Share News

ఎన్‌కౌంటర్లలో మరణించేది మానవత్వం ప్రజాస్వామ్యం కూడా!

ABN , Publish Date - May 27 , 2025 | 01:16 AM

ఇటీవల జరిగిన ‘ఎన్‌కౌంటర్’లో 27 మంది మావోయిస్టులు చనిపోయారని, వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు కూడా మృతి చెందారని కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. హోం మంత్రి, ప్రధానమంత్రి ఇద్దరూ ఈ ‘ఘనత’కు కారణమైన....

ఎన్‌కౌంటర్లలో మరణించేది మానవత్వం ప్రజాస్వామ్యం కూడా!

ఇటీవల జరిగిన ‘ఎన్‌కౌంటర్’లో 27 మంది మావోయిస్టులు చనిపోయారని, వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు కూడా మృతి చెందారని కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. హోం మంత్రి, ప్రధానమంత్రి ఇద్దరూ ఈ ‘ఘనత’కు కారణమైన తమ బలగాలను బహిరంగంగా అభినందించారు. విజయోత్సాహంతో తమ విధానాన్ని పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా మావోయిస్టు పార్టీ మీద యుద్ధం ప్రకటించి, ఏకపక్షంగా దాడి చేస్తూ వారిని తుదముట్టిస్తోంది. మావోయిస్టుల మార్గంతో చాలామంది విభేదించవచ్చు. ఈ అత్యాధునిక సాంకేతికతల నేపథ్యంలో, దేశంలోని సగటు ప్రజలు గతంలో కంటే సాపేక్షికంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో మావోయిస్టు పార్టీ ఇప్పుడు అవలంబిస్తున్న మార్గం బహుశా కాలం చెల్లిపోయినది కూడా కావచ్చు. మావోయిస్టుల కారణంగా ఒకానొక కాలంలో ప్రత్యక్షహింస పెరిగి ఉండవచ్చు. అదే సమయంలో వారు పాల్పడ్డ నిరర్థక హింస కంటే వారు అనుభవించిన హింస శాతమే ఎక్కువ. సమసమాజ స్థాపనకు ఎంత దూరంలో ఉన్నా, తమ మార్గంలో వారెప్పుడూ నోరులేని, అత్యంత బలహీనవర్గాల పక్షమే అనేది ఎవరూ కాదనలేని సత్యం. మరి ఈ రోజు పరిపాలకులుగా ఉన్న వారి చరిత్ర ఏమిటి? వారు కాపాడుతున్న కార్పొరేట్ల చరిత్ర ఏమిటి? ప్రభుత్వంతో చర్చిస్తామని, అందుకు అవకాశం కల్పించాలని మావోయిస్టులు రెండు నెలలుగా అభ్యర్థిస్తున్నారు.


మావోయిస్టులతో ప్రభుత్వం చర్చించి ఈ వివాదానికి ఒక శాంతియుత, రాజకీయ పరిష్కారాన్ని సాధించాలని తెలంగాణ సహా దేశంలోని ప్రజాస్వామిక వాదులందరూ కోరుతున్నారు. మావోయిస్టులు ఈ యుద్ధంలో పూర్తిగా ఓడిపోతున్న సందర్భంలో మాత్రమే చర్చల ప్రస్తావన తీసుకువస్తున్నారని, వారేమీ శాంతికాముకులు కాదు కాబట్టి చర్చలు చేయాల్సిన అవసరం లేదని పాలక పార్టీ మేధావులు తీర్పులిస్తున్నారు. అవును, వారు బలహీనపడే అడుగుతున్నా, వారితో మాట్లాడితే తప్పేమిటి? యుద్ధానంతర ఒడంబడికలన్నీ అలాగే కదా జరిగేది. ఇక్కడా అదే నీతి వర్తిస్తుంది. అది సాధ్యమైతే ఇప్పటికైనా మరింత రక్తపాతం ఆగుతుంది కదా! అది సాధించిన వారు చరిత్రలో చాలా రక్తపాతాన్ని ఆపిన ఉత్తమ పరిపాలకులుగా నిలిచిపోతారు కదా! బలహీన పక్షంపైన బలంగా ఉన్న ప్రభుత్వం ఎన్ని షరతులైనా పెట్టవచ్చనేది లోకజ్ఞానంలోని విషయమే. తమ ఆధిపత్యానికి అడ్డంకిగా ఉన్న వారిని అంతం చేసి మాత్రమే అడ్డు తొలగించుకోవడం ఆటవిక జాతుల నీతి. ఆ సమస్యను చర్చించి, రాజకీయంగా పరిష్కరించుకోవటం మానవీయ, ప్రజాస్వామ్య నీతి. మావోయిస్టులు తిరిగి బలపడతారనేది మరో వాదన. వారు రాజకీయంగా బలపడితే బలపడవచ్చు. కానీ సాయుధంగా బలపడతారనేది చర్చలకు వెళ్లకుండా ఉండటానికి చెప్పే సాకు మాత్రమే. కొన్ని సార్వజనీన, మానవీయ, ప్రజాస్వామ్య విలువలను, సూత్రాలను పరిపాలకులైనా, వారిని ధిక్కరించే వారైనా పాటించి తీరాలని కోరుకోవడం, ఆ రకమైన విమర్శ చేయడం పౌరసమాజం బాధ్యత. చైతన్యం గల పౌరసమాజాన్ని కలిగిన దేశాల్లోని ప్రభుత్వాలే ప్రజలకు జవాబుదారీగా ఉండగలవు. ఆ దేశాల్లోనే ప్రభుత్వాలు తమ సొంత ప్రజలపై యుద్ధం చేయవు. అటువంటి దేశంలోనే ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, భద్రత, జీవ వైవిధ్యం, పర్యావరణం, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు సజీవంగా ఉంటాయి. మన మధ్య అలాంటి విలువలను నెలకొల్పుకోగలమా? పాలకులను ప్రజాస్వామ్యం అనే దారిలోకి తేగలమా?!

డా. ఎస్.తిరుపతయ్య,

మానవ హక్కుల వేదిక

ఇవి కూడా చూడండి

నక్సలైట్లపై సీజ్ ఫైర్ ప్రకటించాలి

తెలంగాణలో వానలే వానలు

Updated Date - May 27 , 2025 | 01:16 AM