Share News

Medical Students: విదేశీ వైద్యవిద్యార్థుల సమస్యలకు పరిష్కారమెప్పుడు?

ABN , Publish Date - Jul 17 , 2025 | 01:20 AM

విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూలై ఒకటి నుంచి ఉద్యమ బాట పట్టారు. వీరి సమస్యలపై కేంద్ర..

Medical Students: విదేశీ వైద్యవిద్యార్థుల సమస్యలకు పరిష్కారమెప్పుడు?

విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూలై ఒకటి నుంచి ఉద్యమ బాట పట్టారు. వీరి సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు జోక్యం చేసుకోలేదు. వైద్య విద్య పర్యవేక్షణ, నియంత్రణ సంస్థలైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ), రాష్ట్రంలోని మెడికల్ కౌన్సిల్ (ఏపీఎంసీ) సమస్యను పరిష్కరిస్తామంటూనే జాప్యం చేస్తున్నాయి. ఇప్పటికే 13 నెలల విలువైన సమయం వృథా అయిందని, నీట్ పీజీ పరీక్ష అర్హత కోల్పోతున్నామంటూ ఈ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో ఏటా 14 లక్షల మందికి పైగా విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘నీట్’ పరీక్ష రాస్తున్నారు. అయితే దేశంలో 1,18,000 సీట్లు మాత్రమే ఉన్నందువల్ల కొంతమంది సీటు సంపాదించలేకపోతున్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ‘బి’ కేటగిరీ సీట్లు తక్కువగా ఉండి, ఫీజులు చాలా ఎక్కువగా ఉండటంతో అనేక మంది విద్యార్థులు వైద్యవిద్య అభ్యసించేందుకు రష్యా, ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్, జమైకా, కజికిస్థాన్ వంటి విదేశాలకు వెడుతున్నారు. ఇందుకు కూడా ‘నీట్’లో తప్పక క్వాలిఫై అయి ఉండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం విధించింది. కొందరు బ్యాంకు రుణాలతో, మరికొందరు ఆస్తులు తాకట్టుపెట్టి ప్రైవేటు రుణాలు తీసుకొని విదేశాలకు వెడుతున్నారు.


విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా ‘ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్’ (ఎఫ్ఎంజీ) పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో 15 నుంచి 20 శాతం మించి విదేశీ వైద్యవిద్యార్థులు ఉత్తీర్ణులైన సందర్భాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఫైనల్ ఇయర్ పరీక్షకు బదులు స్వదేశీ, విదేశీ విద్యార్థులకు ఒకే పరీక్ష ‘ఎగ్జిట్ ఎగ్జామ్’ పెట్టాలని ‘నేషనల్ మెడికల్ కమిషన్’ సూచించినా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వంటి వైద్య వృత్తి సంస్థలు, దాఖలు అయిన కొన్ని వ్యాజ్యాల వల్ల ఆ నిర్ణయం ఇంతవరకు అమలు కాలేదు. ‘కరోనా’ మహమ్మారితో విదేశీ వైద్య విద్యార్థులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వదేశానికి రప్పించాయి. ఆ తర్వాత కరోనా తగ్గినా వారిని తిరిగి వెళ్ళమని మన దేశం ప్రకటించలేదు. అయితే కొందరు మళ్లీ ఆయా దేశాలకు వెళ్లి మరో సంవత్సరం అదనంగా ఫీజులు చెల్లించి ఫైనల్ ఇయర్, ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసి వచ్చారు. మరికొందరు ఆన్‌లైన్‌లో పూర్తి చేశారు. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లలో పూర్తి చేసినవారు ఎఫ్ఎంజీ పరీక్ష రాసి, పాసైనా కూడా తిప్పలు తప్పడం లేదు.


