Share News

G Venkata Narayana Poetry Debate: అసలేమిటీ స్వచ్ఛమైన కవిత్వం

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:39 AM

శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కన్నా ఆయన తొలి కవిత్వ సంపుటి ‘ప్రభవ’ లోనే కవిత్వం ఎక్కువనీ, మయకోవ్‌స్కీ కమ్యూనిస్టు కాకముందు గొప్ప కవిత్వం రాశాడనీ ఇస్మాయిల్ అన్నట్టు, ఇప్పుడు కూడా రాజకీయ భావజాలాలతో కవిత్వం రాస్తే...

G Venkata Narayana Poetry Debate: అసలేమిటీ స్వచ్ఛమైన కవిత్వం

శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కన్నా ఆయన తొలి కవిత్వ సంపుటి ‘ప్రభవ’ లోనే కవిత్వం ఎక్కువనీ, మయకోవ్‌స్కీ కమ్యూనిస్టు కాకముందు గొప్ప కవిత్వం రాశాడనీ ఇస్మాయిల్ అన్నట్టు, ఇప్పుడు కూడా రాజకీయ భావజాలాలతో కవిత్వం రాస్తే, అందులో కవిత్వస్థాయి తగ్గుతుందనే అభిప్రాయం మారినట్లు లేదు. అంటే భావ కవిత్వమే నిజమైన కవిత్వమనుకోవాలా? భావకవిత్వం గురించే ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈ కవిత్వాన్ని మాత్రమే కవిత్వం అనుకునే అభిప్రాయాలు ఉన్నాయి, ఈ కవిత్వం వైపు నుంచే రాజకీయ– సామాజిక కవిత్వ స్థాయిని అంచనా కట్టడం చూస్తూ ఉన్నాను.

సాధారణంగా రాజకీయ–సామాజిక కవిత్వం రాస్తున్నవాళ్ళు భావ కవిత్వం రాసేవాళ్ళని కవులుగా వారి తీరుని ఒప్పుకోరు గానీ వారి కవిత్వాన్ని శంకించిన దాఖలాలు తక్కువ. కానీ రాజకీయ –సామాజిక కవుల తీరుని ఒప్పుకొనే భావకవులు, వారి కవిత్వాన్ని మాత్రం శంకిస్తారు.

ఇదో భిన్నమైన అభిప్రాయాల మిశ్రమం. అయితే ఇవి రెండు శిబిరాల నుంచి వెల్లువెత్తుతున్న, అవతలి వారిని దెబ్బ కొట్టడానికి వాడే అభిప్రాయాలు మాత్రమే కాదు. ఇవి ఒక శతాబ్దకాలంగా ఈ రెండు రకాల కవులకు పరస్పరం ఏర్పడిన నిశ్చిత అభిప్రాయాలు. ఈ భిన్నాభిప్రాయాల వలన ఒకరి మీద ఒకరికి సరైన గౌరవమైనా ఉంటుందా అని ఒక అనుమానం. ఇక్కడ ‘ఒకరి మీద ఒకరికి’ అంటే దాని అర్థం వారి వారి కవిత్వాల విషయంలో అన్నది ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు.


అయితే మరి ఈ రెండు అభిప్రాయాల ప్రాతిపదికగా దేన్ని స్వచ్ఛమైన కవిత్వం అనగలం? కవిత్వం అంటే ఏమిటి అని ఆలోచిస్తే– అది కేవలం అలంకారప్రాయమైన పదాల సమాహారం కాదనేది స్పష్టం. ఒక వాక్యం నీలో తాజాదనాన్ని కలిగిస్తుందా లేదా అనేది ముఖ్యమే. ఉపమలను మాత్రమే కవిత్వం అనుకొనే రోజుల్ని కవిత్వం ఎప్పుడో దాటి వచ్చింది. భావాన్ని గాఢంగా, మూస వాక్యాల నిర్మాణంలో చెప్పకపోవడం అనుభూతి కలిగించవచ్చు. అయితే తాజా వాక్యాల సమాహారం కూడా కవిత్వం కాదు. 20వ శతాబ్దం కవిత్వానికీ 21వ శతాబ్దం కవిత్వానికీ మధ్య చాలా మార్పు ఉంది. వ్యక్తీకరణ, దాని స్వరూపం మారింది. అప్పటి బైరాగి కవిత్వానికి, ఇప్పుడు నరేష్కుమార్ సూఫీ కవిత్వానికి చాలా మార్పు ఉంది. అలాగే అప్పటి రాయప్రోలు కవిత్వానికి, ఇప్పటి మానస చామర్తి కవిత్వానికి చాలా మార్పు ఉంది. అయితే ఈ కవిత్వాల్లో పట్టాలు (tracks) ఎక్కువ మారలేదు. బైరాగి మానవుని ఏకాంతలోతుల్ని, ఆధునిక రాజకీయ స్మరణని కలిపి రాశాడు. కానీ తర్వాత అది రెండు మార్పుల్ని సంతరించుకుంది. రాజకీయ కవిత్వంగా, మానవుని ఏకాంత కవిత్వంగా రెండు భాగాలుగా విడివడింది. అయితే రాజకీయ కవిత్వం మానవుడి గురించి మాత్రమే చెప్పే కవిత్వాన్ని ఒప్పుకోదు. మానవుడి ఒంటరితనాన్ని చెప్పే కవిత్వాన్ని, భావ కవిత్వాన్ని ఒకే గాటన కడుతుంది. అందువల్ల ఈ ఒంటరితనం కవిత్వం రాజకీయ–సామాజిక కవిత్వానికి దూరంగా జరిగి, భావకవిత్వానికి దగ్గరగా అంటే ఒక నైబర్‌గా వచ్చి చేరింది.

