Share News

Israel Palestine Conflict: గాజా శాంతితో పాలస్తీనా ప్రభవించేనా

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:34 AM

గాజాలో ఎట్టకేలకు శాంతివీచిక వీస్తోంది. హమాస్‌ చెరలో బతికి ఉన్న ఇజ్రాయెలీలు స్వగృహాలకు చేరుకున్నారు. ఇజ్రాయెలీ సైనిక దళాలు..

Israel Palestine Conflict: గాజా శాంతితో పాలస్తీనా ప్రభవించేనా

గాజాలో ఎట్టకేలకు శాంతివీచిక వీస్తోంది. హమాస్‌ చెరలో (బతికి) ఉన్న ఇజ్రాయెలీలు స్వగృహాలకు చేరుకున్నారు. ఇజ్రాయెలీ సైనిక దళాలు, వైమానిక సేన తమ పాశవిక దాడులను (ప్రస్తుతానికి) నిలిపివేశాయి. క్రూర ముట్టడిలో అల్లాడిపోయిన పాలస్తీనియన్లకు మళ్లీ ఆహారం, ఔషధాలు, ఇతర సహాయ సామగ్రి అందుబాటులోకి రావడం ఆరంభమయింది. ఈ శుభ పరిణామాలకు హర్షించని వివేకశీలురు ఈ ధరిత్రిపై ఎవరుంటారు? అయితే గాజాలో కాల్పుల విరమణ ఒక చిన్న ముందడుగు మాత్రమే అని సమస్త దేశాల ప్రజలకూ తెలుసు. సుస్థిర శాంతికి ఇంకా ఎన్నో అవరోధాలు ఉన్నాయి. కష్టసాధ్యమైన గమ్యమది. ఆ దిశగా ప్రస్థానం చాలా కఠినమైనది. ఈ వాస్తవమూ ప్రపంచ శాంతికాముకులు అందరికీ తెలుసు. గాజాకు శాంతి పునరాగమిస్తున్న వేళ, పాలస్తీనియన్లు–యూదుల మధ్య ఘర్షణపై ముందుచూపుతో వ్యక్తం చేసిన భావాలు, అభిప్రాయాలు ఉన్న రెండు విశిష్ట పుస్తకాలను చదవడం తటస్థించింది. ఆ రెండూ 1980ల్లో ప్రచురితమయ్యాయి. విశాల దృక్పథంతో రాసిన పుస్తకాలవి. పాలస్తీనియన్ల–ఇజ్రాయెలీల ఘర్షణ గురించి నాలుగు దశాబ్దాలకు పూర్వం రచయితలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులకూ ఉపయుక్తమైనవి. వీటిలో మొదటిది దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు జో స్లోవో ఆత్మకథ. స్లోవో 1926లో లిథువేనియాలో జన్మించారు. 1930ల్లో యూరోప్‌లో యూదు వ్యతిరేక దమనకాండ తీవ్రమైనప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాకు వలసపోయి జోహాన్నెస్‌బర్గ్‌లో స్థిరపడింది. 1960ల్లో ప్రవాసానికి వెళ్లేదాకా స్లోవో ఆ నగరంలోనే నివసించారు. వర్ణ వివక్ష పాలన నుంచి విముక్తమైన తరువాత దక్షిణాఫ్రికాకు తిరిగివచ్చిన స్లోవో కొద్దికాలం నెల్సన్‌ మండేలా ప్రభుత్వంలో గృహ నిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. కేన్సర్‌ వ్యాధితో 1995లో మరణించారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం చివరిదశలో ఆయన ఇటలీలో మిత్ర రాజ్యాల తరఫున పోరాడారు. యుద్ధం ముగిసిన తరువాత కూడా సైనికుడుగా యూరోప్‌లో కొంతకాలం ఉన్నారు. 1946లో సైనిక విధుల నుంచి విడుదలైన తరువాత దక్షిణాఫ్రికాకు తిరిగివస్తూ ఇజ్రాయెల్‌ వెళ్లారు. అక్కడ ఒక కిబ్బుట్జ్‌ (సామూహిక జీవన గ్రామం)ను సందర్శించారు. టెల్‌ అవీవ్‌కు సమీపంలో ఉన్న కిబ్బుట్జ్‌ సామ్యవాద సమాజ జీవనశైలికి ప్రతిబింబంగా ఉందని స్లోవో అభిప్రాయపడ్డారు. కిబ్బుట్జ్‌లోని ఈ వెలుగునేకాకుండా చీకటి పార్శ్వాన్ని కూడా ఆయన గుర్తించారు. బైబిల్‌ ఆదేశాలలో ఒకటి ఆ కిబ్బుట్జ్‌ వాసుల ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తోందని స్లోవో రాశారు. పాలస్తీనా భూమిని మళ్లీ స్వాధీనం చేసుకోవడమనేది ప్రతి యూదు మతస్థుడి కర్తవ్యంగా ఉండాలన్నదే ఆ ఆదేశం. ఇరవయో శతాబ్ది పరిస్థితుల్లో ఆ ఆదేశానికి అర్థమేమిటి? పాలస్తీనాలో ఐదు వేల సంవత్సరాలకు పైగా నివసిస్తున్న వారినందరినీ పారద్రోలి ఆ భూమిని యూదు రాజ్యంగా చేసుకోవడమే. అంతిమంగా జరిగింది కూడా ఇదే కదా.


