాజమాన్యంతో సత్సంబంధాలు పెరుగుతూ ఉండాలి. అయితే ఆధునిక పరిశ్రమలలో మహిళలను నైపుణ్యం అవసరం లేని, ఒకే పని పునరావృత్తమయ్యే చోట తక్కువ వేతనాలపై నియామకాలు జరిగేలా చేశారు. అలాగే వీరిని అనధికారిక, అసంఘటిత ఉద్యోగులుగా గుర్తింపులేని పనులకు ఉపయోగించేవారు. వీరి శ్రమశక్తిని దోపిడీ చేసేలా పని నిర్మాణాలు జరిగాయి. ఇలాంటి పరిశ్రమలు పట్టణ సరిహద్దుల్లో నెలకొని ఉంటాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో శ్రమ వర్గీకరణ చూస్తే దేశం మొత్తం మీద గ్రామీణ మహిళా శ్రామిక శక్తి 149.8 మిలియన్లుగా నమోదైంది. ఇందులో 35.9 మిలియన్లు సాగుదారులు, 61.5 మిలియన్లు వ్యవసాయ కూలీలు, 58.5 మిలియన్లు గ్రామీణ పారిశ్రామికులుగా ఉన్నారు.


కానీ ఈ రంగాల నుంచి 8.4 శాతం రైతులు, 6.5 శాతం రైతు కూలీలు, 4.75 శాతం పరిశ్రమ శ్రామికులు నిష్క్రమించినట్లు నీతి ఆయోగ్‌ ప్రకటించింది. మహిళా శ్రామికులు ఎదుర్కొంటున్న స్త్రీ–పురుష ఆదాయ అసమానతలు, గ్రామీణ–పట్టణ ఉపాధి అవకాశాల అసమానతలు తొలగించడానికి, వ్యవసాయరంగంలో ఏర్పడ్డ అల్ప ఉత్పాదకత, అల్ప ఆదాయ సమస్యలు అధిగమించడానికి రాజ్యాంగ హామీతో ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం అమలుపరిచింది. ఇందులో మహిళా శ్రామికులకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33 శాతం కేటాయించారు. స్త్రీ–పురుషులకు సమాన వేతనాలు చెల్లిస్తారు. నైపుణ్యాలు అవసరం లేని పనులను ఈ పథకం ఇస్తుంది. 90:10నిష్పత్తి బడ్జెట్‌తో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకం పనిచేస్తుంది. ఈ పథకాన్ని వెనుకబడ్డ రాష్ట్రాల్లోని వెనుకబడ్డ జిల్లాల్లో అమలుపరిస్తే మహబూబ్‌నగర్‌ జిల్లాల వంటి చోట్ల శ్రామిక వలసలను ఆపవచ్చు. మన దేశంలో పట్టణ ప్రాంతాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం పనులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి 100 పని వేతనాలకు మాత్రమే పరిమితమయ్యాయి. మన దేశంలో పట్టణీకరణ వేగాన్ని పుంజుకుంది, కనుక ప్రజలు పట్టణ నిమాయకాలతో సర్దుకుపోవాల్సి వస్తోంది. దశాబ్దాలుగా భారతదేశంలో ఉత్పత్తి ఎంత విస్తారంగా పెరిగినా, మహిళా శ్రామిక శక్తి స్థితిగతులు సంతృప్తిగా మారలేదు. ఇంకెన్ని దశాబ్దాలకు ఈ పరిస్థితులు మారతాయో వేచి చూడాల్సిందే.

డా. వనమాల

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - May 01 , 2025 | 03:35 AM