History Debate: భావి భారతంపై వర్తమాన చర్చలేవీ?
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:28 AM
సమస్త ప్రజల వారసత్వమే చరిత్ర. అది, సంప్రదాయ ఊరుమ్మడి భూములు లేదా అధునాతన ఇంటర్నెట్ లాంటి ఒక భాగస్వామ్య వనరు. దానిని నిష్పాక్షికంగా అర్థం చేసుకోవాలి....
సమస్త ప్రజల వారసత్వమే చరిత్ర. అది, సంప్రదాయ ఊరుమ్మడి భూములు లేదా అధునాతన ఇంటర్నెట్ లాంటి ఒక భాగస్వామ్య వనరు. దానిని నిష్పాక్షికంగా అర్థం చేసుకోవాలి, శ్రేయస్సును సమకూర్చేలా ఉపయోగించుకోవాలి. నిరంతర ప్రయోజనమున్న వనరు అది. మరి దీన్ని సక్రమంగా సార్థకం చేసుకుంటున్నామా? ఉమ్మడి వనరులను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు కదా. అందుకే చరిత్ర.. రాసేవాడి, రాయించేవాడి దృక్కోణం ప్రకారం పదే పదే పునర్లిఖితమవుతూనే ఉంటుంది– తదనంతర అధ్యయనాలు, పరిశోధనలు పాత చరిత్రలలోని కల్పితగాథలు లేదా మిథ్యా సత్యాలను సప్రమాణంగా తిరస్కరించేవరకే సుమా! ఆర్యుల చరిత్రనే తీసుకోండి. ఆర్యులు ఉత్కృష్ట జాతివారని, భారత్ తదితర దేశాలను స్వాయత్తం చేసుకుని అక్కడి ప్రజలకు ‘నాగరికత’ అలవర్చారని ‘యూరోపియన్ చరిత్రకారులు, సిద్ధాంత స్రష్టలు ఘంటాపథంగా చెప్పారు. అంధానుకర్తలు అయిన కొంతమంది భారతీయ చరిత్రకారులు ఆ వాదాన్నే బలపరిచారు. వాస్తవమేమిటి? ఆర్యజాతి శ్రేష్టత అనేది ఒక మిథ్య. ఇండో– ఆర్యన్లు మన గడ్డపై అడుగుపెట్టకపూర్వమే భారతదేశంలోని చాలా ప్రాంతాలలో పురాతన నాగరికతలు వర్ధిల్లాయి. పురావస్తు తవ్వకాలలో బయల్పడిన కీళడి నాగరికత అందుకొక ఉదాహరణ (తమిళనాడులోని శివగంగ జిల్లాలో వైగై నదీ తీరాన క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాల నాటికే ప్రభవించిన పట్టణ నాగరికత అది).
అమెరికాను క్రిస్టోఫర్ కొలంబస్ ‘కనుగొన్నాడు’ అని మనం పాఠశాల చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాం. అది అనేక విధాలుగా నిజం కాదు. ఇప్పుడు అమెరికాగా సుప్రసిద్ధమైన భూమిపై కొలంబస్ అడుగుపెట్టకపూర్వమే అనేక శతాబ్దాలుగా అక్కడ వేలాది స్త్రీ పురుషులు నివసించారు. సంఘటితంగా తమవైన నాగరికతలు నిర్మించుకున్నారు. కొలంబస్‌కు ఐదు సంవత్సరాల పూర్వమే ఉభయ అమెరికా ఖండాలకు నార్త్ వైకింగ్‌లు చేరుకున్నారని అధునాతన పరిశోధనలు రుజువు చేశాయి.
