Women leadership: పేరుకే మహిళకు పంచాయతీ పదవి!
ABN , Publish Date - Dec 02 , 2025 | 03:48 AM
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 2026 నుంచి పంచాయతీ ఎన్నికలు జరిపించాలన్న ఎన్నికల కమిషన్ లేఖతో, స్థానిక పాలనలో మహిళల రిజర్వేషన్లపై మరోసారి దృష్టి పెట్టాల్సిన అవసరం తెరపైకి వచ్చింది....
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 2026 నుంచి పంచాయతీ ఎన్నికలు జరిపించాలన్న ఎన్నికల కమిషన్ లేఖతో, స్థానిక పాలనలో మహిళల రిజర్వేషన్లపై మరోసారి దృష్టి పెట్టాల్సిన అవసరం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం గ్రామ స్థాయి నుంచి మునిసిపల్ స్థాయి వరకు మహిళల పదవులన్నీ కేవలం కాగితాలకే పరిమితమైపోతున్నాయి. స్థానిక పరిపాలనలో మహిళా రిజర్వేషన్ ఏర్పాటు మహిళా సాధికారత దిశగా ఒక చరిత్రాత్మక రాజ్యాంగ నిర్ణయం. అయితే, ఆ స్ఫూర్తితో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ ఉద్దేశం ప్రాక్సీ అభ్యర్థిత్వాల వల్ల, కుటుంబంలోని పురుషుల ఆధిపత్యం వల్ల నీరుగారుతున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు, సోదరులు, తండ్రుల వంటి కుటుంబ సభ్యులు మహిళలను నామినేషన్ వేయాలని ఒత్తిడి చేస్తూ, ఎన్నికల తరువాత తామే అసలైన అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఎన్నికైన మహిళను ఇది కేవలం ‘ఆడపిల్ల’గా మిగిల్చి, నిజమైన నాయకత్వ లక్షణాలు గల మహిళలకు అవకాశం దక్కకుండా రిజర్వేషన్ ఉద్దేశాన్ని పూర్తిగా విఫలం చేస్తోంది. అంతేకాదు, ఇటీవల భర్తలు, బంధువులు అదే స్థానిక సంస్థల్లో కో–ఆప్టెడ్ మెంబర్లుగా లేదా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులవుతూ, నిజమైన అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. ఎన్నికైన మహిళకు ఎలాంటి నిర్ణయాధికారం లేకుండా ఈ ప్రక్రియ చేస్తోంది. ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధుల పురుష బంధువులు కేవలం పక్క నుంచి నియంత్రించడమే కాదు, వారి అధికారిక కుర్చీల్లో/ కార్యాలయాల్లో కూర్చొని అధికారాన్ని చెలాయిస్తూ, సమావేశాలు నిర్వహిస్తూ, చర్యలు తీసుకుంటూ, స్వయంగా ఎన్నికైన ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఒక అవమానకరమైన పరిస్థితి ఏమంటే, ఎన్నికల ప్రచార సమయంలోనూ, ఎన్నిక తర్వాత కూడా ఈ మహిళల స్థానంలో భర్తల ఫొటోలు చలామణీ అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా స్థానిక పరిపాలన వ్యవస్థలో మహిళా రిజర్వేషన్ల దుర్వినియోగం పెరగటానికి సంబంధించి నమ్మదగిన ఆధారాలు రోజురోజుకూ వెలుగుచూస్తున్నాయి. 2010లో ప్రణాళికా సంఘం (ప్రస్తుతం నీతి ఆయోగ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం– అనేక రాష్ట్రాల్లో ఎన్నికైన మహిళలు కేవలం ‘పేరు మీద’ నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. వాస్తవ అధికారాన్ని వారి భర్తలు లేదా కుటుంబానికి చెందిన పురుషులు ఉపయోగించుకుంటున్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్యయనాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉదాహరణలు చూస్తే– చదువు లేని లేదా రాజకీయ అనుభవం లేని మహిళల్లో ఈ ధోరణి మరింత తీవ్రం. 2021లో యూఎన్ ఉమెన్ ఇండియా, పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం– మహిళలు కేవలం ‘రబ్బరు ముద్ర’లా ఉండిపోతుండగా, నిజమైన నిర్ణయాలు పురుష బంధువుల ద్వారా జరిగిపోతున్నాయని వెల్లడైంది. 2023లో పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పలు సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలో– జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో, బలవంతపు నామినేషన్లను నిరోధించి, అసలైన నాయకత్వ లక్షణాలు గల మహిళలకు ఆ చోటు దక్కేలా చర్యలు తీసుకోవాలి. ప్రాక్సీ అభ్యర్థిత్వాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని కోరాలి. పబ్లిక్ నోటీసుల ద్వారా ఈ చర్యల గురించి ముందస్తుగా హెచ్చరించాలి. ఎన్నికల అనంతరం కూడా ఈ విధంగా మహిళా ప్రజాప్రతినిధుల అధికారాన్ని, నిర్ణయాధికారాన్ని గుప్పెట్లోకి లాక్కుని పెత్తనం చేస్తుంటే, వారిపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్య ప్రజలు కూడా ఫిర్యాదులు చేసేలా వాచ్ డాగ్ వ్యవస్థ ఉండాలి. బహిరంగ పోస్టర్లు, బ్యానర్లు, శిలాఫలకాల్లో, అధికారిక కార్యక్రమాల్లో, భర్తలు లేదా బంధువుల ఫొటోలు, పేర్లు ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలి. ఎన్నికైన మహిళకు సంబంధించిన పంచాయతీలో లేదా మరే ప్రభుత్వ కార్యాలయంలో ఆమె భర్త లేదా ఆమె బంధువులను నామినేటెడ్ లేదా కోఆప్టెడ్ మెంబర్లుగా నియమించడాన్ని చట్టపరంగా నిషేధించాలి. అలాగే మహిళా ప్రజాప్రతినిధులకు బదులుగా ఆమె బంధువులు అధికారిక సమావేశాల్లో, కార్యక్రమాల్లో పాల్గొనటాన్ని, నిర్ణయాలు తీసుకోవడాన్ని కూడా నిషేధించాలి. దాన్ని నేరంగా భావించి కఠిన చర్యలను ప్రకటించాలి. మహిళలకు వారి హక్కులు, అధికారం, నాయకత్వ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి జిల్లాలో, మండలంలో, పంచాయతీలో మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా, ప్రాక్సీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు; నిజమైన నాయకత్వం కోసం మహిళలను ప్రోత్సహించేందుకు; ఈ అంశంలో ఎటువంటి రాజ్యాంగ వ్యతిరేక, చట్టవ్యతిరేక పనులకు ఎవరు పాల్పడినా వెంటనే చర్యలు తీసుకునేందుకు– ఒక రాష్ట్ర స్థాయి ఫోరంను రాష్ట్ర మహిళా కమిషన్ వంటి శాఖలు ఎన్నికలకు ముందే ఏర్పాటు చేయాలి. 2026 పంచాయతీ ఎన్నికలు, ఒక కీలక మలుపు కావాలి. మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా, అధికారంతో ముందుకు రావడానికి, పాలన చేయడానికి అందరం మద్దతు ఇవ్వాలి.
- డా. మనోహరి వెలమాటి
గ్రామదీప్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు