Indian Politics: కొత్త రాజకీయ పొద్దుపొడుపు ఎప్పుడు
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:10 AM
భారత దేశ రాజకీయాలు సంధి దశలో ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా సంభవిస్తున్న పరిణామాలు భావి రాజకీయాల తీరుతెన్నులు మారబోతున్నాయన్న సంకేతాల నిస్తున్నాయి.....
భారత దేశ రాజకీయాలు సంధి దశలో ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా సంభవిస్తున్న పరిణామాలు భావి రాజకీయాల తీరుతెన్నులు మారబోతున్నాయన్న సంకేతాల నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ శిబిరాల్లో కదలికలు అనేక ఊహాగానాలకు దారితీస్తున్నాయి. ఓట్ చోరీ ఆరోపణల తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్ప కాంగ్రెస్‌లో మరో నేత కనపడడం లేదు. బీజేపీపై రాహుల్ తదుపరి ఆరోపణలు ఏమి చేయనున్నారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఓట్ చోరీపై ఇప్పటి వరకూ రెండు సార్లు విలేఖరుల సమావేశం నిర్వహించి, ఆయన వెల్లడించిన అంశాలకు చాలా ప్రచారం లభించింది. రాహుల్ తదుపరి వదిలే హైడ్రోజన్ బాంబు గురించి కూడా ఆసక్తి వ్యక్తమవుతోంది. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కంటే పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్న తర్వాతే రాహుల్ గాంధీ చాలా జాగ్రత్తగా తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకుంటూ వస్తున్నారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర రెండింటిలోనూ మేధావులు, ప్రజల దృష్టిని రాహుల్ విశేషంగా ఆకర్షించారు. డీలాపడ్డ కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని సమకూర్చారు. రాహుల్ గాంధీ ఏమి చేస్తారన్న దానిపైనే తమ భవిష్యత్ ఆధారపడి ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
భారత్ జోడో యాత్రల తర్వాత సామాజిక న్యాయంపై రాహుల్ దృష్టి సారించారు. శాస్త్రీయమైన కులగణన జరిపి వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్న డిమాండ్‌ను లేవనెత్తారు. మరో వైపు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతోందన్న భావనను కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మోదీ తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాలను, చేస్తున్న వ్యవస్థల హననాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా రాహుల్ చేసిన విమర్శలు బాగా చర్చనీయాంశమయ్యాయి. నిన్నమొన్నటి దాకా కాంగ్రెస్‌కు వారసత్వమే గుదిబండగా కనిపించేది. అయితే ఇప్పుడు ఆ వారసత్వంపై నేతల ఆశలు చిగురిస్తున్నాయి. గత ఏడాది అహ్మదాబాద్ లోనూ, ఈ ఏడాది పాట్నాలోనూ నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల ద్వారా పార్టీకి పూర్వవైభవం తేవాలన్న ఆకాంక్షను పార్టీ కార్యకర్తల్లో రాహుల్ ప్రగాఢంగా రేకెత్తించారు. ఒకప్పుడు గుజరాత్, బిహార్‌లో జరిగిన ప్రజా ఉద్యమాలు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌ను దెబ్బతీసేందుకు కారణమయ్యాయి. ‘మోదీ స్వంత రాష్ట్రంలో బీజేపీని ఓడించడం అవసరం’ అని గత నెలలో గుజరాత్‌లో రాహుల్ ప్రకటించారు. గుజరాత్, బిహార్, ఒడిషాతో పాటు దేశమంతటా ‘సంఘటన్ సృజన్ అభియాన్’ పేరిట కాంగ్రెస్‌ను పటిష్ఠం చేసి, వ్యవస్థీకృత మార్పులు తెచ్చేందుకు రాహుల్ కీలక చర్యలు చేపట్టారు. అనేక రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయి నేతలతో రాహుల్ విడివిడిగా సంభాషిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలకు అభ్యర్థుల ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటామని చెప్పి వారిలో ఉత్సాహం నింపుతున్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కూడా తొలిసారి ఏఐసీసీ పరిశీలకులను నియమించడం ఒక కీలక పరిణామం.