అయితే భావకవిత్వానికి పాయలు లేకపోలేదు. అప్పటి బసవరాజు అప్పారావు దగ్గర నుంచి ఇప్పటి నందకిశోర్ వరకూ వీళ్లు ప్రేమ కవిత్వం రాసినా ఇది పదకవిత్వంగా ఒక ప్రత్యేక పాయగా ప్రాచుర్యం పొందింది. భావకవులకు ఉన్నంత గుర్తింపు ఈ పద కవులకు ఉన్నా, కవిత్వ ప్రాచుర్యం పరంగా భావకవిత్వమే ఒక అడుగు ముందు ఉంది.

రాజకీయ–సామాజిక కవిత్వం తర్వాతి రోజుల్లో కొన్ని మార్పులను అందుకుంది. అస్తిత్వ ఉద్యమాల ప్రభావంతో నోస్టాల్జియా కవిత్వం వచ్చింది. అణచివేతకు గురైన కులాల నుంచి ఇంటి, ఊరి, కుల స్పృహతో వచ్చిన ఈ సాహిత్యం రాజకీయ–సామాజిక కవిత్వంగా నిలిచింది. ఇదే సందర్భంలో అగ్రకులాల నుంచి వచ్చిన నోస్టాల్జియా కవిత్వం మాత్రం కేవలం నోస్టాల్జియాలా మిగిలిపోయింది. అయితే రాజకీయ–సామాజిక కవిత్వపరంగా రెండు ముఖ్యమైన శిబిరాలుగా మారింది అభ్యుదయ, అస్తిత్వ సాహిత్యాలే. ఇందులో రాజకీయ–సామాజిక కవిత్వం, అస్తిత్వవాద సాహిత్యాన్ని నోస్టాల్జియా పరిధిని దాటి విశాలమైన ప్రాపంచిక దృక్పథంతో రాయమని కోరుతూ ఉంటుంది. ఇది మార్క్స్, అంబేడ్కర్‌ చట్రంలోంచి మాత్రమే చూడటం వలన వచ్చిన పొరపాటు. రాజకీయ కవులు అనగానే కులాన్ని వర్గంగా చూసేవారో, లేదా కుల వివక్ష గురించి మాత్రమే రాసేవారో మాత్రమే కాదు. ఇక్కడ ఏది రాజకీయ కవిత్వమో నిర్ణయించేది సమాజం కులంతో నిర్మితమైనదా లేక వర్గంతో నిర్మితమైనదా అన్న చర్చ కాదు. రాజ్యానికి వ్యతిరేకమైన గొంతు వినిపించేది రాజకీయ కవిత్వం అనేది స్పష్టం.

