Share News

P Chidambaram: ప్రైవేట్‌ సంస్థలకే నిర్మాణ బాధ్యతలు

ABN , Publish Date - Jul 12 , 2025 | 01:19 AM

భారత్‌ ఇంగ్లాండ్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు ఆసక్తితో చూస్తుండగా ప్రముఖ సిమెంట్‌ కంపెనీ వాణిజ్య ప్రకటన ట్యాగ్‌లైన్‌ ఒకటి నన్ను విశేషంగా ఆకర్షించింది

P Chidambaram: ప్రైవేట్‌ సంస్థలకే నిర్మాణ బాధ్యతలు

భారత్‌–ఇంగ్లాండ్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు ఆసక్తితో చూస్తుండగా ప్రముఖ సిమెంట్‌ కంపెనీ వాణిజ్య ప్రకటన ట్యాగ్‌లైన్‌ ఒకటి నన్ను విశేషంగా ఆకర్షించింది. అదిలా ఉంది: ‘As India Builds, India Grows’. ఇది నూటికి నూరుపాళ్ల సత్యం. అవును, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ విస్తరణ మధ్య బలమైన సానుకూల సంబంధముంటుంది. రోడ్లు, వంతెనలు, రైల్వేలు, విమానాశ్రయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు మొదలైన వాటికి భవనాలు నిర్మించాలి. ఈ సామాజిక, సామూహిక సదుపాయాలను సమృద్ధిగా నిర్మించుకున్నప్పుడే ఆర్థిక వ్యవస్థ విస్తరణ సాధ్యమవుతుంది. ఈ మౌలిక సదుపాయాలను మనం సత్వరమే అభివృద్ధిపరచుకోవాలి. అయితే వాటిని ఎలా నిర్మించుకోవాలో మనం తెలుసుకుని తీరాలి.


జవహర్‌లాల్‌ నెహ్రూ ఒక గొప్ప నిర్మాత. ఆయనను ద్వేషించేవారు చేస్తున్న విమర్శలు నయా పైసా విలువలేనివి. 1947లో మన దేశ జనాభా 34 కోట్లు. అక్షరాస్యత రేటు కేవలం 12 శాతం. తన 17 ఏళ్ల ప్రధానమంత్రిత్వ కాలంలో నెహ్రూ ఎన్నో పాఠశాలలు, కళాశాలలు నిర్మించారు. ఐఐటీలు, ఐఐఎమ్‌లు, ఉక్కు కర్మాగారాలు, ఐఓసీ, ఓఎన్‌జీసీ, ఎన్‌ఎల్‌సీ, హెచ్‌ఏఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, ఇస్రో, భాక్రానంగల్‌, హీరాకుడ్‌, దామోదర్‌ వ్యాలీ, ఇంకా ఎన్నో సమున్నత సంస్థలు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు, పారిశ్రామిక సంస్థలకు ఆయనే అంకురార్పణ చేశారు, నిర్మించి అభివృద్ధిపరిచారు. ఇదంతా జరిగింది స్వాతంత్ర్య తొలి సంవత్సరాలలోను, అదీనూ విద్యా వ్యాప్తి చాలా తక్కువగా ఉన్న, సాంకేతికతలు అందుబాటులో లేని, మానవ వనరులకు నైపుణ్యాలు కొరవడిన కాలంలో అన్న వాస్తవాన్ని విస్మరించకపోతే నెహ్రూ నిర్మాణ సామర్థ్యం ఎంత మహోన్నతమైనదో అర్థమవుతుంది. నెహ్రూ నిర్మించినవి ఈ నాటికీ ఉన్నాయి, జాతి పురోగతికి అద్వితీయంగా దోహదం చేస్తున్నాయి. నెహ్రూ భారత్‌కు ఆర్థిక వనరులు తక్కువగా ఉండవచ్చునేమో కానీ, చిత్తశుద్ధి, అంకిత స్వభావం, ప్రతిభాపాటవాలు ఉన్న మానవవనరులు సమృద్ధిగా ఉన్నాయి.