రాజకీయవేత్తలు తమ ఇష్టానుసారం చరిత్ర ప్రస్తావించడం కద్దు. చరిత్రను తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమే వారి లక్ష్యం. జాతీయ గేయం ‘వందేమాతరం’ను కాంగ్రెస్ పార్టీ ఛిన్నాభిన్నం చేసిందని భారతీయ జనతా పార్టీ, దాని నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ ఆరోపించాయి. వందేమాతరం ఎందుకు ‘National Anthem’ కాలేకపోయిందనే విషయమై పార్లమెంటు ఉభయ సభలలో ఒకరోజంతా చర్చ జరగాలని బీజేపీ పట్టుబట్టింది. ఆ పార్టీ తరఫున చర్చలో పాల్గొన్నవారు వందేమాతరం గురించి తాము విశ్వసిస్తున్న ‘చరిత్ర’ను ఏకరువుపెట్టారు. అది వక్రీకృత చరిత్ర. మరింత స్పష్టంగా చెప్పాలంటే అది ‘Distory’ (వక్రీకృత చరిత్ర భావనలు, వాటి కథన రీతులను మిళితం చేసే పదమది). డిస్టరీ కథనాలు వాస్తవాలను మార్చివేస్తాయి. నిర్దిష్ట భావజాలాలను పోత్సహిస్తాయి. అవగాహనలను నియంత్రిస్తాయి. తమ రాజకీయ అజెండాకు అనుగుణంగా చారిత్రక సంఘటనలకు తప్పుడు భాష్యం చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానపాత్ర వహించారు. పార్లమెంటులో జరిగిన చర్చలో ఆయన ఇలా అన్నారు: ‘1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సమరం తరువాత, భారతదేశ పాలనను ప్రత్యక్షంగా చేపట్టిన బ్రిటిష్‌వారు ఈ దేశ ప్రజలను అనేక ఒత్తిళ్లకు గురిచేస్తూ అన్ని విధాలా అణచివేస్తున్నారు. అప్పుడు బంకించంద్ర ఛటర్జీ తన కలాన్ని ఝుళిపించారు. వలసపాలకులను సవాల్ చేశారు. వారి అధర్మ పాలనను ప్రశ్నించారు. ఆ శక్తిమంతమైన ధిక్కారం నుంచి వందేమాతరం ప్రభవించింది’. ప్రధానమంత్రి ఇంకా ఇలా అన్నారు: ‘1937 అక్టోబర్ 15న లక్నోలో వందేమాతరం గీతంకు వ్యతిరేకంగా మహమ్మద్ అలీ జిన్నా ఒక నినాదాన్ని లేవనెత్తారు. ముస్లింలీగ్ జారీ చేసిన నిరాధార ప్రకటనలను దృఢంగా ప్రతిఘటించలేదు.
ఖండించలేదు. ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతరంను జాతీయ గీతంగా గౌరవించడంపట్ల కాంగ్రెస్ నిబద్ధతను పునరుద్ఘాటించలేదు. పైగా జాతీయ గీతంగా వందేమాతరం అర్హతను ప్రశ్నించడం ప్రారంభించారు. 1937 అక్టోబర్ 20న నేతాజీ బోస్‌కు రాసిన ఒక లేఖలో వందేమాతరంపై జిన్నా వ్యతిరేకతను అంగీకరిస్తూ ‘వందేమాతరం గీతం నేపథ్యం గురించి చదివాను. ఆ నేపథ్యం ముస్లింలను రెచ్చగొట్టే విధంగా భావిస్తున్నాను’ అని నెహ్రూ పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై నరేంద్ర మోదీ తన దాడిని ఇంకా ఇలా కొనసాగించారు: ‘దురదృష్టవశాత్తు 1937 అక్టోబర్ 26న వందేమాతరంపై కాంగ్రెస్ రాజీపడింది. జాతి చైతన్యమంత్రంగా భాసిల్లుతున్న ఆ గీతంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే అంగీకరించింది. తద్వారా ముస్లింలీగ్‌కు కాంగ్రెస్ లొంగిపోయింది. ముస్లింలీగ్ నాయకుల ఒత్తిడిమూలంగా బుజ్జగింపు రాజకీయాలను అనుసరించడం ప్రారంభించింది. ఐఎన్‌సీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) ఎమ్‌ఎమ్‌సీ (ముస్లింలీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్)గా అయిపోయింది’ అన్నారు. ‘జాతీయ గీతం వందేమాతరంను ముక్కలు చేయడం బుజ్జగింపు రాజకీయాలకు దారితీసింది. ఇది అంతిమంగా దేశ విభజనకు కారణమయింది’ అని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇది అసంబద్ధమైన విమర్శ, సందేహం లేదు. వివాదాస్పద చారిత్రక వివరణలు ఇచ్చేవారు సైతం నమ్మశక్యం కానిదిగా భావించే ఊహాత్మక ఆలోచన అది.
వందేమాతరం కాలక్రమాన్ని చూద్దాం: 1870లు: బంకించంద్ర ఛటర్జీ తన అజరామర గీతం వందేమాతరంలోని కొన్ని చరణాలు రాశారు. అవి అప్పుడు ప్రచురితం కాలేదు; 1881: ఆ గీతం విస్తృత రూపంలో ‘ఆనంద్ మఠ్’ నవల్లో ప్రచురితమయింది; 1905: స్వదేశీ ఉద్యమంలో నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరంను ఆలాపించారు. ఆ ఉద్యమంలోనే వందేమాతరం రాజకీయ నినాదం అయింది; 1908: తమిళ కవి సుబ్రమణ్య భారతి ‘వందేమాతరం’ అనే పదబంధాన్ని తన సుప్రసిద్ధ పద్యం ‘ఎంతాయియుమ్ థయమ్’లో ప్రస్తావించడం ద్వారా దానికి అమరత్వాన్ని సాధించారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వందేమాతరం అని నినదించడం ప్రారంభించారు; 1930లు: మతతత్వ రాజకీయాలు పడగవిప్పాయి.