భావ కవిత్వం గురించీ, రాజకీయ–సామాజిక కవిత్వం గురించీ ఆలోచించినప్పుడు భావకవిత్వం సాధించిన శైలీగాఢతను రాజకీయ కవిత్వం సాధించ లేకపోయిందనీ, అలాగే రాజకీయ–సామాజిక కవిత్వం సాధించిన వస్తువైవిధ్యాన్ని భావకవిత్వం సాధించలేకపో యిందనీ అర్థమవుతుంది. దీనికి రెండు కారణాలు అనుకోవచ్చు. భావ కవికి పరిమితమైన వనరులు మాత్రమే ఉన్నాయి. నదీ, చెట్టూ, పుట్టా, పూలూ, ప్రేయసీ, ఆకాశమూ, చీకటి ఇవి మాత్రమే. ఇందులో ప్రధానంగా ప్రేమ, విరహం, ప్రేమరాహిత్యం, శృంగారం వస్తువులుగా ఉంటుంటాయి. కానీ రాజకీయ–సామాజిక కవి అలా కాదు. దేశంలో, విదేశంలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో పావుల కదలికల్ని చూడాలి. అవి సమాజం మీద చూపే ప్రభావాల గురించి ఆలోచించాలి. సమాజంలో ఉన్న పీడన, హింస, దోపిడీ వాటి మార్పు ఇవన్నీ ఉన్నాయి.


రాజకీయ–సామాజిక కవి తనని తప్ప లోకాన్నంతా కవిత్వం చేస్తే, భావకవి లోకాన్ని తప్ప తనని మాత్రమే కవిత్వం చేసుకుంటాడు. ఇందులో భావకవి శైలి విషయంలో చూపగలిగిన శ్రద్ధ రాజకీయ కవికి కుదరదు. తనకి ఆవేశం ముఖ్యం. భావకవిలా సున్నితంగా ప్రతి పదాన్ని ఖచ్చితంగా వాడేంత వీలు ఉండదు. అయితే ఏదో ఒక సామాజిక అంశాన్ని తీసుకొని రాసినంత మాత్రాన అది ఉత్తమ కవిత్వంగా మిగిలిపోదు. రాజకీయ సామాజిక కవిత్వంలో కవిత్వపాళ్ళు తక్కువనే అభిప్రాయాలు ఏర్పడటానికి కొన్ని మూస పదాలని, పోలికల్ని ఎక్కువగా వాడుతూ ఉండటమే కారణం కావొచ్చు. అభ్యుదయ కవిత్వం మొదలై కొనసాగిన కాలంలో కానీ, అస్తిత్వ ఉద్యమ కవిత్వం మొదలై కొనసాగుతున్న కాలంలో కానీ ఒక మూస ఫార్ములాలతో కవిత్వం వెల్లువెత్తటం వల్ల కూడా రాజకీయ సామాజిక కవిత్వం మీద అందులో కవిత్వపాళ్లు తక్కువ అనే అపవాదు స్థిరపడి ఉంటుంది. రాజకీయ–సామాజిక కవిత్వం రాసినంత మాత్రాన అందులో కవిత్వస్థాయి తక్కువ ఉంటుందనుకోవటం పొరపాటే. అయితే భావకవిత్వం లోని గాఢత, రాజకీయ–సామాజిక కవిత్వం లోని గాఢత రెండూ ఒకటి కాదు. రెండూ భిన్నమైన అనుభూతులు. శ్రీశ్రీ ‘దేశ చరిత్రలు’, కృష్ణశాస్త్రి ‘స్వేచ్ఛా విహారం’ కవితలు ఒకేరకమైన అనుభూతిని ఇవ్వవు. కవిత్వం అనగానే ఏకపక్ష అనుభవమే ఉంటుంది అనుకోవటం వలన వచ్చే సమస్యలు కావచ్చు ఇవన్నీ.

అయితే అసలైన కవిత్వం ఏమిటి? అనే ప్రశ్నను మళ్లీ వేసుకుంటే భావకవి గాఢమైన శైలా? రాజకీయ–సామాజిక కవి వైవిధ్యమైన వస్తువా? అనే రెండు ప్రశ్నలు ముందుకు వస్తాయి. ఈ రెండూ కలిసినది స్వచ్ఛమైన కవిత్వం అని తెలివిగా బదులు చెప్పుకోవచ్చు కానీ, తన తాజా పదాలను, గాఢమైన శైలిని చూసుకొని నేనే అచ్చమైన కవిని అని ఉబ్బిపోయే భావకవి, రాజకీయ– సామాజిక కవిత్వం రాసి లోకానికి ఎంతో మేలు చేస్తున్నా అని బీరాలు పలికే రాజకీయ కవి... ఈ రెండు వర్గాల మధ్య కవిత్వం గురించి స్థిరమైన వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నంతకాలం, మళ్లీ మళ్లీ కవిత్వాన్ని అర్థం చేసుకోవటానికి, మనం కవిత్వమంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకోవాల్సిందే.

గూండ్ల వెంకట నారాయణ

Updated Date - Aug 11 , 2025 | 01:39 AM