నేను చదివిన రెండో పుస్తకం– ‘One Earth, Four or Five Worlds : Reflections on Contemporary History’–- లో కూడా పాలస్తీనా సమస్య గురించి సంక్షిప్త అయితే ప్రభావదాయక వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పుస్తక రచయిత మెక్సికన్‌ కవి, నోబెల్‌ పురస్కార గ్రహీత, మన దేశంలో మెక్సికో రాయబారిగా పనిచేసిన ఆక్టావియో పాజ్‌. ఉభయ అమెరికా ఖండాలు, పశ్చిమాసియా, భారత్‌ చరిత్ర, సంస్కృతులపై విలువైన వ్యాసాలు ఉన్న పుస్తకమది. 1960ల్లోను, 1970ల్లోను పాలస్తీనియన్‌ గెరిల్లాలు ఇజ్రాయెల్‌ క్రీడాకారులను వధించారు, ఇజ్రాయెల్‌ పౌర విమానాలను హైజాక్‌ చేశారు. పాలస్తీనియన్‌ స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పోరాడుతున్న పీఎల్‌ఓ, ఇతర మిలిటెంట్‌ బృందాలు పాల్పడిన ఈ చర్యలను పాజ్‌ ఏ మాత్రం సమర్థించలేదు. ‘పాలస్తీనియన్లు అనుసరిస్తున్న పోరాట పద్ధతులు ఎటువంటి మినహాయింపు లేకుండా అసహ్యకరమైనవి. వారి విధానాల్లో మతోన్మాదం ఉన్నది. రాజీలేని మొండి వైఖరి లక్ష్యసాధనకు తోడ్పడుతుందా?’ అని ప్రశ్నిస్తూ ఆయన ఇంకా ఇలా వ్యాఖ్యానించారు: ‘అనుసరిస్తున్న పోరాట పద్ధతులు ఆమోదయోగ్యమైనవి కాకపోయినప్పటికీ స్వయం నిర్ణయాధికార హక్కుకై వారి డిమాండ్‌ పూర్తిగా న్యాయబద్ధమైనది’. ఈ పోరాటంలో ఎవరూ నిర్ణయాత్మక విజయాన్ని సాధించలేరు. యూదులు, పాలస్తీనియన్లు ఇరుగుపొరుగువారుగా ఉండి తీరక తప్పదు’ అని పాజ్‌ స్పష్టం చేశారు. పాజ్‌ ఈ వ్యాఖ్యలు చేస్తున్న కాలంలో పాలస్తీనా సమస్యకు రెండు దేశాల పరిష్కారం సాధ్యమని ఎవరూ భావించలేదు. 1967లో తాము ఆక్రమించుకున్న ప్రాంతాన్ని వదిలివేసేందుకు ఇజ్రాయెల్‌ ససేమిరా అంగీకరించలేదు. 1967కు పూర్వపు సరిహద్దులతోనైనా ఇజ్రాయెల్‌ను గుర్తించేందుకు పీఎల్‌ఓ అంగీకరించడం లేదు. పాలస్తీనియన్ల, ఇజ్రాయెలీల మొండివైఖరి నీతిబాహ్యమైనది, ఆచరణ సాధ్యంకానిదని పాజ్‌ గర్హించారు. పాలస్తీనా సమస్యకు సైనిక పద్ధతుల్లో ఏ నాటికీ పరిష్కారం లభించదని ఆయన స్పష్టం చేశారు. సుస్థిర శాంతికి, సమన్యాయానికి ప్రాధాన్యమిచ్చే సూత్రబద్ధ రాజకీయ చర్చల ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం లభించగలదని ఆయన అన్నారు. యూదులకు వలే పాలస్తీనియన్లకు కూడా మాతృదేశాన్ని కలిగి ఉండే హక్కు ఉందని పాజ్‌ కరాఖండీగా చెప్పారు.


