Share News

Industrial Guidelines: కొత్త మార్గదర్శకాలతో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేనా?

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:14 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘MSME–2024 పారిశ్రామిక పాలసీ’ని గత ఏడాది సెప్టెంబర్ 18న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక సంఘాల ఆధ్వర్యంలో....

Industrial Guidelines: కొత్త మార్గదర్శకాలతో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేనా?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘MSME–2024 పారిశ్రామిక పాలసీ’ని గత ఏడాది సెప్టెంబర్ 18న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 8న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐటీ, పారిశ్రామిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పలువురు ఎస్సీ, ఎస్టీ వర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్, పలువురు పారిశ్రామికశాఖ అధికారులు పాల్గొన్న నాటి సమావేశంలో ‘తెలంగాణ పారిశ్రామిక పాలసీ’కి సంబంధించిన పలు ప్రతిపాదనలు చేశారు.

‘ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే భూమి లేదా భవన విక్రయ, లీజు పత్రం రెండింటి పైనా స్టాంపు డ్యూటీ 100 శాతం మినహాయింపు ఇవ్వాలి. మూలధన పెట్టుబడిలో 50శాతం సబ్సిడీ గరిష్ఠ పరిమితి రూ.2 కోట్ల వరకూ ఉండాలి. తయారీ, సేవా రంగాలకు దాన్ని ఒకేలా వర్తింపజేయాలి. తీసుకున్న రుణానికి రుణకాలం పూర్తయ్యే వరకు ప్రాథమిక వడ్డీపై 9శాతం వడ్డీని తిరిగి చెల్లించాలి. విద్యుత్ చార్జీలకు సంబంధించి ఒక యూనిట్‌కు రూ.3 చొప్పున సబ్సిడీ ఇవ్వాలి. గ్రీన్ కేటగిరికి సంబంధించిన కుటీర పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, సేవారంగ పరిశ్రమలకు డీటీసీపీ/ హెచ్‌ఎండీఏకు సంబంధించిన అనుమతులను మినహాయించాలి. కాలుష్యంలేని ఎంటర్‌ప్రైజెస్‌లకు భూ వినియోగ మార్పు మినహాయింపు ఇవ్వాలి. అయితే అది తప్పనిసరి అయిన సందర్భంలో ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో నడిచే సూక్ష్మ, చిన్న పరిశ్రమల (ఎంఎస్‌ఈ)కు భూ వినియోగ మార్పు చార్జీలు గరిష్ఠంగా రూ.1000 మాత్రమే ఉండాలి’ వంటి ప్రతిపాదనలు చేశారు.

అంతేకాదు, ఎంటర్‌ప్రైజెస్ కోసం అద్దెకు తీసుకునే భవనాలకు సంబంధించి లీజు డీడ్ కాకుండా నోటరీ ధ్రువీకరణ, స్వీయ ధ్రువీకరణకు అనుమతించాలి. ఎస్సీ, ఎస్టీల ఎంటర్‌ప్రైజెస్‌ల కోసం ఉత్పత్తి కొనసాగింపు కాలం ఆరేళ్లకు బదులుగా మూడేళ్లకు పరిమితం చేయాలి. టి–ప్రైడ్‌లోని అన్ని సేవారంగ కార్యకలాపాలు వాటి ఆపరేషన్ మార్గదర్శకాలతో సహా ఎటువంటి సవరణలు లేకుండా జీవో నెం.78 ప్రకారం అమలులో కొనసాగించాలి. సంప్రదాయ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తూ రెట్రోఫిట్ కిట్లు, బ్యాటరీలు అమర్చిన వాహనాలను కొత్త యూనిట్లుగా పరిగణించి సబ్సిడీలకు అనుమతివ్వాలి. వ్యక్తిని పరిగణలోనికి తీసుకుని ‘ఒక వ్యక్తికి ఒకేసారి సబ్సిడీ’ అనే విధానాన్ని మార్చేసి, ఆ వ్యక్తి స్థాపించిన ప్రతి పరిశ్రమకూ సబ్సిడీ అర్హత కల్పించాలి.