క్రీస్తుశకం రెండవ శతాబ్దిలో చోళ చక్రవర్తి కావేరీ నదిపై గొప్ప ఆనకట్ట నిర్మించాడు. ప్రపంచంలో అత్యంత పురాతన ఆనకట్టలలో అదొకటి. నేటికీ ఉపయోగంలో ఉన్నది. వేలాది ఎకరాలకు సాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నది. అంతకంటే ముఖ్యంగా వరదల నియంత్రణకు ఇతోధికంగా తోడ్పడుతోంది. భారత్‌ నేటికీ ప్రతి రోజూ ఈ మహా నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నది. అయితే ప్రైవేట్‌ రంగంలో నిర్మాణాల, ప్రభుత్వ రంగంలో నిర్మాణాల నాణ్యత, మన్నిక మధ్య ఎంత వ్యత్యాసమున్నదో ప్రతి పౌరుడికీ బాగా తెలుసు. ఈ రెండు విధాల నిర్మాణ కార్యకలాపాలలోనూ కాంట్రాక్టర్లు పాల్గొంటున్నారు. అయితే వారు ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు వేర్వేరుగా ఉంటున్నాయి. నిర్మాణ ప్రక్రియలూ భిన్నమైనవి. ప్రజల ధనంతో ప్రభుత్వ రంగంలో జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాల తీరుతెన్నులను పరిశీలిద్దాం. ప్రైవేట్‌ నిర్మాణ కార్యకలాపాల నాణ్యత ఎంపిక చేసుకున్న ఆర్కిటెక్ట్‌, నియమించుకున్న కాంట్రాక్టర్‌, నిధుల లభ్యతపై ఆధారపడి భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ నిర్మాణ కార్యకలాపాలు, మరీ ముఖ్యంగా జాతీయ ప్రాధాన్యమున్న ప్రాజెక్టులకు భూమి, నిధుల పరంగా అవరోధాలు ఉండవు. అయితే మనం చూస్తున్నదేమిటి? హైవేలు, కొత్త రోడ్లు నిర్మాణమయి అవగానే కుంగిపోతున్నాయి. మురుగునీటిని తీసుకువెళ్లే కాలవలు లేదా గొట్టాలు పగిలిపోయి రోడ్లపై మురుగునీరు వెల్లువెత్తుతోంది. దేశ రాజధానిలోని అశోకా రోడ్డులో గత 18 నెలల్లో మురుగునీటి గొట్టాలు పగిలిపోవడం, రోడ్డు కుంగిపోవడం మూడుసార్లు సంభవించింది. రోడ్లు గుంతలమయమైపోతున్నాయి. ఆ బాటల్లో ప్రయాణిస్తున్న వాహనాలు ఆ గుంతల్లో పడిపోతున్నాయి. గ్వాలియర్‌లో రూ. 18 కోట్ల వ్యయంతో నిర్మాణమైన ఒక రోడ్డు 15 రోజులలోనే కుంగిపోయింది. గుజరాత్‌లోని మోర్బిలో మరమ్మతు నిర్వహించి వాహనాల రాకపోకలకు పునఃప్రారంభించిన ఒక వంతెన నాలుగు రోజులలోనే కూలిపోవడంతో 141 మంది మరణించారు. సరైన అర్హతలులేని కంపెనీకి ఆ వంతెన మరమ్మతు, పునరుద్ధరణ పనులను అప్పగించినట్టు విచారణలో వెల్లడయింది. సదరు కాంట్రాక్టర్‌ నాసిరకం సామగ్రిని ఉపయోగించడం వల్లే వంతెన కూలిపోవడం జరిగింది. బిహార్‌లో వంతెనలు నిర్మాణంలో ఉన్నప్పుడో లేదా నిర్మాణమైన వెంటనే కూలిపోతేనో ఆశ్చర్యపోయేవాళ్లు ఎవరూ ఉండరు సుమా! ఒక వంతెన అయితే నిర్మాణంలో ఉండగానే మూడుసార్లు కూలిపోయింది!