2023లో రాష్ట్రాల కౌన్సిళ్లకు ఎన్ఎంసీ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కూడా మరికొన్ని ఆదేశాలను జారీ చేసింది. వీటిలో ఏ ఆదేశాలను అమలు చేయాలి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల మెడికల్ కౌన్సిళ్లు అమలు జరిపిన ఆదేశాల మాటేమిటి? ఏ ఆదేశాలు అయినా తూ.చా. తప్పక పాటించాలా? ఏమైనా మార్పులు చేసుకోవచ్చా? అన్నది స్పష్టం చేయలేదు. అందువల్ల రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రాష్ట్రాలు ఎఫ్ఎంజీ పరీక్ష పాస్ అయిన వారందరికీ ఒకే సంవత్సరం ఇంటర్న్‌షిప్ కేటాయించాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎన్‌ఎంసీ రూల్స్ తూ.చా. తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలలకు ఆరుగురు నామినేటెడ్ సభ్యులతో మెడికల్‌ కౌన్సిల్ ఏర్పాటు అయి, ఎఫ్ఎంజీ విద్యార్థులపై దృష్టి సారించి, ప్రత్యేక కమిటీని కూడా వేశారు. కమిటీ కూడా ఎన్ఎంసీ నిబంధనలు అంటూ ఒక సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్ల క్లర్క్‌షిప్, ఇంటర్న్‌షిప్ అంటూ ప్రతిపాదించింది. దీంతో తమకు అనుకూల నిర్ణయం వస్తుందని ఆశించిన విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. కరోనా సమయంలో విదేశీ విద్యార్థులకు లాగానే, మన దేశంలోని వైద్య విద్యార్థులకు కొన్ని నెలల పాటు ఆన్‌లైన్ విధానంలో క్లాసులు జరిగాయి. అయితే పరీక్షలు లేటుగా నిర్వహించినందున ఆ సమయం కాంపన్సేట్ చేశారని అంటున్నారు. విదేశీ వైద్యవిద్యార్థులు కొందరు ఆ దేశాల వైద్య కళాశాలల నుంచి కాంపన్సేట్ సర్టిఫికెట్లు తీసుకువచ్చినా, వాటిపై ఏపీ మెడికల్ కౌన్సిల్ వివిధ రకాల అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ ఆమోదించడం లేదు. విదేశీ వైద్య విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించి విలువైన సమయాన్ని కాపాడాలని ఇప్పటికే ఐఎంఏ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ (అప్నా) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.


కరోనా కారణంగా విదేశీ వైద్య కళాశాలలో కొందరు ఆన్‌లైన్ విధానంలో ఫైనల్ ఇయర్, ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేశారు. పాసైన వారికి ఆ కళాశాలలు డిగ్రీ సర్టిఫికెట్స్ ఇచ్చాయి. అలా ఆన్‌లైన్ విధానం ద్వారా చేసిన వారికి మన దేశంలో కరోనా సమయంలో రెండు సంవత్సరాలు మళ్లీ క్లర్క్‌షిప్, తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ అంటే అప్పటికే ఆరున్నర ఏళ్లు చదివిన విద్యార్థులు మరో రెండు లేదా మూడేళ్లు చదవాల్సి వస్తే 8 నుంచి 9 ఏళ్ల టైం పడుతుందని వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. క్లర్క్‌షిప్ చేసే విదేశీ వైద్య విద్యార్థుల నుంచి నెలకు 5 వేలు లేదా ఆ లోపు ఫీజులు కూడా కళాశాలలు తీసుకోవచ్చు అని ఎన్ఎంసీ ఆదేశాలలో పేర్కొంది. ‘మూలిగే నక్క మీద తాటిపండు పడింది’ అన్న చందంగా అసలే వారు ఆర్థిక సంక్షోభంలో ఉంటే మళ్లీ ఈ ఫీజులు ఏమిటని ఆవేదన వ్యక్తం అవుతోంది. వీరి పరిస్థితి ఇలా ఉంటే... ఇంకా ఎఫ్ఎంజీ పరీక్ష పాస్ కాని 80 నుంచి 85శాతం విద్యార్థుల పరిస్థితి ఏమిటని... అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక బ్యాంకుల్లో విద్యా రుణాలు తీసుకున్న వారిని రీపేమెంట్ చేయమని బ్యాంకులు వేధిస్తున్నాయి. ప్రైవేట్‌గా అధిక వడ్డీకి తెచ్చి ఫీజులు కట్టిన వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఎటూ పాలుపోని స్థితిలో ఆ విద్యార్థులు ధర్నాకు దిగారు. వారి ఆందోళనను, భవిష్యత్తును, ఆర్థిక, మానసిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించవలసిన అవసరం ఉంది. ఏపీఎంసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఎన్‌ఎంసీకి ఆమోదం కోసం పంపితే స్పందన కరువైంది. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడో అర్థం కావడం లేదు.


అసంపూర్తి క్లినికల్ ట్రైనింగ్ పేరుతో ఒకటి, రెండు సంవత్సరాలు క్లర్క్‌షిప్ చేయమనడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. అంతేగాక విదేశీ వైద్య విద్యార్థులు ఎఫ్ఎంజీ లాంటి కఠినమైన పరీక్ష పాస్ అయి వస్తున్నారు. వారందరికీ మన దేశంలో ఒక సంవత్సరం తప్పనిసరిగా ఇంటర్న్‌‌షిప్ చేయమనడం సమంజసం. ఎందుకంటే అక్కడ ఉండే వ్యాధులు, విధానాలు, ఇక్కడ వాటికి కొంచెం భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా మన దేశ విద్యార్థులతో పాటు వారికి కూడా అదే స్థాయిలో స్టైఫండ్ చెల్లించడం సమంజసం. కొన్ని రాష్ట్రాలు స్టైఫండ్ ఇస్తున్నాయి. ఏదేమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి విదేశీ వైద్య విద్యార్థుల సేవల్ని సత్వరమే ఉపయోగించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

-డాక్టర్ టి. సేవకుమార్ వ్యవస్థాపకులు,

సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్

Updated Date - Jul 17 , 2025 | 01:20 AM