వీటితో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాల విడుదలలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. టీజీఐఐసీ భూ కేటాయింపుల్లో కనీసం 10శాతం ప్రత్యేక కోటాను ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తల కోసం కేటాయించాలి. ప్రోత్సాహకాల విడుదలలో ప్రాధాన్యతా క్రమాన్ని పాటించాలి. ఉదాహరణకు ఎ)తయారీ రంగం, బి) పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగం, సి) పరిశ్రమల ఎస్టేట్లు/ పార్కులు, డి) నిర్మాణ సంబంధిత సేవారంగం, ఇ) వస్తు రవాణా వాహనాలు. ఇంకా ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్‌ల కోసం ఎస్‌జీఎస్‌టీ వంద శాతం రియింబర్స్‌మెంట్‌ను అయిదేళ్లకు బదులు పదేళ్లపాటూ ఇవ్వాలి. భూమి, భవనం, యంత్రాల వంటి స్థిర మూలధన పెట్టుబడులకు ప్రోత్సాహం అర్హత కలిగి ఉన్నట్లే, కమర్షియల్ కాంప్లెక్స్‌కు అవసరమైన ఇతర ముఖ్య సౌకర్యాలు కూడా ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీకి అర్హతను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ సంస్థల కోసం అప్లికేషన్లు ఆటో డిలీట్‌ కాకుండా చూసుకోవాలి.

ఎస్సీ, ఎస్టీల పరిశ్రమల కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా భూమి/ ప్లాట్ల కేటాయింపునకు ప్రతిపాదిత అమలు మార్గదర్శకాలు: భూమి ఖరీదుపై పరిమితి లేకుండా 50శాతం రాయితీ ఇవ్వాలి. మిగిలిన మొత్తాన్ని రెండేళ్ల గడువు తర్వాత పది సమాన వార్షిక వాయిదాల్లో, ఏడాదికి 4శాతం వడ్డీతో చెల్లించేలా అవకాశం కల్పించాలి. సేల్ అగ్రిమెంట్ ఆధారంగా మార్ట్‌గేజ్ సౌకర్యంతో కలిపి సమ్మతి పత్రాన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు ఇవ్వాలి. లీజ్ అండ్ సేల్ అగ్రిమెంట్ కాలంలో వ్యాపారవేత్త డిస్కౌంట్ తీసివేసిన తరువాత మిగిలిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించగలిగితే, తక్షణమే సేల్ డీడ్ చేయాలి. టీజీఐఐసీ ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్ పార్క్/ ఐటీ పార్క్/ ఐడీఏలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పద్ధతి ప్రకారం లేదా లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించాలి. టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి చేయని భూమిని కేటాయించుకున్న ప్రైవేట్ ఇండస్ట్రీ పార్కుల్లో కూడా ఇదే రీతిలో కేటాయించాలి. రిజర్వ్ చేసిన ప్లాట్లు డీ–రిజర్వ్ చేయకూడదు. ఎందుకంటే అది రిజర్వేషన్ పాలసీకి విరుద్ధం.

అలాట్‌మెంట్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలి. వారు ఉత్పత్తి రంగంలోని కంపెనీలలో షేర్‌హోల్డర్లు అయి ఉండాలి. గత అయిదేళ్లలో కనీసం ఏదైనా ఒక సంవత్సరం రూ.20 కోట్లు వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలి. ఈ ప్రతినిధులు రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ విధానాలకు అనుగుణంగా ఉండాలి. కొన్ని ఇండస్ట్రియల్ పార్కులలో రిజర్వేషన్ అమలులోకి రాలేదు. అటువంటి సందర్భాలలో, మిగిలిన భూములు లేదా సోషల్ ఇన్‌ఫ్రా భూములు ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు కేటాయించాలి. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌లలోని దివాళా యూనిట్లను టీజీఐఐసీ స్వాధీనం చేసుకుని ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు తిరిగి కేటాయించాలి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ, ఎస్టీల ప్రతిపాదనలతో కూడిన పారిశ్రామిక విధివిధానాలను విడుదల చేయాలి.

నల్ల బాబు ఎస్సీ, ఎస్టీ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - Nov 22 , 2025 | 04:14 AM