మనిషి ఏడ్వడం చూస్తాం
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:09 AM
విప్లవాన్ని కాంక్షిస్తూ కవిత్వం రాసిన కవయిత్రులను మినహాయిస్తే మిగిలిన కవయిత్రులు సాధారణంగా స్త్రీలకు సంబంధించిన అనేకానేక అంశాలమీద...
విప్లవాన్ని కాంక్షిస్తూ కవిత్వం రాసిన కవయిత్రులను మినహాయిస్తే మిగిలిన కవయిత్రులు సాధారణంగా స్త్రీలకు సంబంధించిన అనేకానేక అంశాలమీద ఉక్కిరిబిక్కిరి అయి, వాటి మీదే తమ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని కవిత్వీకరించారు. అయితే ఇందుకు భిన్నంగా భూమి, రైతు, అనంతర పరిణామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కవయిత్రి అమూల్య చందు ‘భూమి నవ్వడం చూశాను’ అనే పద్యం రాసారు. ‘‘మా తాత పంచె కట్టినప్పుడు... భూమి నవ్వడం చూసాను’’ అంటూ పద్యాన్ని ప్రారంభించారు అమూల్య చందు. నవ్వుతూన్న భూమి వివిధ సందర్భాల్లో కన్నీరు కార్చడం, తాతకు దండం పెట్టడం, తాత చేతుల్ని ముద్దాడ్డం వంటి ప్రతీకలు నేలతల్లితో రైతుకున్న సంబంధాన్ని చెబుతాయి. అంత వరకూ వివిధ సందర్భాల్లో రైతుకు, భూమికి మధ్య బాంధవ్యాన్ని చెప్పిన కవయిత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పడ్డాక అదే భూమి ఓడిపోయి పొడి నవ్వును నవ్వింది అన్నారు. ఇది పైకి సాధారణ వాక్యాల కూర్పులా కనపడుతుందేమో కాని దీని వెనుక పల్లెల్లో కూడా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల క్రూర హింస ఉంది.
ఈ పద్యం చదివిన తర్వాత నా మటుకు నాకు మా కోనసీమలో పచ్చని పొలాలు, కొబ్బరితోటల ఎకరాలు కళ్ల ముందే సెంట్లు, గజాలుగా రూపాంతరం చెందుతున్న విషాదం కనిపించింది. ఈ వాస్తవ దారుణాలను చూసి కవిత్వం రాస్తే సరిపోతుందా అని కొందరు బుద్ధిజీవులు అనుకోవచ్చు. సరిపోకపోవచ్చు. కానీ రైతుల గురించి, వారికి దూరమవుతున్న భూమి గురించి కన్నీరు కారుస్తున్న వారు ఉన్నారని తెలుసుకోవాలి కదా, ఈ అమూల్య చందు లాగా. అందుకే... అమూల్య రాసిన పద్యం నన్ను కదిపింది. కుదిపింది. కన్నీరైంది.
ముక్కామల చక్రధర్
99120 19929
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..
DK Aruna: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..