పాలస్తీనియన్లు, యూదుల మధ్య ఎడతెగని ఘర్షణకు శాశ్వత పరిష్కారం ఏమిటి? తమ సొంత దేశంగా చెప్పుకోగల మాతృభూమిని ఇరువురూ పొందడం మాత్రమేనని పాజ్‌ నొక్కి చెప్పారు. ఇది సత్యం. ఆ మెక్సికన్‌ కవి ఈ నిజాన్ని వక్కాణించిన పది సంవత్సరాల తరువాత 1990వ దశకం ప్రథమార్ధంలో పీఎల్‌ఓ, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఓస్లో ఒప్పందాలపై సంతకం చేశాయి. ఇజ్రాయెల్‌ అస్తిత్వ హక్కును పీఎల్‌ఓ గుర్తించగా పాలస్తీనియన్లకు గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లలోని నిర్దిష్ట ప్రాంతాలు భాగంగా ఉండే ఒక దేశం అవసరమని ఇజ్రాయెల్‌ అంగీకరించింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఇజ్రాయెల్‌ రాజకీయంగా, ఆర్థికంగా మరింత శక్తిమంతమైన రాజ్యంగా పరిణమించడంతో పాటు ప్రాదేశికంగా విస్తరించింది. పాలస్తీనియన్లకు ఓస్లో ఒప్పందాలు అభయమిచ్చిన సొంత దేశం అనేది వారికి ఒక స్వప్నంగానే మిగిలిపోయింది. ఆ స్వప్న సాకారానికి అడుగడుగునా ఆటంకాలే. మాతృభూమి విముక్తికై పాలస్తీనియన్ల సమస్త ప్రయత్నాలు నిరర్థకమయ్యాయి. శాంతివాది అయిన ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి యితజాక్‌ రాబిన్‌ను జియోనిస్ట్‌ ఉగ్రవాది ఒకడు హతమార్చడంతో ఒస్లో ఒప్పందాలకు మొదటి చావుదెబ్బ వాటిల్లింది. ఆ వెన్వెంటనే వెస్ట్‌ బ్యాంక్‌కు ఇజ్రాయెలీ యూదుల వలసలు వెల్లువెత్తాయి. వలస వచ్చి స్థిరపడిన యూదులు పాలస్తీనియన్ల భూమిని స్వాధీనం చేసుకున్నారు. వారి చట్టవిరుద్ధ చర్యలకు ఇజ్రాయెల్‌ సైన్యం పూర్తిగా సహాయపడింది, ప్రోత్సహించింది, ఇతరత్రా మద్దతునిచ్చింది. గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లు ఇరుగు పొరుగు ప్రాంతాలు కాకపోవడమనే భౌగోళిక వాస్తవం పాలస్తీనియన్ల సొంత దేశం ఆవిర్భావానికి పూర్తిగా ఆటంకమయింది. కొత్తగా ఏర్పాటైన యూదు కాలనీలు పాలస్తీనియన్ల ఇక్కట్లను మరింతగా బాధాకరం చేశాయి. యూదుల నివాస సముదాయాలు ప్రబలిపోవడంతో వెస్ట్‌ బ్యాంక్‌ రెండు విభిన్న ప్రాంతాలుగా మారిపోయింది. ఒకదానిలో యూదులు సకల సౌకర్యాలతో ఇజ్రాయెల్‌ సైన్య సంపూర్ణ సంరక్షణలో సుఖదాయక జీవనాన్ని కొనసాగిస్తుండగా రెండో ప్రాంతంలో పాలస్తీనియన్లు నిత్యం వేధింపులు, హింసాత్మక దాడులకు గురవుతూ అభద్రతలో కునారిల్లిపోతుండడం జరిగింది. ఫలితంగా ఒకనాడు వర్ణవివక్ష రాజ్యమేలిన దక్షిణాఫ్రికాకు వెస్ట్‌ బ్యాంక్‌ ప్రతిబింబమైపోయింది. ఈ పోలిక పూర్తిగా న్యాయబద్ధమైనది.


యూదులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణపై జో స్లోవో ఆలోచనలు చాలా దూరదృష్టితో చేసినవి. 1980ల్లో ఆక్టావియో పాజ్‌ వ్యాఖ్యల్లో బహుశా, అంతకంటే ఎక్కువ ముందుచూపు ఉన్నది. పాజ్‌ ఇప్పుడు సజీవుడై ఉండి ఉంటే హమాస్‌ చర్యలను తప్పక ఖండించేవారు. గతంలో పాలస్తీనియన్‌ గెరిల్లా పోరాటకారుల పద్ధతుల కంటే హమాస్‌ అనుసరిస్తున్న పద్ధతులు చాలా ఉన్మాదపూరితమైనవని, అత్యంత అసహ్యకరమైనవని మరెవ్వరి కంటే ముందుగానే అంగీకరించి ఉండేవారనడంలో సందేహం లేదు. అయితే, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ సైన్యం పాల్పడుతున్న క్రూర దాడులను ఏ మాత్రం సమర్థించలేనివని ఆయన నొక్కిచెప్పేవారు. సొంత దేశాన్ని సాధించుకునేందుకు పాలస్తీనియన్ల పోరాట న్యాయబద్ధతను కూడా అవి కొట్టివేయలేవు. పాజ్‌ తన పుస్తకంలో ఒకచోట ఇలా పేర్కొన్నారు: ‘ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో ఫ్రెంచ్‌ కవి ఆండ్రే బ్రెటన్‌ (1896–1966) ఒక వ్యాసంలో ‘ప్రపంచం యూదు ప్రజలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది’ అని రాశారు. ఇది చదివిన క్షణం నుంచీ బ్రెటన్‌ మాటలు నా మనసులో నిలిచిపోయాయి. నలభై సంవత్సరాల అనంతరం ఒక సందర్భంలో ‘ఇజ్రాయెల్‌ విధిగా పాలస్తీనియన్లకు నష్టపరిహారం చెల్లించవలసి ఉంది’ అని చెప్పాను. మరో నలభై సంవత్సరాల తరువాత ఇది రాస్తున్న నేను పాజ్‌ అభిప్రాయాలకు రెండు సవరణలు చేయదలిచాను. మొదటిది, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో యూదులకు వ్యతిరేకంగా జర్మన్‌ నాజీలు పాల్పడిన మారణహోమం (హోలోకాస్ట్‌)కు ప్రాయశ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కాకుండా ముఖ్యంగా పశ్చిమ, తూర్పు యూరోపియన్‌ దేశాలు మాత్రమే యూదులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. రెండవది, (2025లో మరింత స్పష్టమయిన సత్యమిది) పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్‌తో పాటు, ఆ యూదు రాజ్య విస్తరణవాద, వలసవాద విధానాలను పూర్తిగా సమర్థించిన, పోత్సహించిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, మరీ ముఖ్యంగా అమెరికా నష్టపరిహారం చెల్లించితీరాలి.

రామచంద్ర గుహ

Updated Date - Oct 18 , 2025 | 04:34 AM