వందేమాతరం వివాదాస్పదమయింది; 28 సెప్టెంబర్ 1937: వందేమాతరంపై పెరుగుతున్న వ్యతిరేకతపై సర్దార్ పటేల్‌కు రాసిన లేఖలో రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గీతం పట్ల కాంగ్రెస్ విధానాన్ని స్పష్టం చేయాలని సూచించారు; 1937 అక్టోబర్‌లో కలకత్తాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా వందేమాతరంపై రవీంద్రుడి సలహాను నేతాజీ బోస్ కోరారు; 17 అక్టోబర్, 1937: సీడబ్ల్యూసీ సమావేశంలో వందేమాతరం గురించి చర్చించాలని నెహ్రూకు రాసిన లేఖలో బోస్ కోరారు; 20 అక్టోబర్ 1937: వందేమాతరంపై వివాదాన్ని మతతత్వ వాదులే సృష్టించారని, ఈ విషయమై రవీంద్రుడు, ఇతరులతో చర్చిస్తానని బోస్‌కు రాసిన లేఖలో నెహ్రూ పేర్కొన్నారు; 26 అక్టోబర్, 1937: వందేమాతరంలోని మొదటి భాగం స్ఫూర్తిదాయకమైనదని, అందులోని చరణాలు ఏ మతస్థులకూ అభ్యంతరకరం కావని, కాబోవని నెహ్రూకు రాసిన లేఖలో రవీంద్రుడు పేర్కొన్నారు; 28 అక్టోబర్, 1937: వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను జాతీయ గేయంగా సీడబ్ల్యూసీ అంగీకరించింది; జనవరి 1939: మహాత్మాగాంధీ సమక్షంలో వార్ధాలో జరిగిన సమావేశంలో వందేమాతరం మొదటి రెండు చరణాలను జాతీయ గేయంగా అంగీకరిస్తున్నట్టు సీడబ్ల్యూసీ పునరుద్ఘాటించింది.
ఒక National Anthem లేదా జాతీయ గేయానికి కొన్ని చరణాలు ఎంపిక చేయడమనేది అసాధారణమేమీ కాదు. మన National Anthem ‘జనగణ మన’ రవీంద్రుని సంపూర్ణ గీతానికి సంక్షిప్త రూపం.. చాలా దేశాల National Anthemలు సంపూర్ణ గీతాల సంక్షిప్త రూపాలే కావడం గమనార్హం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గానీ, భారతీయ జనతా పార్టీ తొలి అవతారమైన భారతీయ జనసంఘ్ గానీ భారత స్వాతంత్ర్యోద్యమంలో ఎలాంటి పాత్ర నిర్వహించలేదు. అలాగే వందేమాతరం గేయాన్ని జనప్రియమైనదిగా చేయడంలో కూడా ఆ సంస్థలకు ఎలాంటి ప్రమేయం లేదు. ఈ వాస్తవాన్ని ప్రస్తావించకుండా దాటవేయడంలో నరేంద్ర మోదీ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. నిజానికి ఆరెస్సెస్ 52 సంవత్సరాల పాటు తన జాతీయ ప్రధాన కార్యాలయంలో మువ్వన్నెల జెండా ఎగరవేయనేలేదు!
1937 నుంచి రెండు చరణాల జాతీయగేయంపై ఎవరూ ఎలాంటి వివాదాన్ని లేవనెత్తలేదు. ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారు? ప్రజలు వర్తమానంలో ఎదుర్కొంటున్న సమస్యలను, జాతికి సమున్నత భవిష్యత్తును నిర్మించే లక్ష్య నిర్దేశాల గురించి పార్లమెంటు, ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అవి వాటి విధ్యుక్తధర్మాలు. చైనా రాజ్యాంగ సంస్థలు రోబోలు, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, అంతరిక్ష పరిశోధనల, మహాసముద్రాల శోధన, డేటా సవాళ్లు; ఈ అధునాతన పరిణామాలు ధరిత్రిపై మానవ మనుగడను ప్రభావితం చేస్తోన్న, చేయబోయే తీరుతెన్నుల గురించి చర్చిస్తున్నాయి. వర్తమాన భారతీయ సమాజం పేదరికం నిర్మూలన, విద్యా వసతుల మెరుగుదల, ఆరోగ్యభద్రత, మౌలిక సదుపాయాల నిర్మాణం, వస్తుసేవలను సమృద్ధంగా అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, వాణిజ్యలోటు, వాతావరణ మార్పు తదితర సమస్యలు, సవాళ్ల నెదుర్కొంటోంది. అసమానతల పెరుగుదల, జనాభా వృద్ధి, అంతర్గత వలసలు, లౌకికవాదం, అధునాతన వైజ్ఞానిక సాంకేతికతలు మొదలైనవి భావి భారత సమాజాన్ని సతమతం చేసే సవాళ్లు. చరిత్ర వక్రీకరణ మహా చెడ్డ విషయం, దేశ సమైక్యత, సమగ్రతకు హానికరం. జాతి భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం క్షమార్హం కాని నేరం.
పి. చిదంబరం