పాట్నాలో ఒకప్పుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడుగా ఉన్న, మహాత్మాగాంధీ ఎన్నో చరిత్రాత్మక పోరాటాలు ప్రారంభించిన ‘సదాకత్ ఆశ్రమ్’ నిన్న మొన్నటి వరకు పాడుపడిపోయి ఉండేది. ఇప్పుడు దానికి పూర్వ కళ వచ్చేసింది. ఇటీవల ఏఐసీసీ విస్తృత వర్కింగ్ కమిటీ సమావేశం ఇదే భవనంలో జరపడం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కల్పించింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే రాహుల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇద్దరూ కలిసి అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం కల్పించే మేనిఫెస్టోను (అతిపిఛ్‌డా న్యాయ సంకల్ప్) విడుదల చేశారు. ఇటీవల పార్లమెంట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే ప్రతిపక్షాల కార్యాచరణను ప్రధానంగా రాహుల్ గాంధీయే నిర్దేశిస్తున్నారని స్పష్టమవుతోంది. ఆయన లేవనెత్తిన సామాజిక న్యాయ ఎజెండాను ఇతర ప్రతిపక్షాలు కూడా స్వీకరించినట్లు కనపడుతున్నది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీయే నిర్ణయించి, మిగతా ప్రతిపక్షాలను తనకు మద్దతుగా సమీకరించగలిగింది. రాహుల్ నిర్వహిస్తున్న సమావేశాలకు ప్రతిపక్ష నేతలు అందరూ హాజరవుతున్నారు. ఈ దేశంలో ప్రత్యామ్నాయ నేత రాహుల్ తప్ప మరొకరు లేరన్న విషయమై ప్రతిపక్షాలు పెద్దగా విభేదించడం లేదు. ఆర్జేడీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
మోదీ ప్రభుత్వంపై రాహుల్ చేస్తున్న పరుష విమర్శలకు సోషల్ మీడియాలో కూడా అధిక ప్రాధాన్యం లభిస్తోంది. గతంలో బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చాలా ప్రభావశీలమైన ప్రచారం చేసేది. ఇప్పుడు ఆ టెక్నిక్‌ను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కూడా నేర్చుకున్నాయి. రాహుల్‌ను అభిమానించే మీడియా విశ్లేషకుల బృందం ఆయన మాట్లాడిన మాటలకు సోషల్ మీడియాలో ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రాహుల్ మాట్లాడిన వెంటనే ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ నుంచి ప్రకాశ్‌రాజ్ వరకు అందుకుని ఆయనను సమర్థించడం ఒక పరిణామం. స్పష్టంగా చెప్పాలంటే దేశం ఇప్పుడు రాజకీయంగా, సైద్ధాంతికంగా బీజేపీ, కాంగ్రెస్ శిబిరాల మధ్య విడిపోతోంది. మోదీని వ్యతిరేకించేవారు, ద్వేషించేవారు కాంగ్రెస్ శిబిరంలో అనివార్యంగా చేరిపోతున్నారు. పార్టీలు కూడా అదే విధంగా విడిపోతున్నాయి. 2019లో 52 సీట్లు సాధించిన కాంగ్రెస్, 2024లో 99 సీట్లకు చేరుకుంది. 21.2 శాతం ఓట్లు సాధించి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో ఉన్నది. హిందీ బెల్ట్‌లోనూ, ఈశాన్యంలోనూ, మధ్య భారతంలోనూ, దక్షిణ భారతావనిలోను కాంగ్రెస్ ముద్రలు ఏదో ఒక రకంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఎలాగైనా మరో 50 లేదా 60 సీట్లు అదనంగా సాధించగలిగితే 2029లో కాంగ్రెస్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం నెలకొనడం ఖాయమన్న ఆత్మ విశ్వాసం ఆ పార్టీ నేతల్లో కనపడుతోంది.
