Share News

BarrageFailure: విఫలబ్యారేజీకి నీటి తరలింపా!?

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:18 AM

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంతో పాటు, గ్రావిటీ కెనాల్, సొరంగం, సుందిళ్ల అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్‌ సిద్ధం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది....

BarrageFailure: విఫలబ్యారేజీకి నీటి తరలింపా!?

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంతో పాటు, గ్రావిటీ కెనాల్, సొరంగం, సుందిళ్ల అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ అందుకు సంబంధించిన జీవో 278 జారీ చేశారు. డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలిచి, అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 80 టీఎంసీలు తరలించేలా మహారాష్ట్రతో సంప్రదించి 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మాజీ సీఎం వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపం పోసుకున్న ప్రణాళిక ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 71 కి.మీ. గ్రావిటీ కాలువ ద్వారా మైలారం దాకా వచ్చే నీటిని అక్కడ నుంచి 19 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసి, ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోయాలి. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం విరమించుకున్నది. తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు వచ్చే నీటిని 20.6 కి.మీ. మేర సొరంగం తవ్వి టేకుమట్ల వాగులో వేయనున్నారు. ఈ వాగు 11 కి.మీ. ప్రవహించి సుందిళ్ల బ్యారేజీలో కలుస్తుంది. సుందిళ్ల బ్యారేజీలో ఉన్న కాసిపేట పంపుల నుంచి ఎల్లంపల్లిలో ఎత్తిపోస్తారు. కానీ రూ.1600కోట్ల ఖర్చు తగ్గించుకునే పేరిట, ఇలా సుందిళ్లకు నీళ్లు తరలిస్తే, 100–150 టీఎంసీల భారీ నీటి సముదాయాన్ని ప్రకృతి శక్తిని భరించలేక, అక్కడ మేడిగడ్డ లాంటి ఘోర వైఫల్యం కచ్చితంగా తలెత్తవచ్చని ‘నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ’ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక హెచ్చరిస్తున్నది.

సుందిళ్ల ఒక విఫల బ్యారేజీ. 2019లో కేసీఆర్‌తో సహా ముగ్గురు ముఖ్యమంత్రులు సుందిళ్లతో పాటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ప్రారంభించారు. మొదటి సంవత్సరంలోనే సుందిళ్లతో సహా మూడు బ్యారేజీల పునాదులైన ఆఫ్రాన్, రాఫ్ట్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి. నీటి వేగాన్ని తగ్గించే హైడ్రాలిక్ జంప్ దిమ్మెలు భారీగా కొట్టుకుపోయాయి. 2019 నుంచి 2023 వరకు ఆఫ్రాన్, రాఫ్ట్‌, దిమ్మెలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. నాలుగో ఏటికల్లా మొత్తం దిమ్మెలు పూర్తిగా కనబడకుండా పోయాయి. మూడు బ్యారేజీలతో పాటు, సుందిళ్ల అడుగున అనేక బుంగలు పడ్డాయి. ఆ బుంగలలో సిమెంట్ గ్రౌటింగ్, పాలి యూరతిన్ గ్రౌటింగ్ చేసినా ప్రతి ఏటా వర్షాకాలంలో అవే బుంగలు తిరిగి పడుతూ, మరిన్ని కొత్తవి ఏర్పడుతున్నాయి.


నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ప్రఖ్యాత వైజ్ఞానిక సంస్థల నిపుణులతో కమిటీ వేసి పునర్ నిర్మాణం జరగకుండా నీటిని సుందిళ్లతో పాటు మూడు బ్యారేజీలలో నిలువ చేయకూడదని పేర్కొన్నది. నీళ్లు నింపితే బ్యారేజీలకు మొదటికే మోసం అని హెచ్చరించింది. మరి ఇప్పుడు ఎన్‌డీఎస్‌ఏ నివేదికను ధిక్కరించి, సుందిళ్లకు నీళ్లు తీసుకొచ్చే ప్రణాళికపై మరో విఫల కసరత్తు ఎందుకు చేస్తుందో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించాలి.

కేసీఆర్ అన్నీ తానై ఎవరి మాటా వినకుండా మూడు బ్యారేజీలు నిర్మించి ఘోర తప్పిదం చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా మైలారం నుంచి ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోయడం కాకుండా, సుందిళ్లకు తరలించడం ద్వారా కేసీఆర్ చేసిన తప్పిదాలనే పునరావృతం చేస్తున్నారు. భవిష్యత్తు ఏమిటో తెలియని సుందిళ్ల బ్యారేజ్‌కు తుమ్మిడిహెట్టి నీళ్లు తరలించడమూ, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తరలించడమూ రెండూ అత్యంత ప్రమాదకరమైనవే. నూతన తెలంగాణను కాళేశ్వరంతో కేసీఆర్ విధ్వంసం చేశారు. ఇప్పుడు సుందిళ్లకు నీళ్లు తరలించి రేవంత్‌రెడ్డి మరో విఫల ప్రాజెక్టుకు తెరలేపుతున్నారనిపిస్తున్నది.

విఫల బ్యారేజీల్లో ఒకచోట తలెత్తిన సమస్యను పునరుద్ధరించినా, మరోచోట బుంగలు పడవు అనే గ్యారెంటీ లేదు. మేడిగడ్డ ఏడవ బ్లాక్ పునాది అడుగున ఇసుక అంతా పైపింగ్ జరిగి, అంటే కొట్టుకుపోయి, ఎలా అయితే భారీ బుంగలు, రంధ్రాలు ఏర్పడ్డాయో, ఆ విధంగానే సుందిళ్లలో కూడా ఏర్పడుతాయి. ఇది ఎన్‌డీఎస్‌ఏ పేర్కొన్న విషయం. ఒక సైకిల్ రిపేర్ చేసినంత తేలికగా నిర్మాణ లోపం ఉన్న ప్రాజెక్టు పునాదులను మరమ్మతు చేయడం కుదరదు. ఎందుకంటే ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా ఉండవలసిన బ్యారేజీలన్నీ, తొందరపాటు వల్ల, అవినీతి వల్ల రిజిడ్ స్ట్రక్చర్స్‌గా మారాయి. భూ భౌతిక, భూ సాంకేతిక పరీక్షలు చేయనందున, డిజైన్‌కు తగ్గట్టు నిర్మాణం, నిర్మాణానికి తగ్గట్టు మెయింటెనెన్స్ లేనందున బ్యారేజీలన్నీ మరమ్మతులు చేసినా, అంత భారీ నీటి నిర్వహణను తట్టుకునే అవకాశం ఎంత మాత్రమూ లేదు.

నైనాల గోవర్ధన్

Updated Date - Nov 22 , 2025 | 04:18 AM