Bail Denied: న్యాయం దక్కేనా
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:24 AM
దేశరాజధానిలో ఐదేళ్ళనాటి అల్లర్లకేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ ఇత్యాదులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది....
దేశరాజధానిలో ఐదేళ్ళనాటి అల్లర్లకేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ ఇత్యాదులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు హింసాత్మకంగా మారి, యాభైమందికి పైగా మరణించిన ఘటన విస్మరించలేనిది. వీరిలో అధికులు ముస్లింలేనన్న విషయాన్ని అటుంచితే, ఈ అల్లర్లకు బాధ్యులుగా, కుట్రదారులుగా 15మంది మీద చట్టవ్యతిరేక కార్యకలాపాలచట్టం (ఊపా) కింద కేసు నమోదైంది. ఖలీద్, షర్జీల్ బెయిల్ పిటిషన్లు మూడేళ్ళనుంచీ పెండింగ్‌లో ఉండగా, తాజావిచారణలో ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారిమీద ఏ మాత్రం జాలిపడనక్కరలేదంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్య సముచితమైనది. కుట్రలు చేసినవారిని వదిలిపెట్టమని ఎవరూ అనరు. వారిని శిక్షించవలసిందే. అయితే, ప్రభుత్వమూ, శక్తిమంతమైన దాని యంత్రాంగమూ, దాని న్యాయవాదులు, చివరకు న్యాయమూర్తులు ఏకరీతిగా, ఏకమాటగా నిందితులందరూ సంఘవిద్రోహశక్తులని అంతగట్టిగా నమ్ముతున్నా కూడా ఆ నిరూపణ ప్రక్రియ ఇప్పటివరకూ ఆరంభం కాకపోవడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. బెయిల్ పొందడానికి కూడా అనర్హులనీ, నిర్దోషులుగా తేలేవరకూ జైల్లో మగ్గడమే సరైనదంటూ అంత ఆగ్రహంగా ఊగిపోతున్న సొలిసిటర్ జనరల్ ఈ నిందితులందరినీ దోషులుగా నిరూపించేందుకు ఇంతవరకూ ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. ఐదేళ్ళుగా విచారణ జరపకుండా, బెయిల్ మంజూరు చేయకుండా నేరనిర్ధారణకు ముందే వారంతా శిక్షలు అనుభవించేట్టుగా చేయడం సామాన్యులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఇక సర్వోన్నత న్యాయస్థానమే దిక్కు అంటున్నారు ఉమర్ జీవిత భాగస్వామి బనోజ్యోత్స్న లాహిరి. విచారణ మొదలు కాకుండా ఐదేళ్లపాటు జైల్లో ఉంచడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి బెయిల్ ఇస్తుందని ఆమె ఆశించారు. బెయిల్‌కు అర్హతగా ఈ ఐదేళ్ళ అనధికారిక జైలుశిక్ష చాలదా? అంటున్నారామె. దిగువ కోర్టులు బెయిల్ ఇవ్వకపోవడం సరే, సర్వోన్నత న్యాయస్థానంలోనే గతంలో బెయిల్ పిటిషన్ రికార్డుస్థాయిలో వాయిదాపడింది. దాదాపు ఏడాదిన్నర జైలు జీవితం తరువాత, కర్కడుమా కోర్టు 2022 మార్చిలో తొలిసారిగా బెయిల్ నిరాకరించాక, అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టు కూడా కాదన్నాక, ఉమర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయవాదుల గైర్హాజరు, ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు వాయిదా, సమయం లేకపోవడం, సీనియర్ న్యాయవాదులు అందుబాటులోకి రాకపోవడం ఇత్యాది కారణాలతో ఒకే ఏడాదిలో పదిహేనుసార్లు ఉమర్ బెయిల్ పిటిషన్ పరిశీలనకు దూరంగా ఉండిపోయిన చరిత్ర ఉంది. చివరకు, గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన దానిని ఉపసంహరించుకొని, ఇతరత్రా వాదనలతో, కారణాలతో మళ్ళీ దిగువస్థాయినుంచి పోరాటం మొదలుపెట్టాడు.
బెయిల్ నియమం, జైలు మినహాయింపు అనే సూత్రం ఊపా వంటి కరుడుగట్టిన చట్టాలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసి, తదనుగుణంగా నిందితులకు బెయిల్ కూడా ఇచ్చి ఉన్నతంగా వ్యవహరించింది. నేర స్వభావంతో నిమిత్తం లేకుండా నిందితుడి బెయిల్ హక్కును కాపాడవలసిందేనని కూడా వ్యాఖ్యానించింది. సమీపకాలంలో విచారణ పూర్తికాబోదన్న సత్యం తెలిసికూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నవారి విషయంలో న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఎలా వ్యవహరించగలుగుతున్నాయో తెలియదు.
ఉమర్‌ఖలీద్ అరెస్టులో రాజకీయకుట్ర ఉందని ఆయన అభిమానులు, న్యాయవాదులు అంటారు. ఆయన శాంతియుతంగానే నిరసనలు వ్యక్తంచేశాడని, పౌరసత్వ చట్టానికే కాదు, పాలకులు భవిష్యత్తులో చేపట్టబోయే ఏకపక్ష, మైనారిటీవ్యతిరేక నిర్ణయాలపై ఎవరి గొంతూ లేవకుండా చేయడానికే ఈశాన్యఢిల్లీ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడిందని వారి వాదన. ఇక, జేఎన్‌యూ విద్యార్థిసంఘం నాయకుడుగా ఉన్నప్పటినుంచీ ఆయనమీద పాలకులు కక్షకట్టారని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ట్రిపుల్ తలాఖ్, కశ్మీర్ ఇత్యాది అంశాల్లో ఉమర్, ఆయన మిత్రబృందం తీవ్రమైన భాషతో ప్రభుత్వాన్ని నిలదీసిన మాట నిజం. ఘాటైన ప్రసంగాలు చేసినంతమాత్రాన దేశద్రోహులు అయిపోరు. ఉమర్‌ఖలీద్ దీర్ఘకాల అక్రమ నిర్బంధం ద్వారా ప్రశ్నించడం దేశద్రోహం, విమర్శించడం విప్లవం, నిరసించడం నేరం అని ప్రజలను అదుపాజ్ఞల్లో ఉంచడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ ఇవ్వడంతో పాటు, నిర్దిష్టకాలపరిమితిలోగా విచారణ ముగిసేట్టుగా సర్వోన్నత న్యాయస్థానం చర్యలు తీసుకోవాలి.