ఎంత సమయం, మరెంత ధనం వృథా! ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం జవాబుదారీతనం పూర్తిగా లోపించడమే. ఒక వినాశనకర ప్రాజెక్టుకు పలువురు అధికారులు బాధ్యులయితే అంతిమంగా ఆ నష్టానికి ఏ ఒక్కరూ జవాబుదారీ కాదు అన్న రీతిలో పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతారహితంగా వ్యవహరించడం సాధారణమైపోయింది. రాజకీయ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అపరిమిత ఆర్థిక లబ్ధిని సమకూర్చే మంత్రిత్వశాఖల విషయమై మంత్రుల మధ్య తీవ్ర పోటీ ఉంటోంది. చాలా రాష్ట్రాలలో ‘రేట్‌ కార్డ్‌’ ఉన్నది. ప్రాజెక్టులను అధ్వానంగా అమలుపరచడంలో కొన్ని విభాగాలు/ఏజెన్సీలు అప్రతిష్ఠను మూటకట్టుకుంటున్నాయి. ఈ విషయంలో పీడబ్ల్యూడీలు అగ్రగామిగా ఉన్నాయి. తక్కువ వ్యయ గృహ నిర్మాణాలు చేసే (ఇవి నిజానికి కాంక్రీట్‌ మురికివాడలు) డీడీఏ మొదలైన వాటి తీరుతెన్నులు కూడా ప్రశస్తంగా ఉండడం లేదు. హైవేస్‌, రైల్వేస్ పని తీరుకూడా ఇదే రీతిలో అధ్వానంగా ఉంటోంది.


ప్రభుత్వ రంగంలో నిర్మాణ కార్యకలాపాలు సమర్థంగా, ప్రజోపయోగకరంగా లేకపోవడమనేది ఒక క్లిష్ట సమస్య. అపరిష్కృతంగా కొనసాగుతున్న ఒక చిక్కుముడి. సాహసోపేతంగా అసాధారణ చర్యలు చేపట్టినప్పుడే అది పరిష్కారమవుతుంది. ఇందుకు సామాజిక, సామూహిక సదుపాయల నిర్మాణంలో ప్రభుత్వ ఏజెన్సీల ప్రమేయాన్ని దశల వారీగా తొలగించాల్సి ఉన్నది. ఇటువంటి ‘సంస్కరణల’కు గతంలో ప్రయత్నాలు జరిగాయి, విఫలమయ్యాయి. మరోసారి అటువంటి సంస్కరణలకు ప్రయత్నించినా మళ్లీ విఫలమవడం ఖాయం. మార్గాంతరమేమిటి? టెలీకమ్యూనికేషన్స్‌, విద్యుత్‌ పంపిణీ, రవాణారంగం, మైనింగ్‌, చమురు, సహజవాయువు అన్వేషణ తదితర రంగాలలో ప్రైవేటీకరణ పరిస్థితులను మెరుగుపరిచింది. నాణ్యమైన సేవలను అందించేందుకు దోహదం చేసింది. ప్రభుత్వ రంగంలో నిర్మాణ కార్యకలాపాలలోనూ అదే బాటను అనుసరించడం ఉత్తమం. తొలుత వ్యయాలు పెరగవచ్చు, నిర్మాణ సంస్థలు ఒక కూటమిగా ఏర్పడడమూ జరగుతుంది, సందేహం లేదు. అయితే లొసుగులు, లోపాలు సరిదిద్దుతూ సామూహిక, సామాజిక సదుపాయాల నిర్మాణంలో ఆరోగ్యకరమైన పోటీతో ప్రైవేట్‌ సంస్థలకు మరింత పాత్ర కల్పించడమే అన్ని విధాల శ్రేయస్కరం.

పి. చిదంబరం(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Jul 12 , 2025 | 01:19 AM