అయితే కాంగ్రెస్ పుంజుకుంటున్నదన్న వాతావరణం కాంగ్రెస్ నేతల్లో ఏర్పడినంతగా జనంలో ఏర్పడుతున్నదా? ఇప్పటి వరకూ కనపడుతోంది సంకేతపూర్వక మార్పే కానీ అది పార్టీని ఒక ప్రజా ఉద్యమంగా మార్చగలిగిన పరిణామం కాదు. కాంగ్రెస్ పుంజుకోవడం వాపా, బలుపా అన్నది తేలాల్సి ఉన్నది. రాహుల్ వ్యక్తిగత ప్రతిష్ఠ పెరిగి ఉండవచ్చు కాని అంతే వేగంగా సంస్థాగత బలం పటిష్ఠమైందా? ఇది సహేతుకమైన అనుమానమే! ఎందుకంటే కాంగ్రెస్‌లో పాత కాలం రాజకీయాలు ఇంకా సమసిపోలేదు. పదవులకై అదే కాట్లాట, వృద్ధ నేతలు వైదొలిగి కొత్త వారికి అవకాశం కల్పించే పరిస్థితి పూర్తిగా రాలేదు. రాహుల్ విశ్వసనీయత పెరిగి ఉండవచ్చు కానీ ఇందిరాగాంధీ లాగా ఒక ప్రజాప్రభంజనాన్ని సృష్టించగలిగిన నాయకత్వం కాంగ్రెస్‌కు రాలేదు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ యత్నాలకు తోడుగా పార్టీని బలపరిచేందుకు అంతగా కష్టపడడం లేదు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతమై ప్రతి చోటా ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఇంకా ఏర్పర్చుకోవల్సి ఉన్నది. బిహార్, ఒడిషా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర చోట్ల పార్టీ వ్యవస్థ బాగా బలహీనమై నాయకులు లేని దుస్థితికి చేరుకున్నది. నాయకత్వాన్ని మరింత వికేంద్రీకరించి, సాహసోపేతమైన సైద్ధాంతిక ఎజెండాను కల్పించి, విశ్వసనీయ జాతీయ ప్రత్యామ్నాయంగా రూపొందించే దారిలో కాంగ్రెస్ ఇంకా అనేక చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. ఏఐసీసీ కార్యాలయం ఇప్పటికీ జీవకళ కోల్పోయిన నెలవులా కనపడుతోంది. ఒకప్పుడు అక్కడకు ఎప్పుడు వెళ్లినా ఎంతో మంది తచ్చాడుతూ కనిపించేవారు. అక్కడ నాయకులను కలిస్తే తమ పనులు అయిపోతాయన్న ఆశతో వచ్చేవారు.
మీడియాను కలిసి రాజకీయ పరిణామాలను విశ్లేషించే మేధావులు ఉండేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్లడం అనవసరమనే భావన కనిపిస్తోంది. ఢిల్లీలోని దీనదయాళ్ మార్గ్‌లో బీజేపీ ఇప్పటికే ఒక అధునాతన ఆకాశ హర్మ్యాన్ని నిర్మించుకుని ఎవరికీ తెలియని రహస్య నిర్ణయాలు తీసుకునే నెలవుగా దానిని మార్చింది. ఒకప్పుడు అశోకా రోడ్ లోని బీజేపీ కార్యాలయానికీ, ఈ కార్యాలయానికీ ఎంతో తేడా కనిపిస్తోంది. అదే పరిస్థితి అక్బర్ రోడ్ లోని కాంగ్రెస్ కార్యాలయానికి, దీనదయాళ్‌లో కాంగ్రెస్ నిర్మించుకున్న అధునాతన కార్యాలయానికీ తేడా కనిపిస్తోంది. రెండూ కార్పొరేట్ భవనాల్లా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండు ప్రధాన పార్టీలు అవలంబిస్తున్న వైఖరి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే బీజేపీ అనేక విషయాల్లో ఆత్మరక్షణలో పడిందన్న విషయం వాస్తవం. అంతర్గత సమస్యలు, ఎన్నికల అక్రమాల నుంచి విదేశాంగ విధానం వరకు ప్రతిపక్షాలు లేవనెత్తే అనేక ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్నది. నిజమే కానీ ప్రతిపక్షాలు ఊహించినంత వేగంగా మోదీ గ్రాఫ్ పడిపోలేదు. మోదీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు తాత్కాలికమైనవేనని, ఆయన వాటి నుంచి బయటపడి మళ్లీ పుంజుకుంటారని భావిస్తున్నవారు ఎందరో ఉన్నారు. హిందూత్వ ఆధారంగా మోదీని అభిమానించే జనం అంతగా తగ్గిపోలేదు.
-ఎ. కృష్ణారావు